వాడు ఇరవై ఏండ్లకు కలిశాడు
ఇన్నాళ్ళూ దొరకనందుకు చివాట్లతో తడిశాడు
చర్మాలు చుట్టుకున్న రెండు గుండ్రాళ్లని
ఉత్త సోమరి సోగ్గాళ్లని మమ్మల్ని కలిపి తిట్టేవాళ్ళు
ఒడ్డు నుంచి ఒక పొగడచెట్టు కొన్ని ఆకుల్ని కొన్ని పువ్వుల్ని
నదిలోకి విసిరి అవి పడవలనుకొని మురిసినట్టు
పానీ పూరి దొప్పల్లో మేమిద్దరం ప్రపంచాన్ని ఈదే వాళ్ళం
మోకాలి కొలతలతో ధూర్త లోకాన్ని
పకపక నవ్వులతో వచ్చీ పోయే ముఖాల్ని గోకేవాళ్ళం
ఎన్నో ఏండ్లు రెండు జేబుల్లో ఒక్క నాణెంగా బతికిన వాళ్ళం
మనిషి బతికేందుకు దప్పళం వంటి అదరువేదో ఉండాలని
చెప్పేందుకు ఎవరూ దిగి రాలేదు
చెదిరిన అమ్మ తాగుబోతు నాన్న వాడికి
ఏ జన్మో విసిరిన భరణాలు
ఉన్నట్టుండి ఇలా ఎదురుపడ్డాక
ఎదురెండలో నిమ్మసోడా కోసం వెతికినట్టు
వాడి నూతి గొంతులో వెలితి రంగులు వెతికాను
విప్పలేని ఇబ్బందులేవో నెరిసిన గడ్డంలా
కండ్లు మాత్రం నిబ్బరంగా చెమ్కీల్లా
అచ్చం అప్పటిలాగే ఉన్నాయ్
చీకటైంది ఇక వెళ్ళాలన్నప్పుడు
కొత్త చొక్కా ఒకటి దుప్పటిలా ఇచ్చాను
పర్సులో ఉంచమని చాపిన చేతిని వెనక్కి తిప్పి
ఒక జన్మకు ఒక తృప్తి చాలని నసిగాడు
-రఘు
96761 44904