నేటి ఇంటర్నెట్ యుగంలో భారతీయులు విదేశీ యాప్‌లకు, సోషల్ మీడియా వేదికలకు బానిసలవుతున్నారు! దీంతో మన వ్యక్తిగత సమాచారాన్ని విదేశీ కంపెనీలు దొంగిలించి మన జీవిత విధానాన్నే ప్రభావితం చేసే స్థాయికి చేరుకున్నాయి. మన సమగ్రత, సార్వభౌమత్వం మన సమాచారాన్ని కాపాడుకోవడంలోనే ఉన్నదని అందరం గ్రహించాలి. డిజిటల్ స్వావలంబన కోసం అందరం నడుం బిగించాలి.
మరోసారి భారత్ వలస రాజ్యంగా మారకుండా ఉండాలంటే డిజిటల్ రంగంలో స్వావలంబనను సాధించాలి. ఇందు కోసం మేధో వలసలకు అడ్డు కట్ట వేయాలి. అప్పుడు విదేశాల్లో జరుగుతున్న ఆవిష్కరణలు మన దేశంలోనూ జరుగుతాయి. అందుకోసం ప్రతిభకు ప్రోత్సాహం అందించాలి.
నేటి ఇంటర్నెట్ యుగంలో ప్రతి ఒక్కరూ విభిన్న అవసరాలతో జీవించాల్సిన అవసరం ఏర్పడుతున్నది. ఉరుకుల పరుగుల జీవితంలో భౌతిక, ఆధ్యాత్మిక జీవనం కన్నా డిజిటల్ జీవనానికే మనిషి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాడు. మన డిజిటల్ జీవితాల నుండి సమాచారాన్ని సేకరించి మనల్నే శాసించే స్థాయికి నేడు కార్పొరేట్ కంపెనీలు చేరుకున్నాయి. వాటి కనుసన్నల్లోనే మన జీవితాలు గడుస్తున్నాయడం అతిశయోక్తి కాదేమో!
సమాచారం మొత్తం నేడు డిజిటల్‌గా రూపాంతరం చెందడంతో, ఈ డిజిటల్ సమాచారంపై పెత్తనం కోసం నేడు ప్రపంచంలో తీవ్రమైన పోటీ వాతావరణం నెలకొన్నది. ఇటువంటి పోటీ వాతావరణంలో సమాచారంపై పట్టు సాధించాలనే ఆత్రుతలో ఎవరికి వాళ్లు అనైతిక ధోరణులు అవలంబిస్తూ గోప్యంగా ఉండాల్సిన వ్యక్తుల సమాచారాన్ని బహిరంగ మార్కెట్లలో అమ్మకానికి పెడుతున్నారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ మొదలైన సామాజిక మాధ్యమాలు మన అలవాట్లు, మన ప్రవర్తన, మన దినచర్య లాంటి ప్రైవేటు సమాచారాన్ని నిరంతరం నిక్షిప్తం చేస్తున్నాయి. నేడు మనం ఏం తినాలి, ఏం ధరించాలి, ఏ వస్తువు కొనుగోలు చేయాలనే విషయాలపై ఈ మాధ్యమాల ప్రభావం ఉందనడం అసత్యం కాదు. పొరుగు దేశాలపై దండయాత్రలు చేసి వాటిపై ఆధిపత్యం చెలాయించాలనే ధోరణి నేటికీ కొనసాగుతూనే ఉంది. కాకపోతే నేడు మారణాయుధాల స్థానంలో సామాజిక మాధ్యమాలు ఆయుధాలుగా మారాయి. కొన్ని సామాజిక మాధ్యమ కంపెనీలు వినియోగ దారుల వ్యక్తిగత సమాచారాన్ని తమ కబంధ హస్తాల్లో ఉంచుకుని ప్రపంచంపై పెత్తనం చెలాయించాలని చూస్తున్నాయి. ఈ కంపెనీలను సమాచార చోరులని పిలవొచ్చు.
