త్వరలో ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తుందని ప్రధాని పదే పదే ఊదరగొడుతున్నారు. ఏటా దేశ ఆర్థిక వృద్ధి రేటు పతనమవుతున్న నేపథ్యంలో అదెలా సాధ్యమో ఆయనే చెప్పాలి. కల్లిబొల్లి కబుర్లు చెప్పి ప్రజలను నమ్మించాలని చూస్తే నవ్వులపాలు కావాల్సి వస్తుందని తెలుసుకోవాలి. ఆర్థిక వ్యవస్థ అంతర్జాతీయ స్థాయిలో ఎదగడం ఆయా దేశాల సాపేక్షిక ఎదుగుదల రేట్లపై ఆధార పడి ఉంటుందని తెలుసుకోవాలి.
వాస్తవాలు మాట్లాడుకొంటే మన ఆర్థిక వ్యవస్థ ఎదగడం అనే మాట అటుంచి కనీసం 2020 కొవిడ్ సంక్షోభానికి ముందరి స్థితినైనా చేరగలిగిందా అన్నది బిలియన్ డాలర్ల ప్రశ్న. వృద్ధి రేటు ఏ సంవత్సరంలోనూ 9 శాతం దాటలేదు. కానీ ప్రధాని మోదీ ఏ ధైర్యంతో భారత్ ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కాగలదని చెబుతున్నారు?
ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతున్నదని ప్రధాని మోదీ అబద్ధాలు చెబుతున్నారు. నిజానికి, దేశ ఆర్థిక వ్యవస్థ ఎదగడం… అది కూడా ఇతర దేశాల స్థాయిని దాటి ఎదగడం అనేది వివిధ దేశాల సాపేక్షిక ఎదుగుదల రేట్ల ఆధారంగా ఉంటుంది. మనం నిజంగా ఎదుగుతున్నామంటే మన వృద్ధి రేటు ఇతర దేశాల కంటే అధికంగా ఉండాలి. కానీ నాలుగేండ్లుగా మన వృద్ధి రేటులో ఎదుగుదల లేదు. 2018 ఆరంభం నుంచి భారత్ స్థూల ఆర్థిక వృద్ధి (జీడీపీ) రేటు ఏటా పడిపోతూనే ఉంది. 2020 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో అది 3.1 శాతానికి పడి పోయింది. అదే ఏడాది జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో వృద్ధి రేటు మైనస్ 23.9 శాతం మేరకు దారుణంగా పతనమైంది. ఇది ఆ కాలంలో ప్రపంచ దేశాలన్నింటిలో కంటే అత్యధిక స్థాయి పతనం. ఆ తర్వాతి కాలంలో కూడా, ఇప్పటి వరకు ఆర్థిక వృద్ధి గణనీయంగా కోలుకున్నది ఏమీలేదు.! నిజానికి అది ఇంకా 17-18 శాతం మేరకు తక్కువగానే ఉంది. విషయం అది. కాగా మనం ఎదుగుతున్నాం… అది కూడా ఇతర దేశాల కంటే అధికంగా ఎదుగుతున్నాం… కాబట్టి వాటిని దాటేయబోతున్నాం అనేది ఎంత నిజం?
ఆర్థిక ఎదుగుదలను రెండు కోణాల నుంచి చూడవచ్చు. అవి ఒకటి గతంలోని మన ఆర్థిక స్థాయి, నేటి మన స్థాయి. రెండవది, ఇతర దేశాలతో పోలిస్తే మన దేశ ఎదుగుదల స్థాయి. ఈ రెండు కోణాల నుంచి మన దేశ ఆర్థిక ఎదుగుదలను ఒకసారి చూద్దాం. మోదీ 2019లో తిరిగి అధికారంలోకి వచ్చిన అనంతరం 2024 నాటికి భారత్ ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరుకుంటుందని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఆ స్థాయికి చేరుకోవాలంటే 2019 నుంచి 5 సంవత్సరాల పాటు ఏటా 9 శాతం వృద్ధి రేటును కలిగి ఉండాలి. కానీ 2018 ఆరంభం నుంచే ఆర్థిక వ్యవస్థ పరిస్థితి దిగజారుతోంది. ఈ క్రమంలోనే 2018 జనవరి-మార్చి త్రైమాసికంలో 7.3 శాతం వృద్ధి రేటు నమోదైంది. మొత్తంగా 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను మన వృద్ధి రేటు 7.2 శాతంగా ఉంది. తర్వాతి ఆర్థిక సంవత్సరం నుంచి వృద్ధి రేటులో పెద్దగా పురోగతి లేదు. కరోనా సంక్షోభం వృద్ధి రేటుపై ప్రభావం చూపించింది. కానీ ప్రభుత్వ అసమర్థ ఆర్థిక విధానాల వల్ల వృద్ధి రేటు పెరగలేదు. అంటే ప్రధాని ప్రకటించిన 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరేందుకు అవసరమైన 9 శాతం వృద్ధి రేటును దేశం ఏనాడూ సాధించలేదు.
