‘తెలుగు బిడ్డవురోరి తెలుగు మాట్లాడుటకు/ సంకోచ పడియెదవు సంగతేమిటిరా? అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు/ సకిలించు ఆంధ్రుడ! చావవేటికిరా’ ఈ మాటలు అన్నది ఎవరో కాదు, ప్రముఖ కవి, రచయిత, మాటల మాంత్రికుడు, ధిక్కార స్వరాన్ని వినిపించి అందరి గొడవను తన గొడవగా భావించిన అక్షరయోధుడు మన కాళోజీ నారాయణరావు.
1914, సెప్టెంబర్ 9న జన్మించిన కాళోజీ నారాయణరావు ‘కాళోజీ’, ‘కాళన్న’గా సుపరిచితులు. ఆయనను తెలంగాణ ప్రజల ఉద్య మ ప్రతిధ్వనిగా కొనియాడుతారు. ఆయన రాజకీయ, సాంఘిక చైతన్యాల సమాహారం. కవి త్వం రాసిన ప్రజాకవి. హక్కులడిగిన ప్రజల మనిషి. ఉద్యమం నడిపిన ప్రజావాది. మొత్తం గా తెలంగాణ జీవిత చలనశీలి, గొంతుక కాళోజీ. పుట్టుక, చావులు కాకుండా బతుకంతా తెలంగాణకిచ్చిన మహనీయుడు కాళోజీ.
నిజాం దమన నీతికి, నిరంకుశత్వానికి, అరాచకపాలనకు వ్యతిరేకంగా కాళోజీ తన కలమెత్తాడు. కాళోజీ స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు. ఆయన 1992లో భారతదేశ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ పొందారు. కాళోజీ జయంతిని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుతూ గౌరవించుకుంటున్నది. వరంగల్‌లో నెలకొన్న వైద్య విద్యాలయానికి ఆయన పేరు పెట్టింది. తెలంగాణ తొలిపొద్దు కాళోజీ. అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి- అన్యా యం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి. ‘అన్యాయాన్నెదిరించినవాడే నాకారాధ్యుడు’ అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు.
కాళోజీ తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్న డ, ఇంగ్లీషు భాషల్లో రచయితగా ప్రఖ్యాతిగాంచాడు. రాజకీయ వ్యంగ్య కవిత్వం రాయడంలో ఆయన దిట్ట. ‘నా గొడవ’ పేరిట సమకాలీన సామాజిక సమస్యలపై నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, కటువుగా స్పందిస్తూ పాలకులపై అక్షరాయుధాలను సంధించి ప్రజాకవిగా కీర్తి గడించా డు. తెలంగాణ ప్రజల ఆర్తి, ఆవేదన, ఆగ్రహం ఆయన గేయాల్లో రూపుకడతాయి. బీజాపూర్ నుంచి హన్మకొండకు తరలివచ్చిన కాళోజీ కుటుంబం మడికొండలో స్థిరపడింది. ప్రాథమిక విద్యానంతరం పాతబస్తీలోని చౌమహల్లా న్యాయపాఠశాలలో కొంతకాలం చదివిన కాళోజీ, ఆ తర్వాత సిటీ కాలేజీలోనూ, హన్మకొండలోని కాలేజీయేట్ ఉన్న త పాఠశాలలోనూ చదువు కొనసాగించి మెట్రిక్యులేషన్ పూర్తిచేశారు. 1939లో హైదరాబాద్‌లో హైకోర్టుకు అనుబంధంగా ఉన్న న్యాయకళాశా ల నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1930 నుం చే గ్రంథాలయోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో ఒక గ్రంథాలయం ఉండాలన్నది కాళోజీ ఆకాంక్ష.
నిజామాంధ్ర మహాసభ, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్‌తో కాళోజీ అనుబంధం విడదీయరాని ది. 1940లో రుక్మిణీబాయితో వివాహం జరిగిం ది. మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, జమలాపురం కేశవరావు, బూర్గుల రామకృష్ణారావు, పీవీ వంటివారితో కలిసి కాళో జీ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. విద్యార్థి దశలోనే నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘిం చి వరంగల్లులో గణపతి ఉత్సవాలు నిర్వహించాడు. తెలంగాణలో అక్షరజ్యోతిని వ్యాపింపజేయాలన్న తపనతో ఆంధ్ర సారస్వత పరిషత్‌ను స్థాపించిన ప్రముఖుల్లో కాళోజీ ఒకడు.
రజాకార్ల దౌర్జన్యాన్ని ప్రతిఘటిస్తూ 1945 లో పరిషత్ ద్వితీయ మహాసభలను దిగ్విజయంగా నిర్వహించడంలో కాళోజీ ప్రదర్శించిన చొరవ, ధైర్యసాహసాలను ఆయన అభిమానులు ఇప్పటికీ గుర్తుచేసుకుంటారు. వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించినందుకు ఆయనకు నగర బహిష్కరణశిక్ష విధించారు. వందేమాతరం ఆందోళనలో పాల్గొని ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు బహిష్కరణకు గురైనప్పుడు, వారిని నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేర్పించి ఆదుకోవడంలో కాళోజీ పాత్ర ఎనలేనిది. 1953లో తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షుడిగా, 19 58లో ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసనమండలికి ఎన్నికయ్యా రు. కేయూ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయగా, భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది. ‘హింస తప్పు, రాజ్యహింస మరీ త ప్పు’ అంటూ సామాన్యుడే నా దేవుడని ప్రకటించిన కాళోజీ 2002 నవంబరు 13న తుదిశ్వాస విడవడం యావత్ తెలంగాణకు తీరని లోటు.
(వ్యాసకర్త: తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర సహాధ్యక్షుడు)
(నేడు ప్రముఖ కవి కాళోజీ నారాయణ రావు వర్ధంతి)
-కామిడి సతీష్‌రెడ్డి
98484 45134