బతుకమ్మ అంటే
పాతకాలం లెక్కన పదిండ్లకు
ఓ ఆడబిడ్డ ఉన్న
కాలికి దుమ్మంటకుండా
కంటికి కన్నీటి చుక్క తెల్వనియ్యకుండా సాదడమే.
బతుకమ్మ అంటే
నిండు నూరేండ్లు సల్లగా బతుకాలనే యాదికొస్తది
మరీ పేగులు బయటికొచ్చేట్లు కోసేసి
పట్టపగలు ఈ అరాచకానికి ఇత్తులేసిందెవడు..
బతుకమ్మ అంటే
పిల్లాపాపలతో వాకిట్ల కొండగోగు పువ్వులా
నవ్వాలనే అర్థం
అట్లయితే
కనిపించిన ఆడబిడ్డలను
పులి జింకల్ని వేటాడి సంపితిన్నట్లు ఇదేంటి?
బతుకమ్మ అంటే
సెండు పువ్వులు పేర్చినట్లు
మందారాలు విర బూసినట్లు
తొలిపొద్దు పొడిసినట్లు
నడిసేన్ల తొలి కంకి కాసినట్లు
ఆడబిడ్డలుంటే ఇల్లంత ఎంత సంబురమో కదా
ఇవేవి పట్టకుండా
పదునైన గొడ్డలి తుమ్మ మొద్దును నరికినట్లు
ఆడబిడ్డల హత్యలకు ఎవడు పాదు తవ్వినట్లు..
ఏ ఆర్య నాగరికత భుజమిచ్చి పెంచెనో
ఏ మనువాద సంస్కృతి పునాదైనదో..
బతుకమ్మ అంటే
చీర రైకపెట్టి పాతబియ్యంతో
ఒడినింపి
గుండెలున్న ప్రేమను కండ్లకద్దుకొని
కాపురం కడదాకా సాగిపోవాలని తల్సుకొని
పిడికిట్ల ముడుపు కట్టుకోవడమే కదా..
అట్ల కాకుండా
అరె రంపెతో సెప్పులను చీల్చినట్లు
అవయవాలను కోసే పాడుబుద్ధి
ఏ మతగ్రంథం నేర్పింది..!
బతుకమ్మను తీరొక్క సింగిడి తీర్ల
సంపంగి పువ్వుల నవ్వినప్పుడు
బతుకులకు వెలుగొచ్చినట్లు…
బతుకమ్మను
కనిపెంచిన అమ్మనాయినలు
గుండె మీద సెయ్యేసుకొని ఏ దిగాలు లేకుండా ఉన్నప్పుడే
మనకు బతుకమ్మ పండుగొచ్చినట్లు
అసొంటిదే అచ్చమైన
మా తెలంగాణ ఆడబిడ్డల బతుకమ్మ.
అవనిశ్రీ
99854 19424