నోటికేది వస్తే అది మాట్లాడతారు.. మాట్లాడుతున్నది తప్పా ఒప్పా! అని చూడరు. ముందు అనేస్తే పోలా.. తరువాతి సంగతి తరువాత..! అన్నట్టుంటది బీజేపీ నేతల కత. ఒక తప్పును కప్పి పుచ్చుకోవడానికి వంద తప్పులు.. ఒకరిని మించి ఇంకొకరు.. నిజాలు అంటేనే తెలియవు. ఇటీవల బీజేపీ దండు దాడిలో భాగంగా రాష్ర్టానికి వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ రెండాకులు ఎక్కువే చదివారు. తెలంగాణ ప్రభుత్వంపై కాకిలెక్కల విమర్శలు, ఆరోపణలు చేశారు. వాటికి తెలంగాణ ప్రభుత్వం గణాంకాలతో సహా జవాబు చెప్పి అబద్ధమని నిరూపించడంతో శనివారం కొత్త తప్పులతో మీడియా ముందు అబద్ధాలు.. అర్ధ సత్యాలు మాట్లాడటంతో నిర్మల అజ్ఞానం.. కేంద్ర ప్రభుత్వం డొల్లతనం బయటపడింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న నిర్మలాసీతారామన్‌కు తెలంగాణ ప్రజలు 15 ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ ప్రశ్నలకు జవాబులివ్వాలని కోరుతున్నారు.
లక్ష కోట్లతో తెలంగాణలో హైవేలు నిర్మిస్తున్నామని కేంద్ర మంత్రి చెప్పారు. మరి మీరు నిర్మించే ప్రతీ హైవేపైన టోల్‌ట్యాక్స్ ఎందుకు వసూలు చేస్తున్నారు? హైవేలు నిర్మించడానికి అయిన ఖర్చును వడ్డీతో సహా వసూలు చేసుకుంటున్నారు. అప్పుడవి మీరు నిర్మించిన రహదారులు ఎలా అవుతాయి?
ప్రశ్న 1
తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని మీరు పదే పదే చెప్తున్నారు. పార్లమెంటులో మాత్రం కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తెలంగాణలో ఆత్మహత్యలు తగ్గాయని ప్రకటించారు. ఏది నిజం? మీరు చెప్పిన ఎన్సీఆర్బీ నివేదికల ప్రకారం.. తెలంగాణలో 2014లో 898 మంది రైతులు చనిపోగా, 2020లో 466 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే తగ్గినట్టా? పెరిగినట్టా? తెలంగాణలో రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడుతున్న నిర్మలా సీతారామన్.. అదే ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం బీజేపీ పాలిత మహారాష్ట్రలో 2,567 మంది, బీజేపీ పాలిత కర్ణాటకలో 1,072 మంది, ఆంధ్రప్రదేశ్ లో 563 మంది ఆత్మహత్య చేసుకున్న విషయం గురించి ఎందుకు మాట్లాడటం లేదు?
ప్రశ్న 2
దేశంలో చిన్న వ్యాపారుల ఆత్మహత్యలు పెరిగాయి. కేంద్రం విధిస్తున్న అడ్డగోలు జీఎస్టీ, అవలంబిస్తున్న దగాకోరు వాణిజ్య విధానం వల్ల, కార్పొరేట్ అనుకూల నిర్ణయాల వల్ల చిన్న వ్యాపారులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతుల ఆత్మహత్యల కంటే కూడా, వ్యాపారుల ఆత్మహత్యలు పెరిగాయి. మీరు చెప్పే ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారమే దేశంలో 2020లో 10,677 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే, 11,716 మంది వ్యాపారులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 2021లో 10,881 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే, 12,055 మంది వ్యాపారులు ఆత్మహత్య చేసుకున్నారు. కార్పొరేట్ కంపెనీలతో తమ వ్యాపారాలు దెబ్బతినడం, అధిక పన్నులు చెల్లించలేకపోవడం వల్ల మాత్రమే వ్యాపారుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని అదే ఎన్సీఆర్బీ నివేదిక చెప్తున్నది. వ్యాపారుల ఆత్మహత్యలకు ఎవరు బాధ్యత వహించాలి? కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాలశాఖ మంత్రిగా మీకు బాధ్యత లేదా? వ్యాపారుల ఆత్మహత్యల్లో కూడా మీరు పాలిస్తున్న కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. దీనికి బీజేపీ బాధ్యత వహించదా?
