భిన్న సంస్కృతులకు, భాషలకు, మతాలకు కేంద్రంగా వర్ధిల్లుతున్న భారతదేశంపై బీజేపీ ‘ఒకే జాతి, ఒకే సంస్కృతి’ అనే భీకర దాడి కొనసాగిస్తున్న ప్రస్తుత తరుణంలో.. దేశంలోని ప్రజాస్వామ్య ప్రియులకు ఏకైక ఆశగా హైదరాబాద్ నిలుస్తున్నది. ఈ నగరం చూపుతున్న ఈ ప్రతిఘటన వెనుక శతాబ్దాల దక్కన్ విశిష్ట చరిత్ర ఉన్నది. ఆ వారసత్వాన్ని కొనసాగించాలి, హైదరాబాద్ స్ఫూర్తిని దేశవ్యాప్తం చేయాలంటూ హైదరాబాదీ అయిన సి.యామినీ కృష్ణ పిలుపునిస్తున్నారు. ‘ది వైర్’లో ప్రచురితమైన వ్యాసంలోని ముఖ్యాంశాలు..
వివిధ స్థల కాలాలకు చెందిన ఈ
వేర్వేరు ఘటనలు, సందర్భాలు..హైదరాబాద్, దక్కన్ విశిష్టతను తెలియజేస్తున్నాయి. నేటి మెజారిటేరియన్ హిందుత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా నిలిచే గడ్డ ఇది అని వెల్లడిస్తున్నాయి. దక్కన్ స్ఫూర్తికి నేడు హైదరాబాద్ నగరం సమున్నత పతాకంలా రెపరెపలాడుతున్నది.
హైదరాబాద్ ఎలాంటి లోపాల్లేకుండా పరిపూర్ణంగా ఉన్నదని కాదు. దానికున్న సమస్య లు దానికి ఉన్నాయి. అయినా, ఈ నగరానికి చెందిన వ్యక్తిగా.. ప్రత్యామ్నాయ ఆలోచనలు సాధ్యమేనన్న నమ్మకం నాకు కలిగిస్తుంది హైదరాబాద్. ఈ నగరానికి ఉన్న ఈ విశిష్టత కారణంగానే.. హైదరాబాద్‌ను మార్చివేయాల ని ఆర్ఎస్ఎస్-బీజేపీ చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంట్లో భాగమే.. హైదరాబాద్ చరిత్రను మార్చిచెప్పటం, చార్మినార్ ను ఆనుకొని ఉండే భాగ్యలక్ష్మి గుడి కేంద్రంగా రాజకీయాలు చేయటం, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల ర్యాలీలు, బహిరంగ సమావేశాలు, ఇటీవల జరిపిన బీజేపీ కార్యవర్గ సమావేశాలు.
భీకరమైన ఈ హిందుత్వ దాడికి హైదరాబాద్ వీరోచితంగా ఎదురునిలబడి పోరాడుతున్నది. మన ఆలోచనలను, మన ఊహ లను ఆక్రమించుకోవాలనుకునే వారికి వ్యతిరేకంగా హైదరాబాదీలుగా మనం ఎదురు నిలుస్తున్నాం. ఈ సజీవ, బహుళ, బహువిధ ఆలోచనలే నేడు యావత్ భారతదేశానికి అవసరం. దేశంలోని పలు ప్రాంతాలు ఈ ఆలోచనలను కలిగి ఉన్నాయి. కానీ ‘ఏక జాతి’ అంటూ హిందుత్వ చేస్తున్న దాడి కింద అవి అణిగిపోయాయి. ఇటువంటి సమయంలో హిందుత్వ ఆధిపత్యానికి వ్యతిరేకంగా, బహుళ సంస్కృతికి చెందిన గొంతులకు వేదికగా నిలుస్తున్నది హైదరాబాద్. హైదరాబాద్ స్ఫూర్తిని మరింత పరిపుష్ఠం చేయాలి. దేశవ్యాప్తం చేయాలి.
1. హైదరాబాద్-పుణె బస్సు దిగి పుణెలో ఆటో ఎక్కా. కాషాయ జెండాలను ప్రదర్శిస్తూ ఓ ర్యాలీ నడుస్తోంది. అదేమిటని ఆటోడ్రైవర్‌ను అడిగా. ‘అదొక హిందుత్వ ర్యాలీ. ఈ పట్టణంలో అది మామూలే. మాది యూపీలోని ప్రతాప్‌గఢ్. నేను డిగ్రీ చదివా. ఇక్కడికొచ్చి నా స్నేహితుడి ఆటోరిక్షా తీసుకొని నడుపుతున్నా’ అని చెప్పాడు. రోడ్డు పక్కనున్న ‘హిందువులదే హిందుస్థాన్’ అనే హోర్డింగ్ ను దాటుకొని వెళ్తున్నాం. ఆయన తన మాటలను కొనసాగిస్తున్నాడు. ‘మేము ముస్లింలం. యూపీలో మాది రాజకీయ కుటుంబం. కానీ, ఆ రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయాలను చూడలేక ఇక్కడికి వచ్చా. ఈ రోజుల్లో ఈ తరహా విద్వేష వాతావరణం పెరుగుతున్నది. ఇంతకూ మీరెక్కడి నుంచి?’ అని అడిగాడు. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నానని చెప్పా. ‘అచ్చా షెహర్ హై (అది మంచి నగ రం). హైదరాబాద్ ఇటువంటిది కాదు. నా తమ్ము డు అక్కడికే వెళ్లాడు. అక్కడ ఈ పిచ్చి లేదని విన్నా’ అని అన్నాడు.
