Actor Teena Sravya | మేడారం జాతర నేపథ్యంలో తలెత్తిన వివాదంపై ‘కమిటీ కుర్రాళ్లు’, ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ చిత్రాల ఫేమ్ నటి టీనా శ్రావ్య స్పందిస్తూ బహిరంగ క్షమాపణలు చెప్పింది. ఇటీవల మేడారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న ఆమె తన పెంపుడు కుక్క బరువుకు సమానంగా బెల్లాన్ని (బంగారం) తూకం వేసి మొక్కు చెల్లించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వివాదం చెలరేగింది. గిరిజన ఆచారాల ప్రకారం కుక్కను తక్కెడలో పెట్టి మొక్కు చెల్లించడం దేవతలను అవమానించడమేనని భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
ఈ వివాదంపై వివరణ ఇస్తూ టీనా శ్రావ్య ఒక వీడియో సందేశాన్ని విడుదల చేసింది. తన పెంపుడు కుక్కకు 12 ఏళ్ల వయసు ఉందని ఇటీవల దానికి పెద్ద ట్యూమర్ సర్జరీ జరిగి ప్రాణాపాయం నుంచి కోలుకోవాలని తాను అమ్మవార్లకు మొక్కుకున్నానని ఆమె తెలిపారు. ఆ భక్తితోనే తాను ఈ పని చేశానని, ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం తనకు లేదని వివరించారు. మేడారం సాంప్రదాయాల ప్రకారం ఇది తప్పని తనకు తర్వాతే తెలిసిందని, తన వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే మనస్ఫూర్తిగా క్షమించాలని ఆమె కోరారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగనివ్వనని, మన సంప్రదాయాలను ఎప్పుడూ గౌరవిస్తానని ఆమె హామీ ఇవ్వడంతో ఈ వివాదానికి తెరపడింది.