ప్రశ్న 3
తెలంగాణ అవలంబిస్తున్న వ్యవసాయ విధానాల వల్ల రైతులకు నష్టం కలుగుతున్నదనే దుర్మార్గమైన ఆరోపణ చేశారు. 2014లో బీజేపీ మ్యానిఫెస్టోలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, కనీస మద్దతు ధర పెంచుతామని హామీ ఇచ్చారు. మీ హామీ ప్రకారం 2014లో ఉన్న మద్దతు ధర ఇప్పుడు డబుల్ కావాలి. అయిందా? 2014లో ధాన్యానికి రూ.1,400 మద్దతు ధర ఉండేది. మీ హామీ ప్రకారం అదిప్పుడు రూ.2,800 కావాలి. అయిందా? ఇప్పుడు మద్దతు ధర ఎంత? బిచ్చమేసినట్టు ఏడాదికి వంద రూపాయలు పెంచితే, అది రూ.1,940కి చేరింది. 2014లో మకలకు రూ.1,310 ధర ఉండేది. అది రూ.2,600 కావాలి. అయిందా? ఇప్పుడు మకలకు ఇస్తున్న ధర కేవలం రూ.1,870. పత్తికి 2014లో రూ.3,700 ధర ఉండేది. అది రూ.7,400 కావాలి. అయిందా? పత్తికి మద్దతు ధర ఇప్పుడు కేవలం రూ.5,726. ఇదేనా రైతుల ఆదాయం రెట్టింపు చేయడం అంటే? పంటలకు మద్దతు ధర పెంచాలని తెలంగాణతోపాటు అనేక రాష్ట్రాలు కోరినా ఎందుకు పెంచడం లేదు? ఇది మీ వైఫల్యం కాదా? రైతుల మీద, వారి కష్టం మీద మీకున్న సానుభూతి ఇదేనా?
ప్రశ్న 4
17 వేల కోట్ల రుణమాఫీ ఎకడ చేశారని నిర్మలసీతారామన్ అడుగుతున్నారు. మొన్న ఆయుష్మాన్ భారత్ గురించి కూడా ఇట్లనే అబద్ధాలు వల్లించారు. 2014 నుంచి 2018 వరకే రూ.17వేల కోట్ల రుణమాఫీని తెలంగాణ ప్రభుత్వం చేసింది. 2018 నుంచి రెండో విడత రుణమాఫీ చేస్తున్నది. ఇప్పటికే 25 వేల లోపున్న రుణాలన్నింటినీ మాఫీ చేసింది. మిగతావి ప్రాసెస్‌లో ఉన్నాయి. ఇది నిరూపిస్తే మీరు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్తారా? రైతులు ఈ దేశ పౌరులు కాదా? గతంలో కేంద్ర ప్రభుత్వాలు రుణమాఫీ చేసిన సందర్భాలున్నాయి. మరి నరేంద్రమోదీ ప్రభుత్వం గత ఎనిమిదేండ్లలో ఒక రూపాయి అయినా రుణమాఫీ ఎందుకు చేయలేదు? కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా? రుణమాఫీ కింద దేశంలో మరే రాష్ట్రం ఖర్చు చేయనన్ని నిధులు తెలంగాణ రాష్ట్రం చేసింది. ఈ సవాల్‌కు కట్టుబడి ఉంటారా?
ప్రశ్న 5
తెలంగాణలో కౌలు రైతులకు రైతుబంధు ఎందుకివ్వడం లేదని అడుగుతున్నారు. ఒకే భూమికి ఇద్దరు యజమానులు ఉండరు అనే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం అనేక సార్లు స్పష్టంగా చెప్పింది. అయినా మళ్లీ మళ్లీ అడుగుతున్నారు. కౌలు రైతులపై అంత ప్రేమ ఉంటే, మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కౌలు రైతుల కోసం తీసుకొచ్చిన పథకాలేమైనా ఉంటే చెప్తారా? కేంద్రం ఇచ్చే కిసాన్ సమ్మాన్ యోజన కౌలు రైతులకు ఇస్తున్నారా? సమాధానం చెప్పండి.
