‘గుమ్మిల వడ్లు గుమ్మిల్నే ఉండాలె.. గూటమోలె పిల్లలుండాలంటే ఎట్లా?’ అనే సామెత మన క్రీడారంగానికి సరిగ్గా సరిపోతుంది. దేశంలో క్రీడాకారులు లేరా అంటే లక్షల్లో ఉన్నారు. సత్తా లేదా అంటే సరిపడా ఉన్నది. కానీ, ప్రోత్సాహమే సున్నా. ప్రభుత్వాల నుంచి అదే కరువైంది. చిన్ననాటి నుంచే క్రీడలను ప్రోత్సహించే వాతావరణం మన దేశంలో కరువైంది. దేశంలో మైదానాలు లేని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాలయాలే అధికం. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు ఆటలెలా ఆడుతారు? క్రీడల్లో ఎలా రాణిస్తారు? అందుకే విద్యార్థులు సెల్ఫోన్లకు బానిసలుగా మారుతున్నారు.
జనాభా రీత్యా యావత్ ప్రపంచంలో మన దేశానిదే అగ్రస్థానం. 142.5 కోట్ల జనాభా ఉన్న చైనాను ఎప్పుడో అధిగమించిన మన దేశం 144.17 కోట్లకు చేరుకున్నది. తాజా బడ్జెట్లో కేంద్రం క్రీడారంగానికి రూ.3,442.32 కోట్లు కేటాయించింది. స్వతంత్ర భారతదేశంలో ఇప్పటివరకు ఇదే అత్యధిక మొత్తం. అయినా, ఇది మొత్తం బడ్జెట్లో 1.65 శాతమే. అంటే.. ఏడాదికి ఒకరికి రూ.23.90 కేటాయించారన్న మాట. అంటే.. నెలకు ఒకరికి కేవలం రెండు రూపాయలు. మనదేశంలో 14 ఏండ్లలోపువారు 24 శాతం, 10-17 ఏండ్లలోపు 17 శాతం, 10-24 ఏండ్లలోపువారు 26 శాతం మంది ఉన్నారు. ఒక్కొక్కరికి నెలకు రెండు రూపాయలు కేటాయిస్తే క్రీడల్లో ఎలా రాణిస్తారు? అందుకే వందేండ్ల విశ్వక్రీడా వేదిక ఒలింపిక్స్ చర్రితలో మనం చాలా వెనుకబడి ఉన్నాం. అనేక దేశాలు పదుల సంఖ్యల్లో పతకాలు కైవసం చేసుకుంటుంటే.. ఆపసోపాలు పడి సాధించే ఒకటో రెండో కాంస్య పతకాలతోనే మనం సంబురపడిపోతున్నాం. ప్రధాని నుంచి ప్రముఖుల వరకు ప్రశంసలు కురిపిస్తున్నారు. సాధించినదానికి సంతృప్తి పొంది అదే విజయమనుకొని పొరపడుతున్నాం. అందుకే జనాభాలో అగ్రభాగాన ఉన్న భారత్.. విశ్వక్రీడల్లో 41వ ర్యాంకు దగ్గరే ఆగిపోయింది.
‘మా బడిలో ఆటలు ఎక్కువ ఆడించేవారు. రోజూ సాయంత్రం నేను స్నేహితులతో కబడ్డ్డీ ఆడేవాడిని. కొన్నాళ్లకు నేనే స్కూల్ కబడ్డ్డీ జట్టుకు కెప్టెన్‌ను అయ్యా. అందరిని కలుపుకొని వెళ్తూ ఒక్కమాట మీద ఉండేలా చూస్తూ రోజూ కబడ్డీ ఆడేవాడిని. ఒకరకంగా చెప్పాలంటే కబడ్డీ ఆటే నాకు నాయకత్వ లక్షణాలు నేర్పింది’ అని ఇటీవల ప్రధాని మోదీ చెప్పారు. కానీ, మానవాభివృద్ధిలో ఎంతో కీలకపాత్ర పోషించే క్రీడారంగానికి నిధులు కేటాయించేందుకు మన పాలకులకు మనసు రావడం లేదు. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను తీర్చిదిద్దాలనుకుంటున్న మోదీ.. ఆటలను ఎందుకో పట్టించుకోవడం లేదు. అందుకే విశ్వక్రీడా వేదికపై మన ఖ్యాతి వెలవెలబోతున్నది.
