మోదీ హయాం… భారత్‌కు శాపం! – 2
ప్రధాని పదవిని మోదీ రెండోసారి చేపట్టిన తర్వాత, ప్రజాస్వామ్యంపై దాడి మరింత ఉధృతమైంది. జమ్ముకశ్మీర్ ప్రత్యేకహోదా రద్దు నేపథ్యంలో కశ్మీర్ లోయను కొన్ని నెలలపాటు నిర్బంధించారు. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చారు. ఇదే సమయంలో చైనా నుంచి కరోనా వ్యాప్తి మొదలైంది. ముందస్తు ప్రణాళిక లేకుండా మోదీ ప్రకటించిన లాక్డౌన్, భారతీయులను కనీవినీ ఎరుగని కడగండ్ల పాలు చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. సంక్షోభాన్ని మరింత పెంచేలా సాగుచట్టాలను తీసుకొచ్చింది ప్రభుత్వం. మీడియాతోపాటు అన్ని వ్యవస్థలూ తీవ్ర ఒత్తిడికి, బెదిరింపులకు లోనయ్యాయి. ‘75 ఏండ్ల క్రితం భారత్ తన ప్రస్థానాన్ని ఒక ఆశతో ప్రారంభించింది. ఆ ఆశ ఇంకా సజీవంగా ఉన్నదా? లేక, మరమ్మతు చేయటానికి కూడా వీల్లేని దశకు భారత్ చేరుకుందా?’ అని అశోకా మోదీ ప్రశ్నిస్తున్నారు. ఆయన రాసిన ‘ఇండియా ఈజ్ బ్రోకెన్; ఎ పీపుల్ బిట్రేయ్డ్, 1947 టు టుడే’ గ్రంథంలోని మరిన్ని భాగాలు..
రెండోసారి ప్రధాని పదవి చేపట్టిన వెంటనే, 2019 ఆగస్టులో హిందుత్వ శక్తుల చిరకాల వాంఛను తీరుస్తూ, జమ్ముకశ్మీర్‌కు భారత రాజ్యాంగం ఇచ్చిన ప్రత్యేక ప్రతిపత్తిని మోదీ తొలగించారు. ఆ రాష్ర్టానికి ఉన్న కొద్దిపాటి స్వయంప్రతిపత్తిని రద్దు చేశారు. అంతేగాక, రెండు కేంద్రపాలితప్రాంతాలుగా జమ్ముకశ్మీర్‌ను విభజించి కేంద్రం నియంత్రణ కిందికి తీసుకొచ్చారు. నిరసనలు చెలరేగే అవకాశం ఉన్నందున, కశ్మీర్లో కొన్ని నెలలపాటు ఇంటర్నెట్ను, మొబైల్ నెట్‌వర్క్‌ను నిలిపివేశారు. వందల మందిని ముందస్తుగా అరెస్టు చేశారు. కమ్యూనికేషన్ల నిలిపివేత వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ హెచ్చరిస్తే, ప్రభుత్వం ఆ సంస్థను బెదిరించి నోరు మూయించింది. మరోవైపు, 2019 నవంబరులో అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.
దేశ రాజకీయాల్లో మొదలైన హిందుత్వ శకంతో ఇతర రాజకీయపార్టీలు, నేత లు కూడా అభిప్రాయాలను మార్చుకున్నారు. రాహుల్‌గాంధీ తనను తాను జంధ్యం వేసుకునే బ్రాహ్మణుడిగా చెప్పుకొన్నారు. కాంగ్రెస్ పాలనలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు, గో రక్షణకు కట్టుబడి ఉంటామని ప్రకటించాయి. ఇతర రాజకీ య పార్టీలు, నేతలు కూడా ఇదే దారిలో పయనించాయి. డిసెంబరులో మోదీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. దేశాన్ని హిందూరాజ్యంగా మార్చటంలో ఇదొక కీలక నిర్ణయంగా భావించిన మహిళా విద్యార్థులు దీనిపై నిరసన ప్రారంభించారు. ఇది దేశవ్యాప్తమైంది. ఢిల్లీలో కొన్ని నెలలపాటు నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. సుప్రీంకోర్టు మౌనవ్రతాన్నే కొనసాగించింది. మరోవైపు, జీడీపీ వృద్ధిరేటు మూడు శాతానికి పడిపోయింది.
