తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ‘జై భారత్’ నినాదం పురుడు పోసుకున్నది. భరతజాతి హితం కోసం విజయదశమి సందర్భంగా ఆయన చేసిన ఆయుధపూజనే ‘బీఆర్ఎస్’. ఆలోచనల సమన్వయం, వాక్చాతుర్యం, తెలివితేటల మేళవింపు, భవిష్యత్ అంచనా, దూరదృష్టి, పోరాట పటిమ.. ఇవన్నీ కలిస్తేనే ఒక కేసీఆర్. ఆయన నాయకత్వం ఎప్పుడూ ఒక అధ్యయనమే!
దేశ హితం కోసం సీఎం కేసీఆర్ చేసిన బీఆర్ఎస్ ప్రయత్నం చరిత్రాత్మకం. మహాత్ముడి ‘గ్రామ స్వరాజ్’, అంబేద్కరుడి ‘జై భీమ్’, లోక నాయకుడి ‘సంపూర్ణ క్రాంతి’ నినాదాల మూలాలతో ఏర్పడిందే కేసీఆర్ ‘జై భారత్ నినాదం’. దళితుల సంక్షేమం కోసం ఎవరూ ఊహించని విధంగా చేపట్టిన ‘దళిత బంధు’ పథకంలో ‘జై భీమ్’ నినాదం కనబడుతుంది. జాతీయ ప్రభుత్వాల ఆధిపత్య నివారణ కోసం ఒక ‘సంపూర్ణ క్రాంతి’ స్వభావం కనబడుతుంది. ప్రత్యేక పంచాయతీల ఏర్పాటు, పంచాయతీలకు ప్రత్యేక నిధుల కల్పన ద్వారా ‘గ్రామ స్వరాజ్’ సిద్ధాంతం కనబడుతుంది. ఇన్ని స్వభావాలు కలిసిన ఒకే ఒక నాయకత్వం కేసీఆర్ రూపంలో మనకు లభించినప్పుడు ఆయన జాతి నిర్మాణం కోసం బీఆర్ఎస్ రూపంలో ఎదుగుతున్నప్పుడు తెలంగాణ ప్రజలుగా మనం గర్వించాలి. అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రకే గ్రామానికి చెందిన 33 మంది రైతులు తమ సోయా పంటను విక్రయించి బీఆర్ఎస్ పార్టీకి రూ.66 వేల విరాళాలు అందించడం అభినందనీయం.
మహారాష్ట్రలోని ధర్మాబాద్ తాలూకా పరిధిలోని ఇరువై గ్రామాల సర్పంచులు బీఆర్ఎస్తో ఉంటామని ముందుకురావడం ఆహ్వానించదగిన పరిణామం. ఇప్పటికే సీఎం కేసీఆర్ తన రాజకీయ ఎత్తుగడలో భాగంగా మహారాష్ట్ర తన మొదటి యుద్ధక్షేత్రంగా ప్రకటించారు. డిసెంబర్ 9న ఢిల్లీలో ఏర్పాటుచేసిన మొదటి బహిరంగ సభ ద్వారా దేశవాసులకు ఒక నూతనోత్తేజం నింపనున్నారు. సహజ వనరుల వినియోగంపై కేసీఆర్ తన ఆలోచనలు మేధావులతో పంచుకున్నారు. సముద్రగర్భాల్లో కలిసిపోతున్న వృథా నీటితో దేశాన్ని ఏ విధంగా సస్యశ్యామలం చేసుకోగలమో వివరించారు. దేశ ప్రజలు ఆయనను ‘దేశ్ కీ నేత’ అని నినదిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన కేసీఆర్ నాయకత్వ తీరు, సేవక నాయకత్వానికి నిదర్శనం. బూదాన్ పోచంపల్లిలో భిక్షాటన, ఢిల్లీకి కారు ర్యాలీ, చిన్న రాష్ర్టాల ఫ్రంట్ కన్వీనర్ పాత్ర, రైల్ రోకో, సకలజనుల సమ్మె, మిలీనియం మార్చ్ లాంటివి టాస్క్ ఓరియంటెడ్ నాయకత్వ స్వభావానికి చారిత్రక ఉదాహరణలు. అందుకే సీఎం కేసీఆర్ తన ప్రయత్నంలో భాగంగా బీఆర్ఎస్ కోసం పలు కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. ఈ ప్రయత్నం తప్పకుండా ఒక సంచలనమవుతుంది. ఏదేమైనా కేసీఆర్ ప్రయత్నం సాహసోపేతమైనది. ఇంతటి నిర్ణయానికి నేను సైతం అంటూ ఆయనకు తోడుగా అడుగులు వేద్దాం! రేపటి ఉదయానికి తొలివెలుగు కిరణంగా ముందుకుపోదాం!
(వ్యాసకర్త: టీఆర్ఎస్ సీనియర్ నాయకులు)
మఠం భిక్షపతి
95424 23242