కుట్రలు కంటికి కనిపించేంత స్పష్టంగా, ఆలోచనలకు అందేంత విపులంగా ఉండవు. అవి తేనె పూసిన కత్తుల్లా ఉంటాయి. విప్లవోద్యమంలో కోవర్టుల్లా ఉంటాయి. తీపికి భ్రమిస్తామో గొంతుకలను తెగ్గోస్తాయి. నమ్మకంతో కునుకు తీశామో దళాలకు దళాలనే అంతమొందిస్తాయి. ప్రమాదం పైకి కనిపించని ఊబిలా ఉంటుంది. కాలు మోపామో కానరానంత లోతులోకి కూరుకుపోతాము.
ఇవ్వాల తెలంగాణ అస్తిత్వం కూడా ఇలాగే అనేక కుట్రల చట్రంలో బందీ చేయబడుతున్నది. ఒకవైపు పాలకుల అణచివేతల కుట్రలు, మరోవైపు వివిధ పార్టీల స్వార్థపూరిత రాజకీయ కుట్రలు. ఇంకో వైపు పరోక్షంగా సీమాంధ్ర పెట్టుబడిదారుల అసత్య ప్రచారాల కుట్రలు. ఇంకా తెలంగాణ అస్తిత్వాన్ని నీరుగార్చాలనే ఉద్దేశంతో రాజముద్రలో రాచరికపు ఆధిపత్య పెత్తనపు ఆనవాళ్లున్నాయని తెలంగాణ చారిత్రక సాంస్కృతిక ఆనవాళ్లను చెరిపివేసే కుట్రలు. ఉద్యమ నేతల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న మీడియా కుట్రలు. తెలంగాణలో పుట్టి, తెలంగాణకే ద్రోహం చేస్తున్న ఇక్కడి నేతల కుట్రలు. కంటికి స్పష్టంగా కనిపించని, ఆలోచనలకు విస్పష్టంగా అందని, అభివృద్ధి ఆచరణను అస్థిరపరచే ఇన్నిరకాల కుట్రలను ఛేదించి, మన కర్తవ్యాన్ని బోధ పర్చుకొని సంపూర్ణ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైంది.
తెలంగాణకు ఇప్పటికింకా సంపూర్ణ స్వాతంత్య్రం సిద్ధించనే లేదు. ఎప్పుడూ ఎవరో ఒకరి పరోక్ష ఆధీనంలో పరాధీనంగానే ఉండిపోతున్నది. ఇకపై ఏ ఆంక్షల్లేని, ఎలాంటి వివక్షలకు తావులేని, పౌర హక్కులకు భంగం వాటిల్లని, ప్రజాస్వామిక విలువలతో కూడుకున్న తెలంగాణ నిర్మాణానికి అడుగులు వేయాలి. సాహితీవేత్తల భావుకతల్లో, సిద్ధాంతకర్తల ఉపన్యాసాల్లో, ఉద్యమకారుల ఆకాంక్షల్లో, కళాకారుల ఆటపాటల్లో వ్యక్తమైన తెలంగాణ ఎలా ఉండాలో, ఎన్నికల సమయంలో తెరమీదికి వచ్చి, ఎన్నెన్నో కబుర్లు చెప్పిన నాయకులకు ఏం తెలుస్తుంది? తెలంగాణ ఆత్మను స్పృశించే అవగాహన కానీ, అర్హత కానీ వారికి ఎక్కడ ఉంటుంది?
భాష, సంస్కృతి, చరిత్ర, కళలు అన్నీ విధ్వంసానికి గురై ఆత్మన్యూనతలోకి నెట్టివేయబడ్డ స్థితిలోంచి, అస్తిత్వ మూలాలను పునర్బలోపేతం చేసుకొని, సాంస్కృతిక పునరుజ్జీవన లక్ష్యంగా ముందుకు సాగినప్పుడే సంపూర్ణ తెలంగాణను సాధించుకున్నట్టు లెక్క. వలసవాదులు స్థిరపరచిన వ్యాపార సంస్కృతి నుంచి, ఆధిపత్య భావనల నుంచి మనల్ని మనం విముక్తి చేసుకొని, ఇదీ తెలంగాణ భాషా సంస్కృతుల వైభవం, ఇదీ తెలంగాణ భౌతిక వికాసం, మానవీయ విలువలు అంతస్సూత్రంగా కలిగిన తెలంగాణ అభివృద్ధి ఇదీ అని ప్రపంచానికి చాటిచెప్పడం కోసం మనమంతా అస్తిత్వ స్పృహతో ఏకం కావలసిన సందర్భం. నూతన పంథాలో, పదునైన ఆలోచనలతో, కొత్త కొత్త ఎత్తుగడలతో ప్రజలను పోరాటాలకు సిద్ధం చేయాల్సిన సమయం. ఆ బాధ్యత తెలంగాణలో ఉన్న విద్యావంతులు, మేధావులు, బుద్ధిజీవులు, మొత్తంగా తెలంగాణ పౌర సమాజం, ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకత్వంపై ఉన్నది.
(వ్యాసకర్త: బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)
నారదాసు
లక్ష్మణ్‌రావు