ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లోనే..
అమలు చేసి తీరుతం..
అని జెప్పి ఆరు వందల రోజులు గడిశినా…
ఇప్పుడే ఎందుకు? సూద్దాం తియ్యి..
దెహే.. పోనీలే అనుకున్న
జల్ది ఉరుకుండ్రి రొండు
లచ్చలు తెచ్చుకోండ్రి..
నేనత్తాన.. మొత్తం మాఫీ జేత్తనంటే..
నమ్మి నానబోశిన..
ఇప్పుడు పుచ్చి బుర్రలైనా…
॥ దెహే… పోనీలే ॥
గ్యారెంటీ కారటు పయిలంగ దాచుకోండ్రి..
గద్దెనెక్కుడే లేటు.. అన్ని ఇచ్చుడే..
మొత్తం జేసుడే… అని చేతుల
పెట్టిన కారట ముక్క..
ఇప్పుడు నన్ను జూసి ఎక్కిరిత్తాంటే..
అయినా మంచిదే…
॥ దెహే… పోనీలే ॥
ఎకరానికి పదివేలు బిచ్చమా?
నేనత్తే పదిహేను వేలిత్త..
ఆత్మగౌరవం నిలబెడతా..
అని జెప్పి రొండు వేలు మొఖానగొట్టి…
మా భాగ్యం అనుకొమ్మని…
సగం మందికి ఎగనామం పెట్టి..
మా ఆత్మాభిమానాన్ని ఇప్పుడు అంగట్ల
అమ్మినా సుతం…
॥ దెహే… పోనీలే ॥
ఎన్నైనా వడ్లు పండిచ్చుకోండ్రి..
ఇందిరమ్మ రాజ్యంలో..
ఐదు వందలు బోనస్ ఇత్తనని..
సన్న వడ్లకేనని సంకలు దగ్గర పెట్టి..
బోనస్‌ను బోగస్ జేసి..
ఇప్పుడు మా ఆశల్ని బొందపెట్టినా..
॥ దెహే… పోనిలే ॥
పొల్లగానికి జ్వరమచ్చి దావఖానకు బోతే…
ఆరోగ్యశ్రీ దీపం ఆరిందన్నరు..
దసర పండుక్కు దాసిన పైకం..
ఇప్పుడు దావఖానల..
దయ్యాల పాలయింది అయినా గానీ…
॥ దెహే… పోనిలే ॥
పచ్చని పంటలు ఎర్రబడుతున్నా..
బత్త యూరియా కోసం..
రోజులకనంగ లైన్లు కట్టి..
పోలీసుల దెబ్బలకు వాతలచ్చినా…
బరిబద్ద బొక్కలిరిగినా…
॥ దెహే… పోనీలే ॥
గిట్ల చెప్పుకుంట పోతే..
తొంభై ఎనిమిది ఉన్నయ్..
యూరియాది తొంభై తొమ్మిది..
బతుకమ్మ చీరల తోటి..
పాలకుల మోసాల చిట్టాకు..
పదో ఎక్కం పూర్తి అయింది..
శిశుపాలునికి నూరో తప్పు నిండినట్టు..
దెహే.. గిట్లయితే ఎట్లా..
మావోల్లు కట్టుకున్న చీరను..
మసిబొంతలని కించపరిచినా..
బెదుర్లకు కట్టే పేగులని..
హేళన జేసినా.. ఎక్కిరిచ్చినా…
ఇప్పుడు రెండు చీరలిత్తనని..
గుడ్డ పేగులు గూడ పంచలే..
దెహే.. నాకెందుకనుకుంటే..
బతుకు ఆగం గాబట్టే..
పండుగ పూట మంది
మొఖం జూసుడు కాబట్టె…
ముసలోళ్లను బతిలాడుకుంటే..
పోరగాండ్ల చిల్లర ఖర్సెల్లేది..
పదేండ్లు అవలీలగ కాలం ఎల్లదీశిన…
ఇప్పుడు అరొక్కటి నెత్తిమీద పడబట్టే…
దెహే… నాకెందుకనుకుంటే..
బతుకు ఆగం గాబట్టే..
ఎందుకు తియ్యి అనుకుంటే..
ఎందుగ్గాకుంటనే అయితాంది..
దినదినం బతుకు హీనమైపోతాంది
అరచేతుల వైకుంఠం చూపినోడు..
గవ్వే మాయమాటలతో మల్లత్తాండు…
మోసాన్ని నిజంతోనే దెబ్బకొడతా…
నాలుగు పానాదుల కాడ..
యూరియా బుక్కిత్త
చిన్నప్పుడు అమ్మమ్మ పోసిన..
దొండాకు పసరు కక్కిత్త…
దెహే… పోనీలే అనుకుంటే
నకరాలు చేస్తుండ్రు..!
-ఉప్పుల శ్రీనివాస్
91002 57358