ప్రశ్న 6
ఫసల్ బీమా యోజనలో ఎందుకు చేరడం లేదని అడుగుతున్నారు. కట్టే కిస్తీల కన్నా వచ్చే బీమా సొమ్ము తకువ కాబట్టి చేరడం లేదని వ్యవసాయం ఎకువ ఉన్న రాష్ట్రాలన్నీ చెప్తున్నాయి. ప్రధాని సొంత రాష్ట్రం, మీరే అధికారంలో ఉన్న గుజరాత్ కూడా అదే చెప్పింది. లాభం లేని పథకంలో ఎందుకు చేరాలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా మీరు సమాధానం చెప్పండి. ఆ పథకం ప్రారంభం అయినప్పుడు అన్ని రాష్ట్రాలు సమ్మతించాయి. కానీ లెకలు చూసుకుంటే, లాభం కన్నా నష్టమే ఎకువ అని చాలా రాష్ట్రాలు వెనకి పోయాయి. అందులో బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఇది నిజం కాదా?
ప్రశ్న 7
పీఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద 37.95 లక్షల మందికి ఏడాది రూ.6 వేల చొప్పున ఇప్పటికే 7,658 మంది రైతులకు సహాయం చేశామని మీరు చెప్పారు. నిజానికి ఇది తెలంగాణ అమలు చేస్తున్న రైతుబంధు కాపీ. అయినా సరే.. తెలంగాణ ఒకో రైతుకు ఎకరానికి రూ.పది వేలు ఇస్తుంటే, మీరు భూమి ఎంత ఉన్నా రూ.6 వేలే ఇస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం దాదాపు 66 లక్షలకు పైగా రైతులకు సాయం చేస్తున్నది. మీరు 37.95 లక్షల మందికి మాత్రమే ఇస్తున్నరు. మిగతా వారిని రైతులుగా ఎందుకు గుర్తించడం లేదు? మీరు రాష్ట్రంలో తిరుగుతున్న సందర్భంగానైనా మిగతా రైతులందరికీ కేంద్ర సాయం అందేలా చూడండి. కనీసం తెలంగాణకు ఆ మేలైనా జరుగుతుంది.
ప్రశ్న 8
పంటల కోనుగోలు కేంద్రాలు తకువ ఉన్నాయనే మరో అవగాహన లేని ఆరోపణ కూడా కేంద్ర మంత్రి చేశారు. 2014తో పోలిస్తే నేడు తెలంగాణలో పంటల కొనుగోలు కేంద్రాలు 200% పెరిగాయి. 2014లో తెలంగాణలో 24 లక్షల టన్నుల ధాన్యం సేకరిస్తే, నేడు కోటి టన్నులకు పైగా సేకరిస్తున్నది. ఎఫ్‌సీఐకి 2014లో 11 లక్షల టన్నులు అందిస్తే, నేడు 50 లక్షల టన్నులు అందిస్తున్నది. మిగతా పంటల విషయంలో కూడా ఎంత పు రోగతి ఉన్నదో లెకలున్నాయి. ఇది కొనుగోలులో జరిగిన అభివృద్ధి కాదా? రైతులు పం డించిన ప్రతి గింజనూ కొంటామని ప్రకటిం చి, కొనుగోలు చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కాదా? ఈ విధానం దేశంలో మరే రాష్ట్రంలో అయినా అమలు చేశారా?
ప్రశ్న 9
దేశంలో రైతులు బాగుపడాలంటే ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేయాలని తెలంగాణతో సహా అనేక రాష్ట్రాలు కోరాయి. రైతు సంఘాలు కోరుతున్నాయి. నీతి ఆయోగ్‌లో కూడా చర్చకు వచ్చింది. ఎందుకు చేయట్లేదు?
