తెలుగు సాహిత్యానికి వేల సంవత్సరాల గొప్ప చరిత్ర ఉన్నది. తెలుగు సాహిత్యం ఎంతో సుసంపన్నమైనది. ఆధ్యాత్మికత, నవరసాలు, జాతిని జాగృతం చేసే విషయంలోనైనా తెలుగు జాతి గర్వపడేంతటి విశేషమైన సాహితీ సంపద తెలుగు సాహిత్యం సొంతం. పద్యం, కథ, కవిత, పాట ఇలా అన్ని రకాల సాహిత్యం తెలుగునేల మీద పరిఢవిల్లుతున్నది.
కరీంనగర్‌కు చెందిన ప్రముఖ కవి, రచయిత వారాల ఆనంద్‌కు అనువాద రచనల విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ప్రముఖ కవి గుల్జార్ రాసిన ‘గ్రీన్ పోయెమ్స్’ ను ఆనంద్ ‘ఆకుపచ్చ కవితలు’ పేరుతో తెలుగులోకి అనువదించారు.
అనువాదం అంటే ఏమిటి, అనువాదాన్ని మీరెట్లా అర్థం చేసుకున్నారు? ‘ఇచ్చి పుచ్చుకోవడం’ అన్న భావనే మని షి మనుగడకు మూలాధారం. అంతేకాదు ‘తెలియంది తెలుసుకోవడం, తెలిసింది పంచుకోవడం’ అన్నది మానవ సంస్కృతిలో అంతర్భాగమైన జీవనమార్గం. మనిషి తనను తాను వ్యక్తం చేసుకోవడానికి కాలక్రమంలో భాషను గొప్ప మాధ్యమంగా రూపుదిద్దుకున్నాడు. ఒక ప్రాంతంలో, ఒక భాషలో జరిగిన విషయాలు, విజయాలు, సృజనాత్మక విషయాలు ఇతర ప్రాంతాలకు చేరడానికి వాటి ని ఒక భాష నుంచి మరో భాషలోకి చేరవేయడానికి అనువాదం అవసరమైంది.
అనువాదకునికి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి?
అనువాదం చేయడానికి అర్హతలు అంటూ ఏమీ ఉండవు. అనువాదకునికి మూల భాష, లక్ష్య భాషలు రెండింటిలో మంచి ప్రవేశం ఉండాలి. ఆయా భాషల గ్రామర్ సింటాక్స్ తెలిసి ఉండాలి. అంటే ద్విభాషా పరిజ్ఞానం కలిగి ఉండాలి. భాషలే కాకుండా అనువాదకునికి ఆ రెండు సంస్కృతుల విష య పరిజ్ఞానం ఉండి తీరాలి. అప్పుడే మూ ల భాషతో పాటు ఆ భాషా ప్రాంతపు వాతావరణం కూడా లక్ష్యభాషలోకి సమర్థంగా అనువదించబడుతుంది.
సృజనాత్మక సాహిత్యానికి అనువాద సాహిత్యానికి మధ్య తారతమ్యం ఏంటి?
సృజనాత్మక సాహిత్యంలో సృజనకారుడు స్వీయ భావాల్ని, అనుభవాల్ని తన సొంత శైలిలో తనదైన ఒరవడిలో సృష్టిస్తాడు. ఆ రచన ప్రభావం, ఫలితం మొత్తంగా తనదే. కానీ అనువాదంలో అనువాదకుడు వేరొక సృజకారుడు మరో భాషలో రాసిన వాటిని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి. అర్థంతో పాటు మూల రచయిత సాంస్కృతిక నేపథ్యం కూడా తెలుసుకోవాలి.
ఇప్పటివరకు ఎన్నిభాషల రచనలను తెలుగులోకి అనువదించారు?
‘ఇరుగు-పొరుగు’ శీర్షికన ఇప్పటివరకు 17 భారతీయ భాషల నుంచి 70 కవితల దాకా అనువదించాను.
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం పట్ల మీ అనుభూతి?కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. నచ్చిన కవిత్వాన్ని వచ్చిన రీతిలో అనువదించాలి అనుకున్నాను. నాకు నచ్చినవి అందరితో పంచుకోవాలనుకున్నాను. ఈ అవార్డు రావడం గొప్ప ఆనందమే. ఆనందంతో పాటు తలపైన భారం కూడా పెరిగినట్టే. ‘ఆకుపచ్చ కవితలు’ పుస్తకాన్ని జాతీయ అవార్డుకు ఎంపిక చేసిన జ్యూరీకి, అకాడెమీ సభ్యులకు ధన్యవాదాలు.
ఆకుపచ్చ కవితల నేపథ్యం ఏమిటి?
ఆకుపచ్చ కవిత్వం మూల రచయిత గుల్జార్ అంటే నాకు నా కాలేజీ రోజుల నుంచీ అభిమానం. తర్వాత గుల్జార్ కవి త్వంపై దృష్టి పడింది. ‘గ్రీన్ పోయెమ్స్’, సస్పెక్టెడ్ పోయెమ్స్, నెగ్లెక్టెడ్ పోయెమ్స్ ఇట్లా అనేక సంకలనాలు చదివాను. వాటి ల్లో ‘గ్రీన్ పోయెమ్స్’ బాగా నచ్చింది. అం దులో ఆయన స్పృశించిన పర్యావరణ అంశం బాగా హత్తుకున్నది. చెట్లు, మబ్బు లు, నదులు, పర్వతాలు ఇట్లా అనేక అంశాలూ, వాటికీ మనిషికి ఉన్న అనుబం ధం అన్నింటినీ ఇందులో గుల్జార్ సున్నితంగా ఆవిష్కరించారు. దాంతో ఆ పుస్తకాన్ని అనువాదం చేయాలనుకున్నాను.
