తరాల తరబడి గిరిపుత్రులు అడవులపై ఆధారపడి జీవిస్తున్నారు. వారికి అడవులే ఆయువుపట్టు, చెట్టూ పుట్టలే కొండంత బలం. వారి చావు పుట్టుకలు, వేడుకలు, విషాదాలు ఆ అడవితల్లి ఒడిలోనే జరుగుతాయి. అలాంటి అడవి ఉత్పత్తుల్లో కీలకమైంది ఇప్పపువ్వు. ప్రకృతి ఒడిలో సహజ సిద్ధంగా పెరిగే ఇప్పపువ్వు చెట్లు గిరిజనుల పాలిట ఆశాదీపం. ఇప్పచెట్టే గిరిజనుల ఆరాధ్య దైవం.
వసంత రుతువు ప్రారంభంలో ఇప్పపూలు ఎక్కువగా పూస్తాయి. ఈ పూలతో అటవీ ప్రాంతమంతా మల్లెపూలు పరిచినట్టు గుమగుమ వాసనలతో గుభాళిస్తుంది. ఆదివాసీలు ఇప్పచెట్టుకు పూజలు చేసి పండుగ చేసుకుంటారు. ఆ తర్వాతి రోజునుంచి తెల్లవారి కోడికూతకు ముందే మేల్కొంటారు. చిన్నా, పెద్దా, ముసలీ, ముతకా అందరూ సమీప అడవుల్లోకి తట్టాబుట్టలతో వెళ్తారు. మండుటెండను సైతం లెక్కచేయక ఇంటిల్లిపాది చెట్టు చుట్టూ తిరుగుతూ ఇప్పపూలను సేకరిస్తారు. చెట్టుకు ఉన్న పూలను అస్సలే తెంపరు. కింద రాలిపడిన పూలను మాత్రమే ఏరుకొస్తారు.
ఇప్పపువ్వు సర్వరోగ నివారిణి: ఇప్పపువ్వు అనగానే అందరికీ గుర్తొచ్చేది ఇప్ప సారా. సంప్రదాయ వేడుకల్లో ఆడ, మగ తేడా లేకుండా అందరూ ఇప్పసారా తాగటం ఆదివాసీల ఆనవాయితీ. తెలంగాణ కుంభమేళా సమ్మక్క-సారక్క తల్లులకు, గ్రామ దేవతలకు ఇప్ప సారాను నైవేద్యంగా సమర్పిస్తారు. భద్రాద్రి రాములవారి ప్రసాదంలో ఇప్పపువ్వే ప్రధానమైనది. ఇప్ప గింజలలో నూనె 35 శాతం, ప్రోటీన్లు 14 శాతం ఉంటాయి. గింజల నుంచి తీసిన నూనెను దీపారాధనలో ఉపయోగిస్తారు. వనస్పతి ఉత్పత్తులకు, సబ్బుల తయారీకి కూడా ఈ పువ్వును ఉపయోగిస్తారు. చీడపీడల నివారణకు, మోకాళ్ల నొప్పులకు ఈ నూనెతో మర్దన చేస్తే అద్భుతమైన ఉపశమనం లభిస్తుంది. నూనె తీసిన తర్వాత పిప్పిని భూమిలో వేస్తే పంటపొలాలకు సహజమైన ఎరువుగా ఉపయోగపడుతుంది.
