Dhurandhar OTT | బాలీవుడ్లో ఎలాంటి భారీ అంచనాలు లేకుండా విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసిన లేటెస్ట్ సెన్సేషన్ ‘దురంధర్’. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో దూసుకెళ్లింది. ఇండియన్ ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ యాక్షన్ డ్రామా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.1400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్ పవర్ఫుల్ పాత్రలో నటించి మరోసారి తన స్టార్‌డమ్‌ను నిరూపించుకోగా, సారా అర్జున్ హీరోయిన్గా ఆకట్టుకుంది. అలాగే అక్షయ్ ఖన్నా చేసిన స్పెషల్ రోల్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. అయితే ఈ సినిమాను మేకర్స్ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయకపోవడంతో, ఇతర భాషల ప్రేక్షకులు ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు.
ఈ నేపథ్యంలోనే వారికి గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. దురంధర్ మూవీ త్వరలోనే ఓటీటీలో విడుదల కానుంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం జనవరి 30 నుంచి దురంధర్ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ వార్త బయటకు రావడంతో థియేటర్లలో చూడలేకపోయిన ప్రేక్షకులతో పాటు, ఇప్పటికే చూసినవాళ్లు కూడా మళ్లీ మళ్లీ చూడాలని ఆసక్తి చూపిస్తున్నారు. ఓటీటీలో ఈ సినిమాకు భారీ డిమాండ్ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
థియేటర్ కలెక్షన్లతోనే కాదు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనూ కొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఈ సినిమాకు సీక్వెల్ కూడా రాబోతున్న విషయం తెలిసిందే. దురంధర్ సీక్వెల్‌ను మార్చి 19న విడుదల చేయనున్నట్టుగా మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. మొదటి భాగం సాధించిన ఘనవిజయంతో సీక్వెల్‌పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. మొత్తంగా దురంధర్ థియేటర్లలో సంచలనం సృష్టించినట్లే, ఇప్పుడు ఓటీటీలోనూ మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది.