Nari Nari Naduma Murari Trailer | టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ (Sharwanand) నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి నారీ నారీ నడుమ మురారి (Nari Nari Naduma Murari). Sharwa 37 ప్రాజెక్టుగా వస్తోన్న ఈ చిత్రానికి సామజవరగమన ఫేం రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో భీమ్లానాయక్ ఫేం సంయుక్తా మీనన్, ఏజెంట్ ఫేం సాక్షి వైద్య ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తున్నారు.
ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన వస్తుండగా.. మేకర్స్ ఇప్పుడు ట్రైలర్‌ను కూడా షేర్ చేశారు. ఆటోడ్రైవరైన కమెడియన్ సత్య ఓ మహిళను ఆస్పత్రికి తీసుకొచ్చి జాగ్రత్త దింపేసి వెళ్లే క్రమంలో.. ఆ మహిళ డబ్బులు తీసుకో బాబు అని అంటే.. అయ్యో వద్దమ్మా గర్బిణీ స్త్రీల దగ్గర డబ్బులు తీసుకోనమ్మా సత్య అంటాడు. నేను ప్రెగ్నెంట్ కాదు అని ఆ మహిళ అనే ఫన్నీ సన్నివేశంతో షురూ అయింది ట్రైలర్. ఆ తర్వాత బీటెక్ చదివి ఆర్కిటెక్ట్‌గా పనిచేసే క్రమంలో శర్వానంద్‌కు సంయుక్తా మీనన్, సాక్షి వైద్య కలుస్తారు. ఇద్దరి మధ్య ఎలా నలిగిపోతాడనే నేపథ్యంలో సినిమా సాగనున్నట్టు ట్రైలర్ ద్వారా హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్.
ఒక హీరో రెండు ప్రేమకథలు.. ముగింపే లేని సమస్య అంటూ రిలీజ్ చేసిన ట్రైలర్‌ను సెప్టిక్ ట్యాంక్‌కు, చెత్తకుప్పలకు దూరంగా ఉండాలంటే శ్రీకాంత్ అయ్యంగార్ చెప్తున్న డైలాగ్స్ క్యూరియాసిటీ పెంచుతున్నాయి. మొత్తానికి ఓ వైపు ఫన్, మరోవైపు హీరో తిప్పలు.. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ సినిమా ఉండబోతున్నట్టు ట్రైలర్ చెబుతోంది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర తెరకెక్కిస్తున్నారు.