ప్రజాకవిగానే తెలుగు సమాజానికి పరిచయమైన గోరటి వెంకన్నలో లోతైన అధ్యయనవేత్త, నిజమైన మేధావి ఉన్నారని.. సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన సందర్భంగా మీడియాకు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలు తెలియజేస్తున్నాయి. చాలా సాధారణంగా కనిపించే గోరటి వెంకన్న.. తెలుగు సాహిత్యాన్ని ఏ స్థాయిలో చదివి ఆకళింపు చేసుకున్నారో ఆయన మాటలు వెల్లడిస్తున్నాయి. 13వ శతాబ్దం నాటి పాల్కురికి సోమనాథుడి నుంచి నేటి బండి నారాయణస్వామి వరకూ ఆయన చదివారు. ఇంతటి అధ్యయనం ఉండటం వల్లనే అంత సరళంగా గేయాలను గోరటి రాస్తున్నారు.
ఐన్స్టీన్ ఒకసారి ఒక మాట అంటాడు.. Any intelligent fool can make things bigger and more complex. It takes a touch of genius- and a lot of courage to move in the opposite direction. (పండితులుగా చెలామణి అయ్యే మూర్ఖులు విషయాల్ని మరింత సంక్లిష్టం చేస్తుంటారు. కానీ, దానిని మార్చటానికి సాహసవంతుడైన ఒక మేధావి అవసరం పడుతుంది). అంటే విషయాల్ని సరళంగా చెప్పటం, కొత్త దారిలో వెళ్లటం అనేది మేధావి స్థాయి వ్యక్తులు మాత్రమే చేయగలరని అర్థం.
జ్ఞానార్జన గురించి వెంకన్న చెప్పిన మాటలు అక్షరసత్యాలు. ‘సంచారమెంతో బాగుంటది’ అని తాను రాసిన పాట గురించి చెబుతూ.. ‘చెట్లు, పుట్టల వెంట తిరగటం గురించి కాదు ఆ పాట. ఇక్కడ సంచారమంటే జ్ఞానసంచారం.ఒకతాన ఆగిపోకుండా ప్రయాణించాలి. నాకు అప్పుడు ఏది అనిపిస్తే అది రాస్తాను. ఒక్కదానికే కట్టుబడి ఉండే పద్ధతి నాకు లేదు. నేను ఏ ఐడియాలజీకి పరాధీనం కాను. ఏ ఐడియాలజీ సమగ్రం అనుకోను’ అని చెప్పారు వెంకన్న.
ఒక్కదానికే కట్టుబడి ఉంటే దాంట్లోని చెడునుగానీ, కొత్తదానిలోని మంచినిగానీ చూడలేం. మన మెదడు మన కళ్లను, మనలోని సహజసిద్ధమైన తార్కికతను ఆ మేరకు మూసేస్తుంది. రైటిస్టులుగానీ, లెఫ్టిస్టులుగానీ చాలా వరకూ తమ సిద్ధాంతాలనే తప్ప కొత్తమార్పులను అంగీకరించకపోవటానికి కారణం ఇదే. కాబట్టి, జ్ఞానసంచారంతోనే జ్ఞానార్జన సాధ్యమవుతుంది.
జీవితాన్ని కాచివడబోసిన వారిలో, ఒక రంగంలో శిఖరస్థాయిని అందుకున్న వారందరిలో కనిపించే ఉమ్మడి లక్షణం.. వినయం. వేమన, గాంధీజీ, న్యూ టన్, ఐన్స్టీన్ తదితరులను ఎవరిని తీసుకున్నా ఇది కనిపిస్తుంది. ఇది ఎందుకు ఉంటుందంటే.. వినయం ఉంటేనే వ్యక్తుల నుంచిగానీ, సంఘటనల నుంచిగానీ, ప్రకృతి నుంచిగానీ కొత్త జ్ఞానాన్ని, కొత్త సత్యాన్ని స్వీకరించటానికి మన మనసు సిద్ధంగా ఉంటుంది. ఒక అంశానికి సంబంధించి అప్పటికే ఒక స్థిరమైన అభిప్రాయం మన మనసులో ఉన్నప్పుడు ఆ అంశానికి సంబంధించిన కొత్త కోణాన్ని అంటే కొత్త సత్యాన్ని/ కొత్త జ్ఞానాన్ని మనం చూడటానికి నిరాకరిస్తాం. సత్యాన్వేషులు దీనికి భిన్నంగా ఉంటారు.
వారిలో వ్యక్తిత్వం ఎదుగుతున్నకొద్దీ వినయం పెరుగుతుంటుంది. వీళ్లు నేను, నా ప్రతిభ అనే స్థాయి నుంచి ముందుకు ఎదుగుతుంటారు. తరతరాలుగా పోగవుతున్న జ్ఞానసంపదకు తాము కొంత జోడించామనే చెప్పుకొంటారు. నేల మీద నిలబడ్డ మనిషి.. ఓ 50 అంతస్తుల భవనంలోకి వెళ్లి ఒక్కో అంతస్తు ఎక్కుతున్నాకొద్దీ ఏ విధంగానైతే తన చుట్టూ ఉన్న ప్రపంచం మరింత మరింత విశాలం గా కనిపించి, తన అల్పత్వం (నిజానికిది అల్పత్వం కూ డా కాదు. తన వాస్తవ స్థితి) అధికాధికంగా తెలుస్తుం దో అలా.. ఈ విజ్ఞానుల వినయం కూడా తెచ్చిపెట్టుకున్నది కాదు. అదొక సత్యం. వాళ్లు అలాగే ఉంటారు.
