ప్రణాళిక రూపొందించడంలో విఫలం చెందితే, విఫలం చెందడానికి ప్రణాళిక రచిస్తున్నట్లేనని అమెరికన్ తత్వవేత్త, బహుశాస్త్ర కోవిదుడు బెంజమిన్ ఫ్రాంక్లిన్ అభిప్రాయపడ్డారు. దేశమైనా, మనిషి అయినా ప్రణాళిక లేకుంటే వైఫల్యం తప్పదని అర్థం చేసుకోవలసి ఉంటుంది.ప్రధాని మోదీ మొదటి ఎర్రకోట ప్రసంగంలో ప్రణాళికా సంఘం అవసరం తీరిపోయిందన్నారు.ప్రణాళిక సంఘం స్థానంలో తాను ముఖ్యమంత్రులతో కలిసి ‘టీం ఇండియా’ను నిర్మిస్తానన్నారు. తాను నిర్మించబోయే సంస్థ సమాఖ్య స్ఫూర్తిని మరింత పెంపొందించే విధంగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఆ వెంటనే ప్రణాళిక సంఘాన్ని రద్దుచేసి ‘నీతి ఆయోగ్’ను ఏర్పాటుచేశారు. రాజ్యాంగం ప్రతిపాదించిన సమాఖ్యస్ఫూర్తికి మోదీ ప్రభుత్వం గత ఎనిమిదేండ్లలో ఏ విధంగా తూట్లు పొడిచిందో తెలిసిందే. వ్యవస్థలను కూల్చడం సులువు కానీ నిర్మించడమే కష్ట సాధ్యమనేది ప్రణాళిక సంఘం రద్దును బట్టి తెలుస్తున్నది.
1950లో ప్రణాళికా సంఘం ఏర్పాటయినా దాని వెనుక 65 ఏండ్ల మేధోమథనం ఉంది. 1880-90 దశకాలలో దాదాభాయ్ నౌరోజి, మహాదేవ్ రానడే, 1900-1920 ప్రాంతంలో గోపాల్ కృష్ణ గోఖలే, రొమేష్ చందర్ మొదలైనవారు స్వాతంత్య్ర సాధనతో పాటు ప్రణాళికబద్ధ ఆర్థికాభివృద్ధి అవసరం గురించి ప్రజలను చైతన్యపరిచారు. 1934లో భారతరత్న, మైసూరు దివాన్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య Planned Economy for India అనే పుస్తకాన్ని రచించారు. దేశానికి పదేండ్ల ప్రణాళిక అవసరం అని ఆ ప్రణాళికను రూపొందించి అమలుచేసేందుకు విచక్షణా జ్ఞానం కలిగిన మేధావులు కావాలని అభిప్రాయపడ్డారు. 1938లో సుభాష్ చంద్రబోస్ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నిక అయిన తర్వాత – దేశానికి ప్రణాళిక అవసరాన్ని గుర్తించి నేషనల్ ప్లానింగ్ కమిటీని ఏర్పాటుచేసి దానికి అధ్యక్షత వహించవలసిందిగా జవహర్లాల్ నెహ్రూను కోరారు.
నెహ్రూ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదువుకున్న కె.టి.షాతో పాటు 15 మంది సభ్యుల బృందం, స్వాతంత్య్రానంతరం దృష్టిసారించవలసిన ప్రణాళికలు రూపొందించారు. ఇందుకు వారు ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకుడు, ఐరాస స్టాటిస్టికల్ కమిషన్ చైర్మన్ (1954-56) ప్రొఫెసర్ మహాలానో బిస్, ఆర్థికవేత్త, మాజీ భారత ఆర్థికశాఖ మంత్రి (1948-50) ప్రొఫెసర్ జాన్ మత్తై సహాయ సహకారాలు తీసుకున్నారు. 50-60 ఏండ్ల మేధోమథనంతో ప్రణాళికా సం ఘం ఆవిర్భవించి, దేశాభివృద్ధికి తన వంతు తోడ్పాటునందించింది. 2015 నాటికి 65 ఏండ్లు పూర్తి చేసుకున్న ప్రణాళికా సంఘాన్ని కాలానుగుణంగా, లోటుపాట్లను సవరించి మరింత పటిష్ఠపరిచే ప్రయత్నం చేయకుండా మొత్తానికే ప్రణాళికా సంఘాన్ని ఎందుకు రద్దు చేశారో మోదీకే తెలియాలి!