ఔషధాల గని: పండిన 100 గ్రాముల ఇప్పపువ్వులో 111 కాలరీల శక్తి, 73.60 గ్రాముల నీరు, 22.70 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 1.40 గ్రాముల ప్రోటీన్లు, 1.60 గ్రాముల కొవ్వులు, 0.70 గ్రాముల మినరల్స్, 45 మి.గ్రా. కాల్షియం, 22 మి.గ్రా.ఫాస్పరస్, 0.23 మి.గ్రా. ఐరన్, 40 గ్రాముల సీ విటమిన్, 307 మైక్రో గ్రాముల విటమిన్ ఏ ఉంటాయి. ఇప్పపువ్వును రోట్లో వేసి దంచి రసాన్ని తీసుకొని తాగినా, రోజుకు నాలుగైదు పూలను తిన్నా రక్తపోటు అదుపులో ఉంటుం ది. గ్యాస్ట్రిక్ సమస్యను, మలబద్ధకాన్ని తగ్గించి నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇందులో ఉన్న సీ విటమిన్ చర్మ సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
పండిన ఇప్పపువ్వు కంటే ఎండబెట్టిన పువ్వులో ఎక్కువ పోషక విలువలుంటాయి. అందుకే గిరిజనులు వంటలకు కూడా ఉపయోగిస్తారు. ఇప్ప కుడుములు, ఇప్ప ఇడ్లీలు, జొన్నపిండితో, గోధుమపిండితో ఇప్ప పూలు చేర్చి రొట్టెలు చేస్తారు. పకోడీలు, ఇప్పపువ్వు జావ, పల్లీపట్టీలు తయారుచేస్తారు. గోంగూర ఇప్పపువ్వు కలిపి కూర చేస్తారు. ఇప్పపూల మసాలా తయారు చేసుకొని వాడుతారు. ఇప్ప పూలతో లడ్డూలనూ తయారుచేస్తారు.
అడవుల్లో నివసించే ఆదివాసీలకు పోషకాహార లోపం ఎక్కువగా ఉంటుంది. ఏజెన్సీ ప్రాంతంలో గర్భిణీల్లో పదివేల మందిలో 150 మంది చనిపోతున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అప్పుడే పుట్టిన వెయ్యి మంది బిడ్డల్లో 48 మంది చనిపోతున్నారు. గర్భిణీలో హిమోగ్లోబిన్ శాతం తక్కువ గా ఉండటం వల్ల ఎర్ర రక్త కణాలు తగ్గిపోయి రోగనిరోధక శక్తి లేక అనేక రోగాల బారిన పడుతున్నారు. కొన్ని సమయాల్లో మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, దీన్ని అధిగమించడం కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఐటీడీఏ అధికారులు డ్వాక్రా మహిళలకు ట్రైనింగ్ ఇప్పించి ఇప్పపువ్వు పల్లీ పట్టీలను, లడ్డూలను తయారు చేయిస్తున్నారు. వాటిని కొనుగోలు చేసి అంగన్వాడీ సెంటర్లలో చిన్నపిల్లలకు, గర్భిణీలకు ఉచితంగా పంచుతున్నారు. దీంతో కొంతవరకు పోషకాహార లోపాన్ని, శిశుమరణాల రేటును తగ్గించగలిగారు.
ఇదే విధంగా ఏటూరు నాగారం, తాడ్వాయి తదితర ఏజెన్సీ ప్రాంతాల బిడ్డలు ఆరోగ్య ప్రదాయిని అయిన ఇప్పపూల వంటలను తమకు కూడా అందించి పోషకాహార లోపాన్ని అరికడతారని ఆశతో ఎదురుచూస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో డ్వాక్రా మహిళలు ‘ఆదివాసీ ఆహారం’ పేరుతో మార్కెట్లో పెట్టి అమ్ముతున్నారు. వారి ఆదాయ మార్గాల్లో ఇది ప్రధానం. ఇప్పపూలతో ఈ విధంగా ఇటు ఆరోగ్యం, అటు ఆదాయం రెండూ లభిస్తున్నాయి. ఇప్ప చెట్టు ఆయుష్షు సుమారు మూడు వందల ఏండ్లు. ఇవి జంతువులకు, పక్షులకు ఆహారం, ఆవాసాన్ని ఇస్తున్నాయి.
ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి అటవీ ఉత్పత్తులను సేకరించే ఆదివాసీలు.. వాటిని ఎలా అమ్ముకోవాలో తెలియక దళారుల ను నమ్మి మోసపోతున్నారు. అటవీ ఉత్పత్తులను ప్రభుత్వమే కొని తమకు జీవనోపాధి కల్పించాలని అడవి బిడ్డలు కోరుతున్నారు. సృష్టికి మూలం జీవం- జీవనానికి మూలం వనం. జీవవైవిధ్యాన్ని పరిరక్షించుకుంటేనే ప్రకృతి సమతుల్యత, మానవ మనుగడ కొనసాగుతాయి. కాబట్టి వనాలను రక్షించుకుందాం, వన్య ప్రాణులను సంరక్షించుకుందాం.
(వ్యాసకర్త: తెలుగు అధ్యాపకురాలు)
కొమ్మాల సంధ్య
91540 68272