ప్రస్తుతం పారిస్ ఒలింపిక్స్‌లో 32 క్రీడాంశాల్లో 329 పతకాలకు పోటీలు జరుగుతున్నాయి. 200కు పైగా దేశాల నుంచి 10,500 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. భారత్ నుంచి 117 మంది క్రీడాకారులు 16 విభాగాల్లో పోటీ పడుతున్నారు. అంటే సుమారు 1.10 కోట్ల మందికి ఒక్కరు చొప్పున భారత్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1896లో ఆధునిక ఒలింపిక్స్ ప్రారంభం కాగా, భారత క్రీడాకారులు ఇప్పటివరకు 25 సార్లు పాల్గొన్నారు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో అత్యధికంగా ఏడు పతకాలు గెలవడమే మన రికార్డు. ఒకే ఒలింపిక్స్‌లో మనం పట్టుమని పది పతకాలు గెలుచుకోలేకపోతున్నాం. గత 12 దశాబ్దాల ఒలింపిక్స్ చరిత్రలో భారత్ మొత్తం 35 పతకాలు మాత్రమే గెలుచుకోగలిగింది. వీటిలో 10 స్వర్ణ, 9 రజత, 16 కాంస్య పతకాలున్నాయి. ఒలింపిక్స్‌లో మొత్తం 204 దేశాలు తలపడుతుంటే 2020 టోక్యో ఒలింపిక్స్ పతకాల పట్టికలో భారత ర్యాంకు 47. అంటే క్రీడల్లో మనం ఎక్కడ ఉన్నామో ఇట్టే అర్థమవుతుంది.
1896లో ఆధునిక ఒలింపిక్స్ ప్రారంభమైనా భారత్ మాత్రం 1900 పారిస్ ఒలింపిక్స్ నుంచే పాల్గొంటున్నది. 1920 ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు తొలిసారిగా పాల్గొన్నా.. 1928 ఆమ్స్టర్డామ్ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు తొలి బంగారు పతకం సాధించిందంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వ్యక్తిగత విభాగంలో పతకం సాధించడానికి 1952 గేమ్స్ వరకు వేచిచూడాల్సి వచ్చింది. పురుషుల కుస్తీలో కేడీ జాదవ్ కాంస్య పతకం సాధించడం ద్వారా చరిత్ర సృష్టించగా.. ఆ తర్వాత వ్యక్తిగత పతకం గెలుచుకోవడానికి భారత్‌కు 44 ఏండ్లు పట్టింది. అట్లాంటా ఒలింపిక్స్ టెన్నిస్ పురుషుల సింగిల్స్‌లో లియాండర్ పేస్ కాంస్య పతకం నెగ్గే వరకు భారత్‌కు మరో వ్యక్తిగత పతకం దక్కలేదు. భారత్ వ్యక్తిగత విభాగంలో బంగారు పతకం సాధించడానికి 2008 బీజింగ్ ఒలింపిక్స్ వరకు వేచిచూడాల్సి వచ్చింది. పిస్టల్ షూటింగ్ పురుషుల విభాగంలో అభినవ్ బింద్రా తొలి స్వర్ణంతో చరిత్ర సృష్టిస్తే.. ఆ తర్వాత పుషరకాలంలోనే 2020 టోక్యో ఒలింపిక్స్‌లో బల్లెం వీరుడు నీరజ్ చోప్రా రెండో స్వర్ణ పతకం అందించాడు.
ఒలింపిక్స్ ప్రారంభంలో ఒకటి లేదా రెండు పతకాలకు పరిమితమైన భారత్.. 2008 బీజింగ్ ఒలింపిక్స్ నుంచి పతకాల సంఖ్యను పెంచుకుంటూపోతున్నది. బీజింగ్ ఒలింపిక్స్‌లో 3 పతకాలు, 2012 లండన్ ఒలింపిక్స్‌లో 6, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో 7 పతకాలు
మనకు వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఒలింపిక్స్‌లో డబుల్ డిజిట్ చేరుకోవడానికి ఇంకా ఎన్నేండ్లు పడుతాయో! విశ్వక్రీడా వేదికపై టాప్ 20 ర్యాంకు కోసం ఇంకా ఎన్ని సంవత్సరాలు వేచిచూడాలో! టాప్ టెన్‌లో భారత్ నిలవడం మనం చూస్తామో లేదో! కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లలో క్రీడారంగానికి ఇలాగే కేటాయింపులుంటే ఒలింపిక్స్‌లో పతకాల పట్టికలో టాప్‌లోకి రావడం కలలో కూడా సాధ్యం కాదేమో!
-లట్టుపల్లి విక్రమ్
97015 87979