14వ ఆర్థికసంఘం చైర్మన్ వై.వి.రెడ్డి, 13వ ఆర్థిక సంఘం అడ్వైజర్ జి.ఆర్.రెడ్డి 2019లో రచించిన ఇండియన్ ఫిస్కల్ ఫెడరలిజం పుస్తకంలో నీతి అయోగ్ స్థాయి తగ్గిందని, అది కేవలం రిపోర్ట్ తయారీ, కేంద్రం ప్రాయోజిత పథకాల మూల్యంకనం, ముసాయిదాల తయారీకి మాత్రమే పరిమితమైనదని అభిప్రాయ పడ్డారు. దీనివల్ల కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో శూన్యం ఏర్పడిందని అన్నారు. ఈ శూన్యాన్ని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు భర్తీ చేస్తున్నాయని, అది సహకార సమాఖ్య వాదానికి గొడ్డలిపెట్టని హెచ్చరించారు. 13వ ఆర్థికసంఘం చైర్మన్ విజయ్ కేల్కర్ నీతి ఆయోగ్ 2.0 ఆవిర్భావం జరగాల్సి ఉందని, నీతి ఆయోగ్‌కు 1.5 శాతం- 2 శాతం జీడీపీ నిధులు కేటాయించి ఫార్ములా ప్రకారం రాష్ర్టాలకు నిధులు బదలాయింపు జరగాలని తద్వారా ఆర్థిక సమాఖ్య వాదం బలపడుతుందని అభిప్రాయపడ్డారు. ఫైనాన్స్ కమిషన్‌కు శాశ్వత హోదా కల్పించి, కేంద్రం నుంచి రాష్ర్టాలకు ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల మేరకు రావాల్సిన నిధుల బదలాయింపు పర్యవేక్షణ అధికారాన్ని దీనికి కట్టబెట్టినప్పుడే రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 స్ఫూర్తి నెరవేరుతుందని కేల్కర్ భావించారు.
ఏ ఆర్థికవేత్తలు, రాజ్యాంగవేత్తలు, తత్వవేత్తల సిఫారసు మేరకు ‘నీతి ఆయోగ్’ విధి విధానాలు రూపొందాయో తెలియదు. ఉన్న వ్యవస్థను ఎలాంటి ముందస్తు ప్రణాళికలు లేకుండా బుల్డోజర్తో కూల్చడం మోదీ ప్రభుత్వ విధానంగా మేధావులు భావిస్తున్నారు. ఎలాంటి సంసిద్ధత లేకుండా రాత్రికి రాత్రి నోట్లరద్దు, కరోనా లాక్డౌన్ వంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా సామాన్య ప్రజలను అష్టకష్టాలు పెట్టిన వైనం తెలిసిందే. ఈ మధ్య కేంద్రాన్ని ఏ వివరాలు అడిగినా No Data Available అనేది మనం తరచూ వింటున్న మాట. ప్రణాళిక లేదు- గణాంకాల్లేవు. ఇది మోదీ భారతం. ఈ సందర్భంగా మహాలానోబిస్ అన్న మాట మనం గుర్తు చేసుకోవల్సి ఉంటుంది. Statistics without Planning has no fruit, Planning without Statistics has no Root.
ఇప్పుడు తెలంగాణ రైతులు తమ పంటను కొనాలని ఉద్యమించాల్సిన పరిస్థితి రావడానికి కూడా ముందు చూపు, ప్రణాళిక లేని మోదీ ప్రభుత్వ అసమర్థ విధానాలే కారణం. తెలంగాణలో పండే వరి గణాంకాలు కేంద్రం దగ్గర లేవు, కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, 24 గంటల ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, రైతుబంధు మొదలగువాటి వల్ల దిగుబడి పెరుగుతుందని, దాని వినియోగానికి ప్రణాళికలు రచించాలనే స్పృహ కేంద్రానికి లేదు.
పంట అనే దేశ సంపదను వినియోగించుకునేందుకు ఎలాంటి ప్రణాళికలు చేపట్టలేదు. తెలంగాణ నుంచి పారాబాయిల్డ్ రైస్ కొనకూడదనే నిర్ణయం తీసుకున్నదే తప్ప ఎలాంటి ప్రత్యామ్నాయ ప్రణాళికలు చేపట్టలేదు. బీజేపీ సంకుచిత రాజకీయ ప్రయోజనాల దృష్టితో వ్యవహరించడం వల్లనే తమకు ఈ సమస్య వచ్చిందని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు. రైతు ప్రయోజనాల, దేశ శ్రేయస్సు కన్నా బీజేపీకి రాజకీయ ప్రయోజనాలు ముఖ్యమని ఈ చర్యలు తెలియజేస్తున్నాయి.
1965లో ఎఫ్‌సీఐని ఏర్పాటుచేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల్లో రైతుకు మద్దతుధర (ఎంఎస్పీ) అందించడం ఒకటి. కేం ద్రం పారాబాయిల్డ్ బియ్యం కొనబోమని చెప్పడం ద్వారా ఎఫ్‌సీఐ చట్టంతో పాటు ఎంఎస్పీ విధానాన్ని తుంగలో తొక్కింది. వడ్లు కొనడం కేంద్రం బాధ్యత. ఆ బాధ్యతను కేంద్రానికి గుర్తు చేసేందుకు సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నానికి మద్దతుగా, రైతులకు సంఘీభావంగా తెలంగాణలోని సబ్బండ వర్ణాలు నిలువడం అభినందనీయం.
కేంద్రం పారాబాయిల్డ్ బియ్యం కొనబోమని చెప్పడం ద్వారా ఎఫ్‌సీఐ చట్టంతో పాటు ఎంఎస్పీ విధానాన్ని తుంగలో తొక్కింది. వడ్లు కొనడం కేంద్రం బాధ్యత. ఆ బాధ్యతను కేంద్రానికి గుర్తు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నానికి మద్దతుగా, రైతులకు సంఘీభావంగా తెలంగాణలోని సబ్బండ వర్ణాలు నిలువడం అభినందనీయం.
-పెండ్యాల మంగళాదేవి