2019 డిసెంబరులో చైనాలోని వూహాన్లో ఒక కొత్త వైరస్ బయటపడింది. కుప్పకూలిన ఆర్థికవ్యవస్థ, అరకొర ఆరోగ్య సదుపాయాలు, ముక్కలైన ప్రజాస్వామ్యంతో భారత్.. ఈ వైరస్ దాడిని ఎదుర్కోవటానికి ఏమాత్రం సన్నద్ధంగా లేదు. 2020 ప్రారంభంలోనే ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి మొదలైంది.
మార్చి 24వ తేదీ నాటికి దేశంలో 500 మందికి వైరస్ సోకగా, వారిలో 10 మంది మ రణించారు. అదే రోజు రాత్రి 8 గంటల తర్వాత ప్రధాని మోదీ టెలివిజన్‌లో ప్రసంగిస్తూ, ఆ రోజు అర్ధరాత్రి నుంచి 21 రోజుల లాక్డౌన్ అమల్లోకి వస్తుందని ప్రకటించారు. సరిగ్గా, 2016 నవంబరులో నోట్లరద్దును ప్రకటించినట్టుగానే, ప్రజలకు సమయం అనేదే ఇవ్వకుండా హఠాత్తుగా తన నిర్ణయాన్ని వెల్లడించారు. 21 రోజులు గడిచిపోయాయి. దాదాపు రెండు నెల లు పూర్తయ్యాయి. అయినా, లాక్డౌన్ ముగిసేలా లేదు. అనేకమంది వలస కార్మికుల వద్ద ఉన్న కొద్దిపాటి మొత్తం ఖర్చయిపోయింది. వాళ్లు పని చేస్తున్న ఫ్యాక్టరీలు, కంపెనీలు, సంస్థ లు మూతబడ్డాయి. రవాణా సదుపాయం లేదు. దీంతో మరో దారిలేక, వందలు, వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వస్థలాలకు కాలినడకన బయల్దేరారు. పైన నిప్పులు చిమ్మే 43 డిగ్రీల సెల్సియస్ ఎండలు. అయినా వారు నడ క ఆపలేదు. భారతదేశం ఇటువంటి దీన దృశ్యా న్ని అంతకుముందెన్నడూ చూడలేదు. దారిలో అనేకమంది నీరసించి మరణించారు. పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే, ముస్లింలు ఉద్దేశ పూర్వకంగా కరోనా వైరస్‌ను వ్యాప్తి చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో విద్వేషపూరిత ప్రచారం మొదలైంది. ముస్లింల మీద దాడులు చేయటానికి మూకలకు మరో సాకు దొరికింది.
కరోనా వల్ల సంభవిస్తున్న మరణాల గురిం చి, కరోనా కేసుల గురించి అధికారులు పూర్తి వివరాలు వెల్లడించకుండా, తక్కువ చేసి గణాంకాలు వెల్లడించేవారు. తొలి వేవ్‌లో లక్షన్నర మంది మరణించారని ప్రకటించారు. కానీ, వాస్తవానికి ఈ సంఖ్య కనీసం 9 లక్షలైనా ఉం టుందని స్వతంత్ర అధ్యయనాలు తెలిపాయి. ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. కోట్లాదిమంది ఉద్యోగాలు కోల్పోయారు. అసంఘటిత రంగంపై విపరీతమైన ప్రభావం పడింది. ఆర్థికరంగాన్ని తిరిగి నిలబెట్టటానికి జూన్ 8న కేంద్రం లాక్‌డౌన్‌ను ఎత్తేసింది. విధానపరమైన వడ్డీరేట్లను తగ్గించటం వంటి చర్యలను ఆర్బీఐ తీసుకున్నా, అవి సమాజంలోని పై తరగతి, మధ్యతరగతి వారికే ఉపయోగపడ్డాయి కానీ, కింది తరగతి ప్రజల కష్టాలు తీరలేదు. కరోనా కొట్టిన దెబ్బకు కోట్లాదిమంది భారతీయులు నిరుపేదలయ్యారు. ఎంతగానంటే, భారతదేశం లో పేదరికం విపరీతంగా పెరగటం వల్ల ప్రపంచంలో పేదరికం 60 శాతం పెరిగింది. కానీ, భారతీయ సంపన్నులైన అంబానీ, టాటాలు, ముఖ్యంగా గౌతమ్ అదానీ కంపెనీల ఆస్తులు రెట్టింపయ్యాయి. కారణం, విదేశీ ఇన్వెస్టర్లు ఆయా కంపెనీల్లో భారీ పెట్టుబడులు పెట్టటమే.
