రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో మునుగోడు శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. హడావుడిగా ఈ ఉపఎన్నికను తీసుకురావడం వెనుక బలమైన కారణాలున్నాయనేది సుస్పష్టం. రాజగోపాల్‌రెడ్డి చేరికతో బీజేపీ ఈ రాజకీయ క్రీడకు తెరలేపింది. దీన్నిబట్టి అర్థమవుతున్నదేమంటే దక్షిణాదిలో పాగా వేసేందుకు బీజేపీ ఆరాటపడుతున్నది. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా బీజేపీ తప్ప ఇంకో రాజకీయ పార్టీ ప్రభుత్వాలకు తావుండొద్దని రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తూ అడుగులు వేస్తున్నది.
నిజాంను గద్దె దించేందుకు సాగిన సాయుధ పోరాటానికి వక్రభాష్యం చెప్తూ, వల్లభాయ్ పటేల్ మూలంగానే తెలంగాణ విముక్తి జరిగిందన్న ప్రచారాన్ని బీజేపీ చేస్తున్నది. నాటి మహత్తర సాయుధ పోరాటాన్ని హిందూ ముస్లిం సంఘర్షణగా చూపిస్తున్నది.
పాము తాను పెట్టిన గుడ్లను తానే తిన్నట్లుగా, ఆయా రాష్ర్టాల్లో అడుగుపెట్టేందుకు సహకరించిన మిత్రపక్షాలనే బీజేపీ కబళిస్తూ, మిత్ర ద్రోహానికి పాల్పడుతున్నది. మహారాష్ట్రలో శివసేనతో బీజేపీ వ్యవహరించిన తీరు, బీహార్‌లో జేడీ(యూ)ను బలహీనపరిచిన తీరు దేశ ప్రజలు కండ్లారా చూశారు. తనకు మద్దతునిచ్చే ఏఐడీఎంకేను దురాశతో రెండుగా చీల్చింది. డీఎంకే బీజేపీకి అవకాశం ఇవ్వలేదు. తమకు లొంగని పశ్చిమబెంగాల్, ఢిల్లీ ప్రభుత్వాలపై బీజేపీ దాడిని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏపీలో అధికార పార్టీ స్నేహపూర్వకంగా ఉన్నా ఇప్పుడిప్పుడే వైఎస్సార్సీపీపై దాడి మొదలుపెట్టింది.
దక్షిణాదిలో కర్ణాటక తర్వాత తెలంగాణను ఇక స్వాధీనపరుచుకునే ఎత్తుగడలో బీజేపీ ఉన్నది. ప్రగతిశీల భావాలు కలిగిన తెలంగాణలో తమ పప్పులుడకవని, ఇతర పార్టీల్లో బలమైన నాయకులకు గాలం వేసేందుకు అడ్డదారిలో సిద్ధమవుతున్నది. కాంట్రాక్టులు అప్పజెప్తూనో, డబ్బు ఎరగా వేస్తూ, వినకుంటే ఆఖరికి ఈడీ పేర దాడులతోనో తన దారికి తెచ్చుకుంటున్నది. ఆ కోవలోనే మునుగోడుకు ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఉపఎన్నిక గెలవడం కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షానే బీజేపీ ప్రచారాన్ని ప్రారంభించారంటే, ఈ ఎన్నికకు బీజేపీ ఎంత ప్రాధాన్యం ఇస్తున్నదో తేటతెల్లమవుతున్నది. ఈ ఎన్నిక తెలంగాణ భవిష్యత్ రాజకీయ ముఖచిత్రంపై ప్రభావం చూపే ఎన్నిక. మునుగోడు ఉప ఎన్నిక స్థానిక నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించినది కాదని, రాబోయే శాసనసభ ఎన్నికలకు ఒక లిట్మస్ టెస్ట్ నాందీ ప్రస్తావనగా బీజేపీ నాయకులు అభివర్ణిస్తున్నారు.
గతంలో మునుగోడు నియోజకవర్గం నుంచి సీపీఐ ఐదుసార్లు గెలిచింది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత సీపీఐకి పట్టున్న మండలాలు తారుమారయ్యాయి. దీంతో స్వతహాగా గెలువలేని పరిస్థితి అయినప్పటికీ గణనీయమైన సంఖ్యలో ఓట్లున్నాయి. ఈ నేపథ్యంలో వర్తమాన రాజకీయ పరిస్థితులు, క్షేత్రస్థాయి బలాబలాలపై స్థానికంగా జిల్లా, నియోజకవర్గ సీపీఐ నాయకత్వం పరిస్థితిని సమీక్షించింది. బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో గెలువరాదన్నది సీపీఐ రాజకీయ నిర్ణయం.
