‘త్వరలోనే ఒక సంచలన ప్రకటనను చూస్తా’రని టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ఇతర రాష్ర్టాల పర్యటన సందర్భంగా ఆత్మవిశ్వాసంతో ప్రకటించారంటే, దేశానికి ప్రత్యామ్నాయ అజెండా అవసరమన్న తన ప్రతిపాదన క్రమంగా ఇతరులను మెప్పిస్తున్నదనుకోవాలి. 75 ఏండ్ల పాటు భంగపడిన దేశానికి ఇప్పుడు కావలసింది గతంలో వలె కేవలం అధికారం కోసం పాకులాడే ప్రతిపక్ష ఫ్రంట్లు కాదని, దేశాన్నీ, ప్రజలనూ అన్నిరంగాల్లో ముందుకు తీసుకుపోగల గుణాత్మక శక్తులని ఆయన వివరణాత్మకంగా, పట్టుదలగా చేస్తున్న వాదనలకు ప్రతిచోటా ఏకాభిప్రాయం లభిస్తున్నట్లు కనిపిస్తున్నది.
దేశానికి ప్రత్యామ్నాయ అజెండాతో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరమని కేసీఆర్ స్పష్టమైన రీతిలో చెప్తూ అందుకోసం ప్రయత్నించటం 2018లోనే మొదలైంది తప్ప ఇది కొత్త కాదు. ఆ సంవత్సరం ఆరంభంలోనే తను ఈ విషయమై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతోపాటు మరికొందరు ప్రముఖులను కలిశారు. అది తొలిదశ. అప్పటినుంచి ఈ నాలుగేళ్లలో కేసీఆర్ ఆలోచనలు, అవి గతకాలపు ప్రతిపక్ష ఫ్రంట్లకన్న భిన్నమైనవనే విషయం దేశంలోని రాజకీయవాదులకు, విద్యావంతులకు, మీడియాకు తగినంతగా దృష్టికివచ్చింది. అయితే వివిధ కారణాల వల్ల అందుకొక ఊపు అనదగ్గది ఆ కాలంలో రాలేదు. మనది సువిశాలమైన వైవిధ్య దేశం కావటం, వివిధ రాజకీయపార్టీలు, ప్రతిపక్షాలలోని అధికార పక్షాలు, అధికారంలో లేనివి కూడా ఇంకా గతంలోనే జీవిస్తూ తమ అధికారం గురించిన ఆలోచనలకు పరిమితమై ఉండటం, అసలు ఈ దేశానికి కావలసిందే ప్రత్యామ్నాయ అభివృద్ధి అజెండా అన్న ఒక విప్లవాత్మకమైన, ఆదర్శవంతమైన మాట వారి మనస్సులలోకి తేలికగా నాటుకొనకపోవటం వంటివి ఈ కారణాలలోకి వస్తాయి. ఇవి చాలవన్నట్లు చిరకాలపు అధికారపక్షాలైన కాంగ్రెస్, బీజేపీలకు, ముఖ్యంగా ఇన్నేండ్ల అభివృద్ధి రాహిత్యానికి తామే కారణమైనందున ‘ప్రత్యామ్నాయ అభివృద్ధి అజెండా’, అందుకోసం తగిన రాజకీయ వేదిక అన్న మాటలే సరిపడగలవి కావు. ఆ ప్రయత్నాలను భంగపరిచేందుకు వారు శాయశక్తులా ప్రయత్నిస్తారు.
అప్పటినుంచి నాలుగేళ్లు గడిచేసరికి దేశంలో పరిస్థితులు మారాయి. వివిధ రంగాలలో అభివృద్ధి లేమి కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నది. అధిక సంఖ్యాకులైన ప్రజలకు జీవితం దుర్భరంగా మారుతున్నది. ఏ రంగంలో పనిచేసేవారు కూడా సంతృప్తిగా లేరు. పనులు అసలు లేనివారు, లేదా సరైన పని లేనివారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. పెడదారి పట్టించే కొన్ని రాజకీయాలు తప్పితే, ప్రజలకు నిజంగా ఆశావహంగా కన్పించేవి లేకుండాపోయాయి. అంతటా అసంతృప్తి, అశాంతి, తీరని అవసరాలు, క్షీణిస్తున్న శాం తిభద్రతలతో దేశ ప్రజలకు ఏమీ పాలుపోకుండా ఉన్నది. మరొకవైపు వీలైనంత ఎక్కువగా, వేగంగా అధికార కేంద్రీకరణకు, రాష్ర్టాల హక్కులను, రాజ్యాంగబద్ధ అధికారాలను, రాజకీయ వెసులుబాట్లను స్వతం త్ర భారత చరిత్రలోనే ఎన్నడూలేని విధంగా హరించి ఉక్కిరిబిక్కిరి చేసేందుకు నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవి కనీసం పరోక్ష పద్ధతిలోనో, ఏదో ఒక ముసుగులోనో గాక బాహాటంగా సాగుతున్నాయి. వీటన్నింటి పర్యవసానంగా దేశ స్వాతంత్రోద్యమ లక్ష్యాలు, మహత్తరమైన మన రాజ్యాంగ నిర్దేశనాలు, ఆశయాలు అన్నీ భ్రష్టుపట్టి పోతున్నాయి. చివరికి ఈ దేశానికి విలువలు అంటూ లేకుండా పోతూ ఒక భయం గొలిపే సంస్కృతి వ్యాపిస్తున్నది.
దీనిని చీల్చుకొని ఒక ప్రత్యామ్నాయం ఆవిర్భవించవలసిన అగత్యం ఈ రోజున ఈ దేశానికి ఉన్నది. అది ఇప్పటికిప్పుడు రూపుతీసుకుంటుందా మరికొంత కాలానికా? ఎప్పటికి జరిగేను? అన్నది కాదు. కానీ జరగటం ఈ మహత్తర దేశ వర్తమానానికి, భవిష్యత్తుకు ఒక తప్పనిసరి అవసరం. ప్రత్యామ్నాయం అవసరమనే ఆలోచన మాత్రం వ్యక్తావ్యక్తమైన రీతిలో సామాన్య ప్రజల్లో ఏర్పడి విస్తరిస్తున్నది. ఏదో ఒక విధమైన రూపంలో అది వ్యక్తమవుతున్నది. దేనినైనా ఆధారం చేసుకునో, ఏ ఆధారం లేకుండా కూడానో అది అకస్మాత్తుగా బయటపడుతున్నది.
కేసీఆర్ ప్రత్యామ్నాయమంటూ మాట్లాడిన నాలుగేళ్ల క్రితానికి, ఇప్పటికి వస్తున్న ఈ మార్పులను విజ్ఞులు తమదైన రీతిలో గ్రహిస్తూనే ఉన్నారు. సామాన్యులలోనూ అనేకులు మాట్లాడుకుంటున్నారు. దేశ స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని, రాజ్యాంగ లక్ష్యాలను, ప్రజాస్వామిక సంస్కృతిని, దేశ సర్వతోముఖాభివృద్ధి అవసరాలను ఎంతో కొంత మిగుల్చుకొని ఉన్న పార్టీలు, ఇతర రాజకీయశక్తులు ఇందుగురించి మథనపడుతూనే ఉన్నాయి. కేసీఆర్ తన ప్రతిపాదనలను ఇటువంటి తగు సమయంలో తిరిగి ముందుకు తెచ్చినదానికి సరైన స్పందనలు విస్తృతస్థాయిలో రాగలవని ఆశించాలి.
టంకశాల అశోక్