భారతీయుల జీవితాలు కడగండ్లపాలైన ఈ దశలో, మోదీ ప్రాధాన్యాలు వేరే ఉన్నాయి. లాక్డౌన్ ఓవైపు పాక్షికంగా కొనసాగుతూనే ఉన్నది. రైతుల నుంచి ప్రభుత్వం ధాన్యం సేకరించకుండా, ప్రైవేటు వ్యాపారులకు రైతులే అమ్ముకునేలా కొత్త వ్యవసాయ విధానాన్ని తీసుకొస్తూ జూన్ 3న కేంద్రం ఒక ఆర్డినెన్సు జారీ చేసింది. అసలే రైతు కుటుంబాలు అతలాకుతలమై ఉన్నాయి. వ్యవసాయం సంక్షోభంలో ఉంది.
అప్పుల భారం పెరిగిపోయింది. అనేకమం ది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వారిని ఆదుకోవాల్సిందిపోయి, ఇచ్చే కనీస మద్దతు ధరను కూడా తొలగించే లక్ష్యంతో మోదీ ఈ ఆర్డినెన్సు తీసుకొచ్చారు. దీనిపై సర్వ త్రా విమర్శలు, ఖండనలు వచ్చినా పట్టించుకోలేదు. సెప్టెంబర్ 17న వ్యవసాయ బిల్లుకు రాజ్యసభ ఆమోదం లభించింది. ఇక దీనిపై తేల్చుకోవటానికి నవంబరు 26న రైతులోకమే స్వయంగా కదిలింది. నిరసన తెలుపటానికి ఢిల్లీ కి వస్తుంటే, వారిని పోలీసులు శివార్లలో నిలిపి వేశారు. దీంతో వారు ఆ శివార్లలోనే బైఠాయించారు. ఎముకలు కొరికే ఢిల్లీ చలిలో వేలాదిమంది రైతులు టెంట్లు వేసుకొని అక్కడే ఆందోళన ప్రారంభించారు.