ప్రశ్న 10
నీటి పారుదల ప్రాజెక్టుల గురించి మీరు ఎంత తకువ మాట్లాడితే అంత మంచిది. డీపీఆర్ అంటే ఏమిటో కూడా సరిగ్గా తెలియని వ్యక్తి కేంద్ర ఆర్థికశాఖ మంత్రిగా ఉండ టం దురదృష్టకరం. 2014 ఎన్నికలప్పుడు మోదీ మహబూబ్‌నగర్ బహిరంగసభలో పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 8 ఏండ్లు గడిచినా ఆ హామీ సంగతి ఎందుకు పట్టించుకోవట్లేదు? మీరు ఢిల్లీకి పోయి నరేంద్రమోదీ గారికి ఈ విషయాన్ని గుర్తు చేయండి. తెలంగాణ వాళ్లు మన హామీ గుర్తు చేస్తున్నారని చెప్పండి. తెలంగాణకు పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో ఒకో ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి నిధులు ఇస్తున్నారు. తెలంగాణకు ఎందుకు ఇవ్వడం లేదు? దీనికి సమాధానం చెప్పండి. కాళేశ్వరం ప్రాజెక్టుకు 86 వేల కోట్ల అప్పు మా వల్లే వచ్చిందని చెప్తున్నారు. అప్పులను వడ్డీలతో సహా చెల్లిస్తున్నది తెలంగాణ రాష్ట్రం. అప్పులను కూడా మీ లెకలో వేసుకొని, వాటిని కూడా గొప్పగా చెప్పుకొనే దౌర్భాగ్య స్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది.
ప్రశ్న 11
తెలంగాణలో రేషన్ షాపులో ఇచ్చే బియ్యం గురించి మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 55 లక్షల బీపీఎల్ కుటుంబాలున్నాయి. మీరు ఇందులో సగం కుటుంబాలకు మాత్రమే బియ్యం ఇస్తున్నారు. మిగతా సగం కుటుంబాలు ఏం పాపం చేశాయి? రేషన్ షాపులకు పోతున్నారు. మోదీ ఫొటో పెట్టాలని అడుగుతున్నారు. రాష్ట్రంలోని మొత్తం 55 లక్షల కుటుంబాలను గుర్తించి, ప్రతి వ్యక్తికి 6 కిలోల చొప్పున బియ్యాన్ని కేంద్రం నుంచి ఇప్పించండి. ఫొటో పెట్టుకోండి. కేంద్రాన్ని ఒప్పించి అర్హులందరికీ బియ్యం ఇప్పించే బాధ్యత తీసుకుంటారా?
ప్రశ్న 12
అప్పుల గురించి మళ్లీ మళ్లీ అవే అబద్ధాలు చెబుతున్నారు. తెలంగాణ జీఎస్డీపీలో కేవలం 23.5 శాతం మాత్రమే అప్పులు చేసిందని సాక్షాత్తు రిజర్వు బ్యాంకు స్పష్టం చేసింది. మీ ప్రభుత్వం చెప్పినా అబద్ధాలు ఆగడం లేదు. అప్పులు మంచివి కానప్పుడు దేశ జీడీపీలో 57 శాతం మేర కేంద్రం ఎందుకు అప్పులు చేసిందో నిర్మల గారు సమాధానం చెప్పాలి.
ప్రశ్న 13
లక్ష కోట్లతో తెలంగాణలో హైవేలు నిర్మిస్తున్నామని కేంద్ర మంత్రి చెప్పారు. మరి మీరు నిర్మించే ప్రతీ హైవేపైన టోల్‌ట్యాక్స్ ఎందుకు వసూలు చేస్తున్నారు? హైవేలు నిర్మించడానికి అయిన ఖర్చును వడ్డీతో సహా వసూలు చేసుకుంటున్నారు. అప్పుడవి మీరు నిర్మించిన రహదారులు ఎలా అవుతాయి? టోల్ ట్యాక్స్‌లు కట్టి ప్రజలే నిర్మించుకుంటున్న రహదారులు అవి. అవి కేంద్రం నిర్మించినవే అని చెప్పుకోవాలంటే టోల్ ట్యాక్స్ ఎత్తేయండి. ప్రతి రోడ్డుపైన నరేంద్రమోదీ ఫోటో పెట్టుకోండి. ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. తెలంగాణలో నేషనల్ హైవేల కోసం పెట్టిన ఖర్చును చెప్తున్నారు. మరి టోల్ ట్యాక్స్‌ల ద్వారా తెలంగాణ ప్రజలు రోజుకెంత కడుతున్నారో కూడా లెక చెప్తే బాగుంటుంది.
