‘ఇసంత రమ్మంటే ఇల్లంతా నాదే’ అన్నట్లుంది కేంద్ర ప్రభుత్వం వ్యవహారం. మన ‘మిషన్ భగీరథ’ను కాపీ కొట్టి.. కనీసం కృతజ్ఞతైనా తెలుపకపోగా.. ఇప్పుడు తెలంగాణలో ఇంటింటికీ తామే ‘జల్ జీవన్ మిషన్’ ద్వారా నల్లా నీళ్లు ఇస్తున్నామని మీడియాలో ప్రకటనలు వేసుకోవటం అనైతికం. ఇది కేంద్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు అంటూ మంత్రి కేటీఆర్ వ్యక్తం చేసిన ఆగ్రహం సరైనది. తెలంగాణలో ఏ ఇంటికీ తాగు నీళ్ల గోస లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ మదిలో రూపుదిద్దుకున్న మానవీయ పథకం మిషన్ భగీరథ. ఇంటింటికీ సురక్షితమైన నల్లా నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగబోము అంటూ చెప్పి మరీ గడువులోగా ఈ ప్రాజెక్టును కేసీఆర్ 2016లో పూర్తి కావించారు. ఈ పథకాన్ని వేనోళ్ల పొగిడిన నీతి ఆయోగ్ రూ.19,000 కోట్ల నిధులను తెలంగాణకు ఇవ్వాలని కేంద్రానికి సిఫారసు చేసిం ది. పైసా ఇవ్వటానికి కూడా ముందుకురాని కేంద్రం కాపీ కొట్టడంలో మాత్రం ముందుంది. ‘జల్ జీవన్ మిషన్’ ప్రాజెక్టు కింద ‘హర్ ఘర్ జల్’ పేరుతో గతేడాది నుంచి అమలుచేయటం ప్రారంభించింది.
తెలంగాణ పథకాలను యథాతథంగా వేరే పేర్లతో కేంద్రం అమలుచేయటం ఈ ఒక్కదానికే పరిమితం కాలేదు. 2018లో రైతుబంధు మన దగ్గర ప్రారంభం కాగానే.. మరుసటి ఏడాది ‘పీఎం కిసాన్ యోజన’ పేరుతో మొదలుపెట్టింది. 2014లో ప్రారంభమైన మిషన్ కాకతీయను ‘అజాదీకా అమృత్ సరోవర్’ పేరుతో ఈ ఏడాది తీసుకొచ్చింది. కానీ తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా పకడ్బందీగా రూపొందించలేదు, చిత్తశుద్ధితో అమలుచేయడం లేదు. ఇది కేంద్ర ప్రభుత్వ భావదారిద్య్రానికి, కృతజ్ఞతకు నిదర్శనం. మనది సమాఖ్య రాజ్యం. రాష్ర్టాలు, కేంద్రం పరస్పరం సహకరించుకుంటేనే దేశం పురోగతి చెందుతుంది. ఈ విషయం పట్ల కేంద్రానికి అవగాహన ఉంటే.. తెలంగాణ తెచ్చిన పథకాలు నచ్చినప్పుడు, వెన్నుతట్టి ప్రశంసించి, దేశవ్యాప్తంగా వాటిని అమలుచేస్తామని బహిరంగంగా ప్రకటించేది. కానీ, ప్రస్తుతం దేశాన్ని పాలిస్తున్న మోదీ సర్కారుకు రాష్ర్టాలంటే తీవ్రమైన చులకనాభావం, విపరీతమైన అహంభావం. కాబట్టే, ఈ రకమైన ఆలోచనల తస్కరణలు, అబద్ధపు ప్రచారాలూ.
సంక్షేమ పథకాలైనా, ప్రాజెక్టులైనా వాటంతట అవి గాలిలోంచి పుట్టవు. ప్రజల పట్ల ప్రేమ, వారి సమస్యలపై అవగాహన, వాటికి పరిష్కారం కనుగొనాలన్న ఆర్తి, అందుకోసం సుదీర్ఘమైన మేధోమథనం ఉండాలి. నిర్దిష్ట కార్యక్రమాన్ని రూపొందించుకోవాలి. దాని అమలులో వచ్చే సాధకబాధకాలు తెలిసి ఉండాలి. ఆ తర్వాత పకడ్బందీగా ఆచరణలోకి తీసుకెళ్లాలి. ఇన్ని దశలు దాటుకుంటే గానీ ఒక పథకం ఉనికిలోకి రాదు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశంలో తీసుకువచ్చిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రైతుబంధు, కల్యాణలక్ష్మి, దళితబంధు వంటి పథకాలతో పాటు, కాళేశ్వరం తదితర సాగునీటి ప్రాజెక్టులన్నీ కూడా ఇంతటి కసరత్తు తర్వాత ఊపిరిపోసుకున్నవే. అందుకే అవి కేంద్రానికే కాదు.. దేశంలోని పలు రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. వేరే పేర్లతో అమలవుతున్నాయి. కాబట్టి, తెలంగాణ పథకాలను కాపీ కొట్టే బదులు, ఈ తెర వెనుక కృషిపై మోదీ సర్కారు దృష్టిసారిస్తే తమ పార్టీకి మంచిది.. దేశానికీ మంచిది.