కునారిల్లిన భారతీయ వ్యవసాయ రంగానికి భారీ పెట్టుబడులు అవసరం. సాగునీటి వసతులను పెంచటానికి, భూగర్భ జలాల్ని వృద్ధి చేయటానికి, నేల నాణ్యతను కాపాడుకోవటానికి ఈ పెట్టుబడులు కావాలి. ఈ మేరకు అవసరమైతే రైతుల నుంచి నీటి తీరువాల వంటి వాటిని వసూలు కూడా చేయవచ్చు. కానీ, మోదీకి ఇవే వీ ప్రాధాన్యాలే కాకుండా పోయాయి. కరోనా విలయతాండవం ఇంకా తగ్గనేలేదు. డిసెంబరులో కొత్త పార్లమెంటు భవనానికి మోదీ శంకుస్థాపన చేశారు. రూ.20,600 కోట్ల వ్యయంతో పార్లమెంటు భవనంతోపాటు ప్రధాని నివాసాన్ని, రాజ్‌పథ్ మార్గాన్ని కొత్తగా నిర్మిస్తున్నారు. అదే నెలలో డెల్టా వేరియంట్ అనే కొత్త కరోనా వైరస్ భారత్‌లో వ్యాపించటం మొదలుపెట్టింది. దాని వ్యాప్తి చాలా ఎక్కువ. అయినప్పటికీ, 2021 జనవరిలో దావోస్‌లో జరిగిన సదస్సులో మోదీ మాట్లాడుతూ, కరోనాను జయించటం ద్వారా ప్రపంచాన్ని భారత్ కాపాడిందని చెప్పుకున్నారు. మార్చిలో హరిద్వార్‌లో కుంభమేళా జరిగింది. దీనికి భక్తులను ఆహ్వానిస్తూ ప్రధాని మోదీ పత్రికల్లో పెద్ద ఎత్తు న ప్రకటనలు జారీ చేశారు. మరోవైపు, రాష్ట్ర హైకోర్టు వాయిదా వేయాలని చెప్పినా వినకుం డా యూపీలో యోగి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించింది. ఇంకోవైపు, బెంగా ల్ అసెంబ్లీ ఎన్నికలకు మోదీ, షా వెళ్లి భారీ బహిరంగసభలలో ప్రసంగించారు. ఈ విధంగా కుంభమేళా, యూపీ స్థానిక ఎన్నికలు, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలతో కరోనా మరోమారు విజృంభించింది. ఏప్రిల్ చివరి వారం నుంచి మే నెలాఖరు వరకు రోజుకు సగటున మూడు లక్షల కేసులు, మూడు వేల మరణాలు నమోదయ్యా యి. వాస్తవ గణాంకాలు వీటికి అనేక రెట్లు ఉం టాయి. శవాలను దహనం చేయటానికి కూ డా చోటు దొరకని పరిస్థితి. గంగానదిలో వేల మృతదేహాలు కొట్టుకుపోయాయి. కరోనా రెండో వేవ్‌లో 29 లక్షల మంది భారతీయులు మరణించినట్లు కొన్ని సంస్థలు అంచనా వేశాయి.
దీని గురించి ప్రజలకు తెలిపిన మీడియాపై ప్రభుత్వం వేధింపులకు దిగింది. ప్రముఖ మీడియా సంస్థ దైనిక్ భాస్కర్ ఆఫీసులపై ఐటీ దాడులు జరిగాయి. ఈ దాడులను చూసైనా ఇతర మీడియా సంస్థలు జాగ్రత్తగా మసలుకోవాలని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ హెచ్చరించారు. ‘రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్’ రూపొందించిన వరల్డ్ ఫ్రీడం ఇండెక్స్-2022లో 150 దేశాలకుగాను భారత్ 142 స్థానంలో నిలిచింది. మరోవైపు, ప్రభుత్వ ఏకపక్ష చర్యలకు అడ్డుగా నిలువాల్సిన సుప్రీంకోర్టు మౌన ప్రేక్షకురాలిగా మిగిలిపోయింది.
ఈ విధంగా భారత్‌లో ప్రజాస్వామ్యం కనుమరుగై పోయిందని, భారత్ ఇక ఎంతమాత్ర మూ ప్రజాస్వామ్య దేశం కాదని వీ-డెమ్ (వెరైటీస్ ఆఫ్ డెమోక్రసీ) నివేదిక స్పష్టం చేసింది. ప్రపంచంలో ప్రజాస్వామ్య వ్యవస్థల పనితీరును విశ్లేషించే అత్యంత ప్రతిష్ఠాత్మక నివేదికగా దీనికి పేరున్నది. భారత్‌ను ఎన్నికలు జరిగే నియంతృత్వ రాజ్యంగా (ఎలక్టోరల్ ఆటోక్రసీ గా) ఈ నివేదిక అభివర్ణించింది. 75 ఏండ్ల క్రితం భారత్ తన ప్రస్థానాన్ని ఒక ఆశతో ప్రారంభించింది. ఆ ఆశ ఇంకా సజీవంగా ఉన్న దా? లేక, మరమ్మతు చేయటానికి కూడా వీల్లేని దశకు భారత్ చేరుకుందా?
అనువాదం: కె.వి.రవికుమార్