Maruthi | టాలీవుడ్లో కామెడీ ఎంటర్టైనర్లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మారుతీ, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో కలిసి తెరకెక్కించిన చిత్రం ది రాజాసాబ్. హారర్ అండ్ థ్రిల్లర్ జానర్లో రూపొందిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా భారీ అంచనాల మధ్య విడుదలైంది. అయితే, ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్‌గా నిలిచింది. ప్రభాస్ అభిమానులు కూడా ఈ సినిమాపై పెద్దగా పాజిటివ్ స్పందన ఇవ్వకపోవడం గమనార్హం.ఈ వైఫల్యంతో దర్శకుడు మారుతీపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ జరిగింది. దీంతో ఆయన తదుపరి సినిమా ఏ హీరోతో ఉంటుందనే అంశంపై ఇండస్ట్రీలో పెద్ద చర్చ మొదలైంది.
మొదట్లో మారుతీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్నాడనే వార్తలు హల్చల్ చేశాయి. కానీ ప్రస్తుతం చిరంజీవి మూడు సినిమాలతో బిజీగా ఉండటంతో ఆ ప్రాజెక్ట్‌కు బ్రేక్ పడినట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం, మారుతీ తన కంబ్యాక్ మూవీని మెగా హీరో వరుణ్ తేజ్‌తో చేయాలని ఫిక్స్ అయినట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇటీవలే వరుణ్ తేజ్‌ను కలిసిన మారుతీ, ఆయనకు పూర్తి కథను వినిపించాడట. మారుతీ స్టయిల్‌కు తగ్గట్టుగా పక్కా కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ కథకు వరుణ్ తేజ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా భలే భలే మగాడివోయ్ తరహాలో ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా కనెక్ట్ అయ్యేలా, నవ్వులు పంచే ఎంటర్టైనర్గా ఉండబోతుందని సమాచారం. ఈ ప్రాజెక్ట్‌ను యూవీ క్రియేషన్స్ నిర్మించనున్నట్లు టాక్. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.
వరుణ్ తేజ్ ప్రస్తుతం దర్శకుడు మేర్లపాక గాంధీతో కొరియన్ కనకరాజు అనే ఎంటర్టైనర్లో నటిస్తున్నారు. ఈ సినిమా సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమా విడుదల అనంతరం మారుతీ దర్శకత్వంలో తెరకెక్కే ఈ కొత్త ప్రాజెక్ట్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. ది రాజాసాబ్ ఫెయిల్యూర్ తర్వాత మారుతీకి ఈ వరుణ్ తేజ్ సినిమా చాలా కీలకంగా మారింది. తనకు పేరు తెచ్చిన కామెడీ జానర్లో మళ్లీ బలమైన కథతో ప్రేక్షకుల ముందుకు రావాలని మారుతీ ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమాతో అయినా ఆయన గట్టి కంబ్యాక్ ఇస్తాడా? లేదా అన్నది చూడాల్సి ఉంది. మెగా హీరోతో కలయిక, యూవీ క్రియేషన్స్ బ్యానర్.. ఈ కాంబినేషన్‌పై టాలీవుడ్లో అంచనాలు ఇప్పటికే పెరుగుతున్నాయి.