నీవెక్కడో
నేనెక్కడో
ఈ దారిలో మనం
కలిసేదెప్పుడో?
దారి ఖర్చుకు యేమీ మిగల లేదు
దాహమేస్తే నదీ దగ్గర లేదు
ఇప్పటికైతే, గుండె చెదిరిపోలేదు
ప్రయాణం యెక్కడా ఆగిపోలేదు
తీగలు తెగిపోతే
ముడి వేయడం నేర్చుకొన్నాను
రాగం ఆగిపోతే
అందుకోవడం అలవర్చుకొన్నాను
ఈ మహిఫిల్ ముగిసేవరకు
శెమ్మా రెపరెప కొట్టుకుంటే
హృదయాన్ని వెలిగించి పెడతాను
ఎవరికి ఇచ్చానో
ఎక్కడ పారేసుకొన్నానో
చిరిగిన కాలం మడతల్లో దాచుకొన్న,
వాళ్ల ఫొటోల గుర్తులు దొరకలేదు
ఇప్పుడు..
నేను ప్రేమించిన రాణులు లేరు
నన్ను కోరుకొన్న నాయికలు రారు
విద్య నేర్పిన యోధులు లేరు
నేను నమ్మిన బాటలో మైలురాయి లేదు
విభావరి ఆప్టే జోషీ..
తన్మయత్వంతో పాడే,
చినుకు లాంటి పాట సౌందర్యం వింటే,
పక్షుల్లా అలసిన ఆశలు,
చుక్కల మీద రెక్కలార్చుకొంటాయి
అంజద్ అలీ సరోద్ కల్లోల తరంగాలు,
రాగాలు అల్లిన మేఘాల అంచుల్లో,…
ఇంద్రధనుస్సు కలల కమానులై,
వెన్నెల దారాల్లా స్పర్శిస్తాయి
దూరాన పిలుపులా,
రేపటి వెళ్తురు దరువై వస్తుందేమో..
రాత్రంతా కిటికీలు..
బదులు పలికినట్టు,
దొర్లిన బాన్సూరీలా
కొట్టుకొంటున్నాయి
గంగా జలాల అలల మీద
బిస్మిల్లాఖాన్..
షెహెనాయ్ రాగం పరిమళమై,
తెరలు తెరలుగా మిలమిలలై,
ఆత్మవిశ్వాసంలా…
నన్ను కమ్ముకుంటోంది
ఆశారాజు
93923 02245