అలాంటి సాహిత్యానికి మరిన్ని సొబగులు అద్దుతూ ఎందరో రచయితలు,కవులు జన బాహుళ్యంలోకి తీసుకెళ్తున్నారు. వారి కృషికి తగినట్లే ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకుంటున్నారు. ఆ కోవలోకి చెందినవారే వారాల ఆనంద్, మధురాంతకం నరేంద్ర .వీరిద్దరూ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన సందర్భంగా ‘చెలిమె’తో తమ సాహిత్య అనుభవాలను ఇలా పంచుకున్నారు.
మధురాంతకం నరేంద్ర రాసిన ‘మనోధర్మపరాగం’ నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. మధురాంతకం నరేంద్ర తెలుగు, ఆంగ్ల రచయిత. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆంగ్ల విభాగంలో ఆచార్యుడిగా పనిచేస్తున్నారు.
మీకు సాహిత్యం మీద ఆసక్తి పెరగడానికి ప్రేరణ ఎవరు?
నేను పుట్టకముందే మా ఇంటికి సాహిత్యం వచ్చింది. నేను పుట్టేనాటికే మా నాన్నగారు రాజారాం కథలు, సాహిత్యంలో రాణిస్తున్నారు. ఆయన రాసిన అనేక కథలు అప్పటికే పలు పత్రికల్లో అచ్చయ్యాయి. ఎంతోమంది సాహిత్యకారులు మా ఇంటికి వచ్చేవారు. మొత్తం మీద నాకు సాహిత్యాభిలాష పుట్టడానికి ఆసక్తి, ప్రేరణ అన్ని కూడా మా నాన్నగారే.
ఇప్పటివరకు మీరు రాసిన కథలు, నవలలు?
ఏడు నవలలు రాసి ఉంటాను. 100 కథలు రాశాను. పలు కథలు సంపుటాలుగా వచ్చాయి. 12 నాటకాలు రాశాను. రెండు నాటకాలు పుస్తకాలుగా వచ్చాయి. మేము ‘కథా వార్షిక’ పేరుతో చాలా ఏండ్లు ఎంపిక కథలతో పుస్తకాలు వేశాము.
ఏ సాహిత్యాన్ని ఎక్కువగా ఇష్టపడతారు?
నిజానికి సాహిత్యానికి భాషలేదు. భాష అనేది ఒక మీడియం మాత్రమే. ప్రపంచ సాహిత్యమంతా ఒకటే. ఒక నవల ఎంతటి గుర్తింపు పొందింది, అది ఎంతగా విప్పారింది తెలుసుకోవాలంటే దాన్ని తెలుగు నవలగా చూస్తే కుదరదు. ప్రపంచపు నవలలన్నింటిని చదవాలి. అవి ఏ స్థాయికి వెళ్లాయో తెలిస్తే మనం ఏ స్ధాయిలో ఉన్నాం, ఇంకా ఎలా వెళ్లాలి అని తెలుస్తుంది. మన సాహిత్య పురోగతి తెలుస్తుంది.
సాహిత్యంలో రావలసిన మౌలిక మార్పులేవి?
మార్పు రావలసింది సాహిత్య ప్రపంచం, సాహిత్యకారుల్లో. ఈ సాహిత్య ప్రపంచంలో తెలుగువారు చాలా వెనుకబడి ఉన్నారు. కన్నడం, తమిళం, మలయాళంలో ఒక మంచి నవల వస్తే వేలాది కాపీలు అమ్ముడు పోతా యి. వారికి పాఠకులు ఉన్నారు. కానీ మన తెలుగు సాహిత్య ప్రపంచం చాలా వెనుకబడింది. దీన్ని పట్టించుకోకపోతే మన భాష, సంస్కృతి, నాగరికత, సాహి త్యం మరుగున పడుతుంది. కనుక అందరూ ఈ విషయంలో ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉన్నది.
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం పట్ల మీ అనుభూతి?
సాహిత్య అకాడమీ వారు నన్ను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేయడం చాలా సంతోషం. దీనివల్ల నాకు మరికొంత మంది పాఠకులు దొరుకుతారు. నా పుస్తకాలు చదివి అందులోని మంచిని ఆలోచిస్తారని ఆశిస్తున్నాను. చివరగా కొత్త, పాత అనే తేడా లేదు. సాహిత్యం కూడా ఒక సాధన. ఇది నిరంతర సాధనగా ఉండాలి. అప్పుడే సాహిత్యంలో రాణించగలుగుతారు.
మీ మనోధర్మపరాగం నేపథ్యం ఏంటి?
ఇది సంగీతానికి సంబంధించిన కథ. చిన్నప్పటి నుంచి సంగీతం మీద ఇష్టం ఉన్నది. ఆ సందర్భంగా సంగీతకారుల జీవితాలను చదివాను. ఈ కథలు చదువుతున్నప్పుడు చాలా పాత్రలు వచ్చి వెళ తాయి. వారికి వాయిస్ ఉండదు. వారికి వాయిస్ ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచన నుంచి ఈ పుస్తకం పుట్టింది. దేవదాసీలు, వారి జీవితాలు, శతాబ్దాల పాటు వారు సంగీతాన్ని మోసుకొచ్చిన తీరు, వారిని సభ్య సమాజం చూసే పద్ధతి, వారు పడిన కష్టాలు, కళకు కళాకారునికి మధ్య ఉండే సంబంధం.. ఇలా అనేక అంశాలను చర్చించడానికి ఈ నవల ఉపయోగపడింది.
-మధుకర్ వైద్యుల