దానికి కారణాలు, బీజేపీ సైద్ధాంతిక వైఖరి, పార్లమెంటరీ, రాజ్యాంగ వ్యవస్థపై ఎక్కుపెట్టిన దాడి, ప్రభుత్వరంగాన్ని లాభనష్టాలతో నిమిత్తం లేకుండా ధ్వంసం చేసి బడా కార్పొరేట్ సంస్థలకు అడ్డికి పావుసేరుగా అమ్ముతున్న తీరు, ప్రభుత్వ బ్యాంకులను లూటీచేసి అదానీ, అంబానీ లాంటి పెట్టుబడిదారుల అప్పులను రూ.12 లక్షల కోట్లు మాఫీ చేసిన వైనం, సామాన్య ప్రజలు వినియోగించే సరుకులపై మోపుతున్న భారాలు, నిరుద్యోగం పెరుగుదల, రూపాయి పతనం మునుపెన్నడూ ఎరుగని రీతి, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీలు, మహిళలపై దాడులను ఇక్కడ ప్రత్యేకంగా వివరించాల్సిన పనిలేదు. అందుకే బీజేపీ ఓటమికి కృషిచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని భావించాం. సీపీఐ, సీపీఐ(ఎం) ఉభయపార్టీల నాయకులం సంప్రదించుకున్నాం. ఈ నెల 19, 20 తేదీలలో జరిగిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ప్రస్తుతం ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో తెలంగాణ గడ్డను మతోన్మాదుల, నియంతృత్వ, ఫాసిస్టుల చేతుల్లోనికి వెళ్లకుండా కాపాడుకోవాలని భావించాం.
కేంద్ర ప్రభుత్వ విధానాలను సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో ఎండగడుతున్నారు. ఈ ఏడాది జనవరి 8న హైదరాబాద్‌కు విచ్చేసిన వామపక్ష జాతీయ నాయకులను స్వయంగా సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌కు ఆహ్వానించి తన మనోగతాన్ని వెల్లడించారు. ఆగస్టు 19న నేను, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు మాజీ ఎమ్మెల్యేలు పల్లా వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు ప్రగతిభవన్‌కు వెళ్లాం. శత కోటీశ్వరులకు దేశాన్ని తాకట్టు పెడుతున్న మతోన్మాద బీజేపీకి తెలంగాణలో స్థానం లేకుండా చూడాలని, అందుకు మీరు కలిసి రావాలని, భవిష్యత్‌లో లౌకిక, ప్రగతిశీల శక్తులతో కలిసి కార్యాచరణను రూపొందించుకుందామని సీఎం కేసీఆర్ ప్రతిపాదించారు. ఉప ఎన్నికలో మద్దతు కోరారు. అందువల్ల వర్తమాన రాజకీయ పరిస్థితుల్లో బీజేపీని ఓడించే శక్తిగల టీఆర్ఎస్కు మునుగోడులో మద్దతునివ్వాలని సీపీఐ రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్ణయం తీసుకున్నది.
దేశ ప్రతిష్ఠను దిగజార్చుతున్న కేంద్ర ప్రభుత్వ ప్రజా కంఠక పాలనను అంతమొందించాలి. ప్రశ్నించేవారిని, ప్రత్యర్థులను దేశ ద్రోహులుగా, అర్బన్ నక్సలైట్లుగా కేంద్ర ప్రభుత్వం ఫాసిస్టు పోకడలతో చిత్రీకరిస్తూ జైలుపాలు చేస్తున్నది. ఇలాంటి నియంతృత్వ, అప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యతిరేక, ఫాసిస్టు ఆర్ఎస్ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజాతంత్ర, లౌకికపార్టీలు, శక్తులు కలిసి కార్యాచరణ నిర్వహించాలని సీపీఐ జాతీయస్థాయిలో గతంలోనే తీర్మానించింది. అందులో భాగంగానే టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించాం. దాన్ని వామపక్ష శ్రేణులు అర్థం చేసుకున్నాయి. శ్రేయోభిలాషులు యోచించి, తోడ్పాటును అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
(వ్యాసకర్త: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి)
చాడ వెంకటరెడ్డి 94909 52301