ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేళ దేశం నూతన లక్ష్యాలను నిర్దేశించుకుంటూ దూసుకుపోతున్నది. ఈ సమయంలోనే భారతీయ సమాజంలో దశాబ్దాలుగా మమేకమైన ఓ వర్గం సైతం తమ అభ్యున్నతికి ఈ అమృత కాలం వేదిక కావాలని బలంగా అభిలషిస్తున్నది. వారే దళిత క్రైస్తవులు. భారత గడ్డపైనే పుట్టి, ఇక్కడే గిడుతున్న ఈ అట్టడుగు వర్గం, ఇతర భారతీయ దళితులతో సమానంగా తమకు సైతం రిజర్వేషన్ ఫలాలు అందాలని కోరుకుంటున్నది.
అంటరానితనం కారణంగా శతాబ్దాల తరబడి వివక్ష ఎదుర్కొన్న దళితుల అభ్యున్నతి కోసం రాజ్యాంగంలో రిజర్వేషన్లు పొందుపరిచారు. దీని ఫలితంగా 1956 నుంచి సిక్కు దళితులకు, 1990 నుంచి బౌద్ధ దళితులకు రిజర్వేషన్ ఫలాలు లభిస్తున్నాయి. కానీ దళిత క్రైస్తవులకు మాత్రం ఇంకా ఆ ఫలాలు లభించడం లేదు.
దేశ జనాభాలో రెండున్నర కోట్ల మంది క్రిస్టియన్ మతాన్ని అవలంబిస్తుంటే, అందులో సుమారు 2 కోట్ల మంది దళిత క్రైస్తవులే. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో అప్రకటిత శాసనంగా కొనసాగుతూనే ఉన్న అస్పృశ్యత, అణచివేతల ఫలితంగా హిందూ దళితులు తమ గౌరవానికి పెద్ద పీట వేస్తున్న ఇతర మతాల్లోకి మారి, సంఘంలో తమ ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారికి క్రైస్తవం తొలి ప్రాధాన్యంగా మారిపోయింది. అయితే వారి మత విశ్వాసాలు మారాయి తప్ప వారు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో పెద్ద మార్పు రాలేదు. మతం మారడం వారికి హిందూ దళితులుగా అందుకున్న అనేక రాజ్యాంగబద్ధ సౌకర్యాలను దూరం చేస్తున్నది. అన్నింటికీ మించి దళితులకు పెట్టని కోటలా ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం రక్షణ చట్రం నుంచి దళిత క్రైస్తవులు దూరమవుతున్నారు.
క్రైస్తవంలో కుల వ్యవస్థ లేదు కాబట్టి, దళిత క్రైస్తవులకు ఇతర మతాల్లోని దళితులకు అమలు చేసినట్లు రిజర్వేషన్లు అమలు చేయటం కుదరదని పాలక వర్గం చెప్పడం తీవ్ర చర్చనీయాంశమైంది. రంగనాథ్ మిశ్రా కమిటీ సిఫారసులకు ఎలాంటి ప్రాతిపదిక లేదనడం విమర్శకు గురవుతున్నది. ఒక వర్గానికి రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను, సౌకర్యాలను కేంద్ర ప్రభుత్వం కావాలనే దూరం చేస్తున్నదా అనే ప్రశ్న తలెత్తుతున్నది.
