Abbas | ఒకప్పుడు తెలుగు, తమిళ సినీ ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న లవర్ బాయ్ హీరో అబ్బాస్ (Abbas) మళ్లీ వెండితెరపై కనిపించేందుకు సిద్ధమయ్యాడు. ప్రేమదేశం, రాజా, నరసింహ, శ్వేతనాగు వంటి సూపర్ హిట్ చిత్రాలతో యువతలో ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న అబ్బాస్, హీరోగా మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా ప్రేక్షకులను మెప్పించాడు. అయితే 2014 తర్వాత సినిమాలకు దూరమైన ఆయన, విదేశాల్లో ఉద్యోగం చేస్తూ సాధారణ జీవితాన్ని కొనసాగించారు.ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత అబ్బాస్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుండటం అభిమానుల్లో ఆనందాన్ని నింపింది.
అబ్బాస్ తిరిగి నటిస్తున్న సినిమా ‘హ్యాపీ రాజ్’. తమిళ్ హీరో, సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్ (GV Prakash) హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీ గౌరీ ప్రియా హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. హ్యాపీ రాజ్ తెలుగు ప్రోమోను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ప్రోమో చూస్తే సినిమా మొత్తం లవ్ అండ్ కామెడీ జానర్లో సాగనున్నట్టు స్పష్టమవుతోంది. ఇందులో అబ్బాస్, హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ తండ్రి పాత్రలో నటిస్తున్నారు. ఆయన పాత్రలో కామెడీతో పాటు భావోద్వేగాలు కూడా ఉంటాయని ప్రోమో ద్వారా తెలుస్తోంది.
ఈ చిత్రం ఒక ప్రేమ జంట చుట్టూ తిరిగే కథగా తెరకెక్కుతోంది. ప్రేమ, పెళ్లి, ఆ తర్వాత వారి జీవితంలో వచ్చే అపార్థాలు, గొడవలు అన్ని అంశాలను లవ్ కామెడీగా చూపించనున్నారని సమాచారం. ప్రోమోలోని సరదా సన్నివేశాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ప్రస్తుతం హ్యాపీ రాజ్ సినిమా షూటింగ్ దశలో ఉంది. జివి ప్రకాష్ హీరోగా నటించడంతో పాటు సంగీతం అందిస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. అబ్బాస్ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుండటంతో ఆయన అభిమానులు సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత అబ్బాస్‌ను మళ్లీ వెండితెరపై చూడబోతుండటం ఆయన అభిమానులకు పెద్ద సర్ప్రైజ్గా మారింది. హీరోగా ఫేమ్ తెచ్చుకున్న అబ్బాస్, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టడం ఆసక్తికరంగా మారింది. హ్యాపీ రాజ్‌తో ఆయన రీ ఎంట్రీ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.