అయితే ప్రధాని 2019లో ఈ లక్ష్యాన్ని ప్రకటించిన అనంతరం 2020లో కొవిడ్ సంక్షోభం, 2022 ఆరంభం నుంచీ ఉక్రెయిన్-రష్యా యుద్ధం వంటి విపత్తులు వచ్చిన మాట వాస్తవం. ఈ క్రమంలో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు చాలా మేరకు కుదేలయ్యాయి అన్నది కూడా నిజం. కానీ పరిస్థితి ఇలా ఉంటే ప్రధాని మోదీ మాత్రం ఏ మాత్రం తగ్గకుండా కరోనా లాక్ డౌన్ల ప్రభావం ఉన్నా భారత్ మాత్రం 5 లక్షల కోట్ల డాలర్ల లక్ష్యాన్ని సాధించి తీరుతుందంటూ డంబాలు పలికారు. ఒక పక్కన 2018 మొదలుకొని ప్రతి మూడు నెలలకొకసారి విడుదలయ్యే ఆర్థిక గణాంకాలు వృద్ధి రేటు పతనాన్ని కళ్లకు కడుతున్నా అసాధ్యమైన 5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని ఎందుకు ప్రకటించినట్లు? దీని వెనుకన కనపడేవి రెండే కారణాలు – ఒకటి, ఆర్థిక ఆంశాలలో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న నిరక్షరాస్యత, రెండవది, పడిపోతున్న వృద్ధి రేటు తాలూకు వాస్తవాన్ని కప్పి పెట్టి. ప్రజల్లో ఆర్థిక పరిస్థితి పట్ల భ్రమలు కల్పించడం! ఈ నేపథ్యంలో దేశ వాస్తవ ఆర్థిక పరిస్థితిని గమనించిన మాజీ రిజర్వు బ్యాంకు గవర్నర్ సుబ్బారావు 2029-30 నాటికి మాత్రమే భారత్ 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక స్థాయిని అందుకోగలదని విశ్లేషించారు. అది కూడా ఇప్పటి నుంచి 5 సంవత్సరాల పాటు ఏటా 9 శాతం మేర వృద్ధి రేటు సాధిస్తేనే.
వివిధ దేశాల సాపేక్ష ఎదుగుదల, పతనాలను అంచనా వేసి ప్రధాని మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడి ఉండొచ్చు. వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచడం వల్ల ఆయా దేశాల ఆర్థిక వృద్ధి పతనమవుతున్నాయి. ఈ కారణం వల్లే 2022-23లో భారత్ వృద్ధి రేటు అంచనాలను ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు, ఐక్యరాజ్య సమితితో సహా… మూడీస్ వంటి రేటింగ్ సంస్థలు కూడా తగ్గిస్తూ వచ్చాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కూడా భారత్ వృద్ధి రేటు తక్కువగానే ఉండే అవకాశం ఉంది. అయితే, గుడ్డి వాళ్ల రాజ్యంలో ఒంటి కన్ను రాజులా మన కంటే ఎక్కువ జీడీపీ ఉన్న అమెరికా, జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో ఆర్థిక పతనం కారణంగా మనం ఎదిగినట్లు, మన ర్యాంకు పెరిగినట్లు భావించాలని ప్రధాని సెలవిస్తున్నారు. దేశంలో ఆర్థిక వృద్ధి పతనంతో పాటు నిరుద్యోగం, పేదరికం లాంటివి పెరిగిపోతున్నా మన జీడీపీ ర్యాంకును చూసుకొని మురిసిపొమ్మని ప్రధాని ఉచిత సలహా ఇస్తున్నారు. భారతీయులారా…బహుపరాక్… మోదీ హయాంలో ఆర్థిక స్థితి దిగజారింది. దేశంలో ఎదుగుతోంది కేవలం నలుగురే. ఆ ఇద్దరు + వారి తాలూకూ మరో ఇద్దరు! ఈ దేశం మీది… సంపద మీది… మీ తలరాత మీ చేతుల్లోనే ఉంది. భ్రమలు వీడి… నిజాన్ని చూడగలిగితే… రేపటి రోజు మీదే. ఇది జరగకుంటే… మోదీలూ… అమిత్ షాలూ.. వారి వెనుకన ఉన్న అదానీలు… అంబానీలు మీ కళ్లకు గంతలు కడుతూనే ఉంటారు. దేశ సంపదను మీ కళ్ల ముందే కొల్లగొడుతూనే ఉంటారు… ఇకనైనా మేలుకుందాం.
డి.పాపారావు
98661 79615