ప్రశ్న 14
తెలంగాణలో కొత్తగా 7 రైల్వే లైన్లు నిర్మిస్తున్నామని, 7 డబ్లింగ్ పనులు చేస్తున్నామని చెప్తున్నారు. ఇది పూర్తిగా కేంద్రం నిధులతో చేస్తున్నారా? 2014కు ముందు ఈ దేశంలో రైల్వే ప్రాజెక్టులన్నీ కేంద్రం నిధులతో చేపట్టేవారు. కానీ నరేంద్రమోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విధానం మార్చారు. సగం కేంద్రం, సగం రాష్ట్రం అనే నిబంధన పెట్టారు. రైల్వేల ద్వారా జరిగే పనిలో సగం వాటా రాష్ట్రానిది అని ఎందుకు చెప్పడం లేదు? అయ్యే ఖర్చులో సగం రాష్ట్రం భరిస్తున్నా, వచ్చే ఆదాయం మొత్తం కేంద్రమే తీసుకొంటున్నది. ఇది నిజం కాదా? 2014 నుంచి ఇప్పటి వరకు రైల్వేలకు తెలంగాణ నుంచి వచ్చిన ఆదాయం ఎంత? తెలంగాణకు పెట్టిన ఖర్చు ఎంత? శ్వేత పత్రం విడుదల చేయగలరా? మీరు హామీ ఇచ్చిన కాజీపేట రైల్వే డివిజన్ ఎప్పుడిస్తారు? కోచ్ ఫ్యాక్టరీ ఎప్పుడు పెడతారు?
ప్రశ్న 15
తెలంగాణలో 2 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని గొప్పగా ప్రకటించుకున్నారు. రూ.410 రూపాయలున్న గ్యాస్ సిలిండర్ ధరను రూ.1,055 చేశారు. దీనివల్ల చాలా మంది గ్యాస్ పొయ్యిని వాడటం లేదు. చాలా మంది వాపస్ కూడా చేస్తున్నారు. మీరు గ్యాస్ ధరలు పెంచడం వల్ల మళ్లీ కట్టెల పొయ్యి మీద వంటలు వండుకుంటున్న వారి సంఖ్యను కూడా నిర్మల గారు ప్రకటించగలరా? ఇవాళ సగటు పౌరుడు బియ్యం కోసం పెట్టే ఖర్చు కన్నా, గ్యాస్ కోసం పెట్టే ఖర్చు ఎకువ కాదా? ఇది కూడా మీ ఘనతే కదా!
2014 ఎన్నికలప్పుడు మోదీ మహబూబ్‌నగర్ బహిరంగసభలో పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 8 ఏండ్లు గడిచినా ఆ హామీ సంగతి ఎందుకు పట్టించుకోవట్లేదు? మీరు ఢిల్లీకి పోయి నరేంద్రమోదీ గారికి ఈ విషయాన్ని గుర్తు చేయండి. ఏపీ, కర్ణాటకలో ఒకో ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి నిధులు ఇస్తున్నారు. తెలంగాణకు ఎందుకు ఇవ్వడం లేదు?
2014లో ధాన్యానికి రూ.1,400 మద్దతు ధర ఉండేది. మీ హామీ ప్రకారం అదిప్పుడు రూ.2,800 కావాలి. అయిందా? ఇప్పుడు మద్దతు ధర ఎంత? బిచ్చమేసినట్టు ఏడాదికి వంద రూపాయలు పెంచితే, అది రూ.1,940కి చేరింది. ఇదేనా రైతుల ఆదాయం రెట్టింపు చేయడం అంటే? పంటలకు మద్దతు ధర పెంచాలని తెలంగాణతోపాటు అనేక రాష్ట్రాలు కోరినా ఎందుకు పెంచడం లేదు?