ఎవరైతే తమ వ్యక్తిగత సమాచారాన్ని మరొకరికి అప్పగిస్తారో వాళ్లు వేరొకరికి బానిసలుగా మారుతారు అనటానికి సాక్ష్యం నేడు మన సమాజంలో జరుగుతున్న అనేక పరిణామాలే. ఎంతో మంది బాలికలు, మహిళలు సోషల్ మీడియా విష వలయంలో చిక్కుకుని అపరిచిత వ్యక్తులతో స్నేహం చేసి, వ్యక్తిగత సమాచారం మొత్తాన్ని వారికి అప్పగించి చివరికి వారి చేతుల్లో లైంగిక, ఆర్థిక దోపిడీలకు గురవుతున్నారు. డబ్బు సంపాదించాలనే పేరాశతో ఆన్లైన్ వ్యాపార సంస్థల చేతిలో మోసపోయినవారికీ లెక్క లేదు.నేడు భారత్‌లో ఎక్కువ శాతం మంది వినియోగిస్తున్నది విదేశీ స్మార్ట్ ఫోన్లే. వీటి ద్వారా తమ సమాచారం మొత్తం విదేశీ కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లిపోతుందని వారిలో ఎక్కువ మంది గ్రహించడం లేదు. విదేశాలకు చెందిన లోన్ యాప్ సంస్థలు భారత్‌లోనే ఎక్కువ మంది జేబులకు చిల్లులు పెడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇదే గనుక కొనసాగితే మన దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం విదేశాల గుప్పెట్లోకి వెళ్లిపోయే ప్రమాదం లేకపోలేదు. ఈ నేపథ్యంలో విదేశీ కంపెనీల వస్తువులు, సోషల్ మీడియా వేదికలను వాడే విషయంలో జాగ్రత్త వహించాలి.
ఒకప్పుడు పరాయి పాలకులను పారదోలడానికి స్వాతంత్య్ర ఉద్యమంలో మనం చూపించిన తెగువ, నేడు ప్రమాదకర పరాయి కార్పొరేట్ సంస్థల వస్తువులు, సోషల్ మీడియా వేదికలను దేశం నుండి పారదోలడానికి చూపించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పుడు వీటి మాయ నుండి మనం బయటపడగలమా, ఇవి లేకుండా మనం జీవించగలమా అని ప్రతి ఒక్కరికీ సందేహం రావచ్చు. కానీ స్థిత ప్రజ్ఞతతో, స్వదేశీ వస్తువులు, సోషల్ మీడియా వేదికల సాయంతో ఈ సమస్యను అధిగమించవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఆవిష్కరణల్లో మన భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారు. అనేక టెక్ దిగ్గజ కంపెనీల్లో భారతీయులు కీలక స్థానాల్లో ఉన్నారు. కాబట్టి మేధో వలసలకు అడ్డుకట్ట వేయగలిగితే విదేశాల్లో జరుగుతున్న ఆవిష్కరణలు మన దేశంలోనూ జరుగుతాయి. అద్భుత ఆవిష్కరణలు మనకు కష్ట సాధ్యమైనా అసాధ్యం మాత్రం కాదు. గూగుల్‌కు ప్రత్యామ్నాయంగా ‘క్యూమమ్’ నేడు ఎదుగుతూ ఉన్నది. వాట్సప్‌కు ప్రత్యామ్నాయంగా ఇప్పటికే ‘టెలిగ్రామ్’ తన ఉనికిని చాటుకున్నది. ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయంగా ‘కూ’ తన గొంతును వినిపిస్తున్నది. చింగారి, జోష్, మోజ్, లెహర్, కుటుంబ్ వంటి ప్రజాదరణ పొందిన యాప్‌లు మన దేశంలో పుట్టినవే. మన దేశంలో ప్రతిభకు కొదవ లేదు. కావలసిందంతా గుప్పెడు ప్రోత్సాహమే. అది లభిస్తే మన దేశం కూడా అగ్ర రాజ్యంగా మారుతుంది. ఇకనైనా ప్రతి ఒక్కరం స్వదేశీ యాప్‌లను, సోషల్ మీడియా వేదికలను ఉపయోగిద్దాం, ప్రోత్సహిద్దాం. డిజిటల్ స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు పొంది మన దేశాన్ని డిజిటల్ స్వతంత్ర దేశంగా మారుద్దాం!
(వ్యాసకర్త: వ్యక్తిత్వ వికాస నిపుణులు)
-ఈదర శ్రీనివాస్ రెడ్డి 78931 11985