2. రెండేండ్ల కిందట జనవరిలో హైదరాబాద్‌లోని మెహదీపట్నంలో క్రిస్టల్ గార్డెన్స్ వద్ద భీంఆర్మీ నాయకుడు చంద్రశేఖర్ ఆజాద్ కోసం ఎదురుచూస్తున్నాం. అక్కడ ఏర్పాటైన సభనుద్దేశించి ఆయన ప్రసంగించాల్సి ఉంది. హిజాబ్ ధరించిన ఓ 50 ఏండ్ల పైబడిన మహిళ తన పక్కనున్న ఇతర మహిళలకు చెప్తున్నారు. ‘దళితులు, బహుజనులకు గొప్ప కార్యక్షేత్రం తెలంగాణ. ఇక్కడ ఎంతో చేయవచ్చు’.
3. ఏప్రిల్ 1945లో హైదరాబాద్ నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ సౌజన్యంతో జరుగుతున్న దక్క న్ హిస్టారికల్ కాంగ్రెస్‌లో ఉస్మానియా యూనివర్సిటీ వీసీ నవాబ్ అలీ యావర్ జంగ్ ప్రసంగిస్తున్నారు. ‘భారతదేశంలో ఒకే తరహా మూస పాలనను ఏర్పాటుచే యాలన్న ఉత్తరాది ప్రయత్నాల కు, ఒత్తిళ్లకు దక్షిణాది ఎదురొడ్డి నిలబడుతున్నది. ఇదే దక్షిణాది విశిష్టత’.
4. నవంబరు 2017లో ఉర్దూను ద్వితీయ అధికార భాషగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇది మైనారిటీలను ఆకర్షించే కార్యక్ర మం అంటూ బీజేపీ ఆరోపించింది. భాషకు మతాన్ని ఆపాదించేవాళ్లకు హైదరాబాద్ రాజ్యంలో ఉర్దూకు ఉన్న సుదీర్ఘచరిత్ర తెలియదనుకోవాలి. ఈ రాజ్యం అనేక భాషలకు కేంద్రంగా వర్ధిల్లింది. దాశరథి రంగాచార్య తన ఆత్మకథ ‘జీవనయానం’లో తెలుగు, ఉర్దూ తనకు రెండూ సమానమని చెప్పారు. కాళోజీ ఆత్మకథ ‘నా గొడవ’లో ఇలా రాశా రు… ‘మా అమ్మ కన్నడ, మరాఠీ మాట్లాడేది. పెండ్లి తర్వాతే ఆమె తెలుగు నేర్చుకుంది. మా నాన్న కు మరాఠీ రాదు. కాకపోతే ఆయన పూర్వీకులు మహారాష్ట్రీయులు కాబట్టి, ఆ భాషను కొంత అర్థం చేసుకునేవాడు కానీ, మాట్లాడలేకపోయేవాడు. ఆయన హిందీ, ఉర్దూ మాట్లాడేవాడు. అయినా, మా అమ్మా నాన్న ఒకర్నొకరు అర్థం చేసుకున్నారు. మేము మా నాన్నతో ఉర్దూలో, అమ్మతో మరాఠీలో, దోస్తులతో తెలుగులో మాట్లాడేవాళ్లం. తీన్ బత్తీ, చార్ రాస్తా..’
5. ‘దేశంలోని వివిధ ప్రాంతాల్లో కాషాయీకరణ పెరిగిపోతున్న తరుణంలో, కాస్త ఊపిరి పీల్చుకునే నగరంగా హైదరాబాద్ కొనసాగుతున్నది. నేను ఇక్కడి వ్యక్తిని కా బట్టి అలా అంటున్నానేమో కూడా!’.. నా ఎకడమిక్ ఫ్రెం డ్స్‌తో నా సంభాషణ. దానికి వారి సమాధానం.. ‘మేం ఇక్కడివాళ్లం కాకపోయినా, ఇక్కడికి కావాలనే వచ్చాం. భారతదేశ న్యూయార్క్ నగరం వంటిది హైదరాబాద్’.
6. దక్కన్ యోధురాలు మహారాణి చాంద్బీబీ. ఈమె ప్రతిఘటన కారణంగానే అక్బర్ తన సామ్రాజ్యాన్ని ఇటువైపు విస్తరింపలేకపోయాడు. ఉత్తరాది ఆధిపత్యానికి వ్యతిరేకం గా నిలిచే దక్కన్కు ఒక సమున్నత వ్యక్తీకరణ చాంద్బీబీ.
7. సమకాలీన పరిస్థితుల గురించి ఇద్దరు చరిత్రకారులు మాట్లాడుకుంటున్నారు. ‘మనవైన వాటన్నింటినీ వాళ్లు లాగేసుకుంటున్నారు. వాటిని కాషాయీకరిస్తున్నారు’; ‘మనం చూస్తూ ఊరుకోవద్దు. భీకరదాడి జరుగుతున్నప్పటికీ మరోవిధంగా ఆలోచించేందుకు మనం సాహసించాలి. మన ఊహలనూ గుంజుకోవాలని వాళ్లు ప్రయత్నిస్తారు. కానీ, మనం తిప్పికొట్టాలి. సమిష్టితత్వం, సోదరభావం గురించి మన ఊహలను కొనసాగించాలి’.