గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోదీ ప్రధాని స్థాయికి ఎదిగారు. కానీ ఆయన ప్రాంతీయ స్థాయి నాయకుడిగా ఉండాలని కోరుకుంటున్నారా అని నాకు తరచూ అనిపిస్తుంటుంది! అసెంబ్లీ ఎన్నికలలో, ఇంకా స్థానిక ఎన్నికలలో కూడా ఆయన ప్రచారం సాగించడాన్ని చూసి నాకు ఈ అనుమానం కలుగుతున్నది. దీని వల్ల ఆయనకు, బీజేపీకే ఎక్కువ నష్టం జరుగుతున్నది.
సొంత రాష్ట్రం కాబట్టి గుజరాత్లో గెలుపు కోసం ప్రధాని మోదీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చేస్తున్నారని అనుకోవచ్చు. కానీ ఆయనకు ఎన్నికల ప్రచారమంటే మోజు. అందువల్లే గతేడాది కరోనా వ్యాపిస్తున్నా పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. గంగా నదిలో మృత దేహాలు కొట్టుకు పోయిన తర్వాత, శ్మశానాల్లో అంత్యక్రియలకు జనం బారులు తీరిన తర్వాతే ఆయన తమ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పొరపాట్లను గ్రహించారు. ఈ తప్పిదానికి ఆయన చింతిస్తాడనుకున్నా, అలాంటి భావన ఆయనలో లేదు.
‘వసుధైవ కుటుంబకమ్’ నుంచి వచ్చిన పెద్ద మనిషిగా అంతర్జాతీయ ప్రాముఖ్యం గల అంశాలపై ప్రధాని మోదీ గొంతు వినిపిస్తూ ఉంటారు. ఇది యుద్ధాలు జరిపే కాలం కాదంటూ పుతిన్ వంటి వారితో ఆయన అన్నప్పుడు ప్రశంసలు వస్తున్నాయి. ఆ వెంటనే ఆయన మళ్లీ ఎన్నికల ప్రచారంలో మునిగిపోతారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లలో గెలవడం పైనే తన జీవితం ఆధారపడి ఉందన్నట్టుగా ప్రవర్తిస్తారు. మోర్బీ వంతెన ప్రమాదం తర్వాత గుజరాత్ మాడల్ అంటూ గొప్ప పరిపాలనగా చెప్పుకోవడం ఇక సాధ్యం కాదు. ఈ ప్రమాదం పట్ల ఆయన నిజంగా బాధపడి ఉంటే, 135 మంది మృతికి కారణమైన కంపెనీ యజమానిని వెంటనే పట్టుకొని ఉండేవారు కదా. హిమాచల్ ఎన్నికల్లో తనను చూసి ఓటేయాలని ఆయన చెబుతున్నారు. అంటే తనను స్థానిక నాయకుడిగా మార్చుకున్నారాయన. ‘కొన్నేండ్ల పాటు మీ మధ్య నివసించే అదృష్టం నాకు దక్కింది. జీవితాంతం ఆ రుణం తీర్చుకోవడం నా బాధ్యత. భక్తి, సంస్కృతిగల ప్రాంతం హిమాచల్ ప్రదేశ్. అందువల్ల బీజేపీ ఎప్పుడూ ఈ రాష్ర్టానికి సేవ చేయాలనుకుంటుంది’ అని మోదీ అన్నారు.
కానీ ప్రియమైన ప్రధాని గారూ! మీరు ఢిల్లీకి తిరిగి వచ్చిన తరువాత ఎదురైన దృశ్యం సంగతేమిటి? ఈ సారి కూడా ఢిల్లీ విషపూరితమైన గ్యాస్ చాంబర్‌గా మారిపోలేదా? పైగా బీజేపీ నాయకుడు ఒకరు ఈ కాలుష్యానికి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బాధ్యుడన్నట్టు మాట్లాడుతున్నారు. పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వం రైతులు పంట వ్యర్థాలు తగలబెట్టకుండా ఆపడం లేదని బీజేపీ విమర్శిస్తున్నది. వాయు కాలుష్యం ఒక రాష్ట్ర సమస్య కాదు. దీనిని కేంద్ర స్థాయిలో విధానాల ద్వారా అరికట్టవలసిందే. ఎనిమిందేండ్లుగా మీ(కేంద్ర) ప్రభుత్వం చేసిందేమీ లేదు. గంగ, యమున నదులను కూడా పరిశుభ్రం చేసింది లేదు. ఇవన్నీ స్థానిక సమస్యలని బీజేపీ భావిస్తున్నది. వాటికి జాతీయ స్థాయిలో ప్రాముఖ్యం ఇవ్వడం లేదు.
ప్రధాని మోదీ రాష్ర్టాలలో ఎన్నికల ప్రచారం సాగిస్తూ, జాతీయ ప్రాముఖ్యం గల అంశాలపై చిన్న స్థాయి నాయకుల చేత మాట్లాడిస్తున్నారు. మీరు ఇలా చేయడం వల్ల భారత్ తన విశ్వ గురు కల నెరవేర్చుకునే బదులు దానికి మరింత దూరంగా జరుగుతున్నది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చేస్తున్న మీరు ఇక జాతీయ ప్రాముఖ్యం గల అంశాలను ఎక్కడ పట్టించుకుంటారు? మీ వల్లనే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ గెలుస్తున్నదని ప్రజలకు చెప్పదలుచుకున్నారా? మీ వల్లనే బీజేపీ విజయాలు సాధించగలుగుతున్నదని చాటుకుంటున్నారా? కారణం ఏదైతేనేమి, మీరు నిరంతరం ఎన్నికలలో మునిగి తేలుతున్నారు. దీనివల్ల మీకు, బీజేపీకి నష్టమే జరుగుతున్నది. పార్లమెంట్, అసెంబ్లీ, స్థానిక ఎన్నికల్లో ఇంత ఎక్కువగా ప్రచారం చేసే ప్రధానిని నేను మొదటిసారిగా చూశాను. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ నాయకుడు ఒకరు తమ పార్టీ గెలిస్తే ప్రతి కాలేజీ విద్యార్థినికి స్కూటీ కొనిస్తామని హామీ ఇచ్చారు. ఇలాంటి చోటా నాయకులతో పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం వల్ల ప్రధాని మోదీ తన స్థాయిని తగ్గించుకున్నట్టు అవుతున్నది.
– తవ్లీన్ సింగ్(ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సౌజన్యంతో)