దళిత హిందువుల్లో చాలా మంది క్రైస్తవ మత విశ్వాసాల్ని గౌరవించడం ఇటీవల కాలంలో పెరుగుతున్నది. అయితే క్రైస్తవ మతం స్వీకరిస్తే హిందూ దళితులుగా తమకు అందుతున్న రిజర్వేషన్లు, రక్షణ చట్టాలు దూరమవుతాయన్న భయంతో వారు ఆ మతాన్ని స్వీకరించడం లేదు. దళిత క్రైస్తవులకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో రిజర్వేషన్లు అమలు చేస్తే హిందూ మతం నుంచి గంపగుత్తగా దళితులందరూ క్రైస్తవ మతం స్వీకరిస్తారేమోనన్న భయం కేంద్ర పాలక వర్గానికి ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దళితులందరూ క్రైస్తవంలోకి మారితే రాజకీయాల్లోనూ చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. 2021లో కర్ణాటక ప్రభుత్వం తీసుకు వచ్చిన మత స్వేచ్ఛ హక్కు రక్షణ బిల్లును కేంద్ర ప్రభుత్వ భయానికి ఉదాహరణగా చెప్పవచ్చు. మత మార్పిడుల్ని అడ్డు కోవటమే ఇలాంటి చట్టాల ప్రధానోద్దేశం. క్రైస్తవ సంస్థలు, ఉన్నత స్థానాల్లోని క్రైస్తవులు విమర్శల పాలు కావడం ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా సర్వ సాధారణంగా మారిపోయింది. నిజంగా వారు భయపడుతున్నట్లు మత మార్పిడుల కారణంగా హిందువుల ఉనికి ప్రమాదంలో పడలేదు. అయినా క్రిస్టియన్లు లక్ష్యంగా దేశంలో హింస పెరుగుతున్నదే తప్ప తగ్గటం లేదు.
హిందూ మతంలోని వర్ణ విభజన క్రైస్తవ మతంలో లేదు. హిందూ మతంలోని కుల వ్యవస్థ చట్రంలో నలిగిపోయినవారు ఆ మతానికి దూరం అయ్యారు తప్ప, ఈ దేశం నుంచి దూరంగా పోలేదు. దళితుల పట్ల కుల వివక్ష, అంటరానితనం ఇంకా కొనసాగే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ ఫలాలు అందకుండా చేయటం సామాజిక అంటరానితనాన్ని మించిన అణచివేత అనిపించుకుంటుందనటంలో అతిశయోక్తి లేదు.
దేశం ముందుకు నడవాలంటే వెనక బడిన వర్గాలను మరింత ముందుకు తేవాలి. ఈ దిశగా తెలంగాణ సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి యావత్ దేశానికి ఆదర్శం. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఏ రాజకీయ నాయకుడు సైతం ఊహించని పథకాలను అమలు చేయటంలో ఆయనకు ఆయనే సాటి. అన్ని వర్గాల్ని ఏకతాటిపై నడిపిస్తున్న తెలంగాణ రథ సారథి ఆయన. బతుకమ్మ సంబురాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రాధాన్యం ఇస్తుందో అంతే ఘనంగా ఏటా క్రిస్మస్ వేడుకల్ని నిర్వహిస్తున్నది. దళితుల ఆత్మ గౌరవం, ఆదాయం ఇనుమడించేందుకు దళిత బంధు పథకం అమలు చేస్తున్నది. అన్ని మతాలు, కులాలకు సమ ప్రాధాన్యం ఇస్తూ భిన్నత్వంలో ఏకత్వం అనే మాటకు నమూనాగా నిలుస్తున్నది. కేంద్రం సైతం సీఎం కేసీఆర్ బాటలో నడిచి దళిత క్రైస్తవుల దీనస్థితి ఆధారంగా వాళ్లకు రిజర్వేషన్లు కల్పించాలని ఆశిద్దాం. కేజీ బాలకృష్ణన్ కమిటీ నివేదికతోనైనా దళిత క్రైస్తవులకు న్యాయం జరగాలని కోరుకుందాం. అప్పటి వరకూ ప్రతి వేదిక పైనా దళిత క్రైస్తవులకు జరగాల్సిన న్యాయం గురించి నినదిద్దాం, కేంద్ర ప్రభుత్వ నేతల్ని నిలదీద్దాం.
(వ్యాసకర్త: చైర్మన్, టీఎస్ ఫుడ్స్)
-మేడె రాజీవ్ సాగర్