గోరటి మాటల్లో కూడా అది మనకు కనిపిస్తుంది చూడండి. తనకు సాహిత్య అకాడమీ అవార్డు లభించటంపై ఆయన స్పందన ‘ఇది మొత్తం వాగ్గేయ పరంపరకు దక్కిన గౌరవంగా భావిస్తాను. నా పని నేను చేసుకుంటూ వెళ్లాను. సాహిత్య అకాడమీ గుర్తించినందుకు కృతజ్ఞతలు’.
ఇక ఈ రోజు దేశంలో ప్రజాస్వామ్యానికే పెను ముప్పుగా తయారైన మత రాజకీయాల గురించి గోరటిలో ఉన్న స్పష్టత.. పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు, మేధావులకు కూడా లేదని చెప్పవచ్చు. ‘హిందుత్వాన్ని పైపైన చూసి విమర్శించటం వల్ల అది పాలకులకు ఆయుధమవుతుంది. పునర్జన్మ, కర్మ, మనువు, పురోహితవర్గం.. దీనికి భిన్నంగా హిందూ మతానికి మరో పార్శం ఉంది. హిందూమతంలోని నిజమైన తత్వధార- కబీర్, తుకారం, నామ్దేవ్, అక్కమహాదేవి, దాసమయ్య, వీరబ్రహ్మం తదితరులు తెచ్చిన తత్వం’ అని గోరటి చెబుతారు.
నిజంగా, దేశానికి మతోన్మాద రాజకీయాల్నించి విముక్తి కలిగించాలంటే అనుసరించాల్సిన మార్గం ఇది. ఎందుకంటే, ఈ దేశంలో మెజారిటీ ప్రజలు మతాన్ని, దేవుడిని విశ్వసించేవాళ్లు. వారిలో ఎమోషన్స్ రెచ్చగొట్టి, పరమతాలపైన ద్వేషాన్ని రెచ్చగొట్టి కొందరు ఓట్లు వేయించుకుంటూ ఉంటే.. దానిని ఎదుర్కోవటానికి, ప్రజలకు అదే మతంలో ఉన్న మంచిని, జ్ఞానాన్ని, సహోదరత్వాన్ని తెలియజేయటమే ఏకైక మార్గం.
దేశంలోని విపక్షాలకు ప్రశాంత్ కిశోర్ సూచిస్తున్నది కూడా ఇదే మార్గం…
“బీజేపీ బలాల్లో అత్యంత కీలకమైన హిందుత్వను ఎదుర్కోవాలంటే.. వాళ్లు ప్రజలకు చెబుతున్నదానికంటే మరింత మెరుగైనదానిని చెప్పాలి” (Prashant Kishors blueprint for the Opposition – India Today – 20 December, 2021 )
యోగేంద్ర యాదవ్ చెబుతున్నది కూడా ఇదే…
“పాజిటివ్ రాజకీయాలు మన సమాజంతో, మన సంస్కృతితో విడదీయలేని, ఆరోగ్యకరమైన సంబంధాన్ని తప్పకుండా కలిగి ఉండాలి. హిందూ మతం పేరిట భారతదేశం అనే భావనపైన ప్రస్తుతం దాడి జరుగుతున్నది. ఈ సంక్షోభ సమయంలో మన సంప్రదాయాలు, వైవిధ్యపూరితమైన మన మత సంస్కృతీ వారసత్వంతో మరింత దగ్గర కావాల్సిన అవసరం ఉంది. దీని పట్ల మనం విముఖత చూపినట్లయితే, ఉపేక్ష వహించినట్లయితే మనం మితవాద రాజకీయాలకు బలికాక తప్పని పరిస్థితి వస్తుంది. మన రాజకీయాలు సజీవత్వాన్ని కోల్పోతాయి. హిందుత్వ పేరిట రాజకీయాలు చేస్తున్నవాళ్లు సరిగ్గా.. మనం ఈ విధంగానే చేయాలని కోరుకుంటున్నారు. కాబట్టి, దీనిని ఎదుర్కోవటానికి ఉన్న ఏకైక మార్గం.. సుసంపన్నమైన మన సాంస్కృతిక వనరులను మనం స్వీకరించటమే. మన సాంస్కృతిక చిహ్నలను తిరిగి ఆవిష్కరించుకోవటానికి మన భాషలను, మన ఇతిహాసాలను, ప్రాచీన, ఆధునిక గ్రంథాలను మనం అధ్యయనం చేయాలి” (If you want to defend India’s republic, don’t just focus on Modi-baiting: the print, 5th January 2022)
సత్యాన్ని చేరుకోవటానికి దారులు వేరుగానీ.. సత్యం ఒక్కటే అన్న మహనీయుల మాటల్ని మరోమారు నిరూపిస్తున్నారు గోరటి వెంకన్న, ప్రశాంత్ కిశోర్, యోగేంద్ర యాదవ్.
–(నేడు కవి, గాయకుడు గోరటి వెంకన్న పుట్టినరోజు)
‘మూట ఎందుకు వెంట హరిదాసా?
దాంట్ల మురికి కూడుతదంట హరిదాసా..
మోసుకొచ్చిందెంత హరిదాసా?
నీవు తీసుకెళ్లేదెంత హరిదాసా?
చూసుకుంటే వింత హరిదాసా..
శూన్యమే నీ బొంత హరిదాసా!’
అంటూ తాను రాసిన ‘తెల్లారిపోతుంది’ అనే తత్వంలో గానం చేసినట్లుగా.. ఆశలకు, ద్వేషానికి, వివాదాలకు చోటివ్వకుండా జీవన ప్రయాణం సాగిస్తున్నారు గోరటి వెంకన్న.
–కె.వి.రవికుమార్