వానకాలం ఎళ్లుతున్నా నిండని చెరువును చూసి తల్లడిల్లిన రైతు గుండెనడుగు.. కేసీఆర్ అంటే..
నాడు ఎండకాలంల ఎండి ఎరగప్పయి.. నేడు నడెండలల్ల నిండుగున్న చెరువునడుగు.. కేసీఆర్ అంటే..
ఎన్నడూ సుక్కనీరాగక ఎడారై ఏడ్చి..ఇప్పుడు నీటి కోట లెక్క నిలబడి తెలంగాణ నెత్తికి తలపాగైన తల్లి గోదారినడుగు.. కేసీఆర్ అంటే..
ఘనమైన కాకతీయుల పేరు వెట్టుకొని కడుపు నిండా నీళ్లులేక కుమిలిపోయి..ఇయ్యాల కొసెళ్ల పారుతున్న కాల్వనడుగు.. కేసీఆర్ అంటే..
తడిలేక ఇడిశిపెట్టిన బీడు..పచ్చని పొలమై పండిస్తున్న పంటనడుగు.. కేసీఆర్ అంటే
చెరువులల్ల వికసించిన జలపూలనడుగు..చెలకలల్ల విస్తరించిన జీవాలనడుగు..అవి నిలబెట్టిన జీవితాలనడుగు.. కేసీఆర్ అంటే..
గొడ్డలి పెట్లకు గిలగిలలాడి.. ‘మాను’గడ కోల్పోయి.. నిలిచి నీడనిస్తున్న చెట్టునడుగు.. కేసీఆర్ అంటే
పల్సవడి ఎల్శిపోయి తరిగి పెరిగిన అడివినడుగు..బోసిపోయిన గోస నుంచి దట్టంగ మారిన గుట్టనడుగు.. కేసీఆర్ అంటే..
అతుకులు గతుకులు వదిలి అందంగ తయారైన తొవ్వనడుగు..ఏండ్లనాటి చీకట్లు తొలిగి వెలుగులిడుతున్న పల్లెనడుగు.. కేసీఆర్ అంటే..
బానిస సంకెళ్ల తెంచుకొని.. బంగారు బాటలేసుకొని భారతానికే వన్నె తెచ్చిన తెలంగాణనడుగు.. కేసీఆర్ అంటే..
రమేశ్ కనపర్తి
99498 58108