భారతీయులారా, తస్మాత్ జాగ్రత్త! ‘నాడు సాధువు వేషంలో వచ్చి సీతమ్మను అపహరించాడు రావణాసురుడు. నేడు స్వాముల ముసుగులో వచ్చి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కెళ్లబోయింది బీజేపీ! సాధువని గుడ్డిగా నమ్మి రావణుడికి చిక్కింది సీతమ్మ. చైతన్యవంతులైన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్వాముల ముసుగులాగి బీజేపీ అసలు స్వరూపాన్ని బట్టబయలు చేశారు. ఇదీ తేడా! ‘నాటి రావణ-నేటి బీజేపీ’ పథకమంతా సేమ్ టు సేమ్!
ప్రియతమ హైందవ సహోదరులారా .. ‘జై శ్రీరామ్’ అంటున్న బీజేపీని గుడ్డిగా నమ్మి సీతమ్మ తల్లిలా మోసపోకండి. రాముని ముసుగులో బీజేపీ చేసేవి రావణ చేష్టలే అన్న సత్యాన్ని తెలంగాణ ప్రజలకే కాదు, భారతీయులందరికీ బట్టబయలు చేశారు. అందుకే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, వాళ్ల నాయకుడు కేసీఆర్ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు. శభాష్ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులారా! శభాష్!
ఇలా బట్టబయలైనా సరే, తమ అరాచకత్వానికి పశ్చాత్తాపపడకపోగా, ఎన్నో రాష్ర్టాలలో విజయవంతమైన ఈ పథకం తెలంగాణలో విఫలమైనందుకు పరితపిస్తున్నది బీజేపీ. నిన్నటి నెహ్రూ, ఇందిర కాంగ్రెస్ను, వాజ్పేయి, అద్వానీ బీజేపీని గురించి కాదుగాని, మోదీకి ముందటి నయా కాంగ్రెస్ను, మోదీ నయా బీజేపీని తలుచుకుంటేనే వణికిపోతున్నారు ప్రజలు. ఎందుకంటే.. ప్రజల కోసమే అంటూ కార్పొరేట్లకు బడా, బడా కాంట్రాక్టులిచ్చి, వాళ్లిచ్చే వందల కోట్ల నిధులతో ఓటర్లను కొని అధికారాన్ని సంపాదించటానికి కాంగ్రెస్, ప్రభుత్వ ఆస్తులన్నీ కారుచౌకగా కార్పొరేట్లకు కట్టబెట్టి వాళ్లిచ్చే వేల కోట్లతో ఏకంగా ఎమ్మెల్యేలనే కొని అధికారం సంపాదించటానికి బీజేపీ అలవాటుపడ్డాయి. అంతే తేడా! ఇద్దరూ జపించే మంత్రం ఒక్కటే- ‘డబ్బుతో అధికారం.. అధికారంతో డబ్బు’.
బీజేపీది కూడా అదే సూత్రమన్న వాస్తవాన్ని గ్రహించలేక, కాంగ్రెస్ను గద్దె దింపితే చాలు, బాగుపడతామన్న విశ్వాసంతో బీజేపీని గద్దెనెక్కించిన ప్రజలు, ఇప్పటికి తెలుసుకోగలిగారు పెనం మీది నుంచి ఏకంగా పొయ్యిలో పడ్డామని. ఆ మంటలకు తాళలేక అల్లాడిపోతున్నారు. ఈ మంటల్ని చల్లార్చి తమను కాపాడేవాళ్ల కోసం అన్ని దిక్కులా పారజూస్తున్నారు. బీటలు వారిన పంట చేను వర్షించే మబ్బు కోసం ఆశగా ఆకాశం వైపు చూస్తున్నట్లుంది దేశ ప్రజల పరిస్థితి. సరిగ్గా ఈ సమయంలో ‘కేసీఆర్ బీఆర్ఎస్’ కారుమబ్బులా కనిపించింది. వామపక్షాల చిరుగాలి కూడా దానికి తోడైంది. ఆహా! ఇక ఈ మబ్బు తప్పక వర్షిస్తుందన్న విశ్వాసంతో, ఆనందోత్సాహాలతో కుల, మత, ప్రాంత, వర్గాలకు అతీతంగా భారతీయులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారన్నది అక్షరసత్యం.
అందుకే బీఆర్ఎస్ మబ్బు దేశవ్యాప్తంగా విస్తరించి వర్షిస్తే తాము పుట్టించిన విద్వేష జ్వాలలు ఆరిపోవటం ఖాయం అన్న భయం పట్టుకుంది బీజేపీకి. అందుకే కృత్రిమంగా ఉప ఎన్నికలు సృష్టించి, కేసీఆర్ను తెలంగాణ దాటకుండా చేయాలన్న కుట్రకు బీజేపీ తెరతీసిందనీ, మునుగోడు ఉపఎన్నిక అందులో భాగమేనని రాజకీయ నిపుణులంటున్నారు. ఇది పూర్తయ్యేలోపే మరో ఉపఎన్నికను సృష్టించాలన్న బీజేపీ కుట్రలో భాగమే స్వాముల ముసుగులో ఎమ్మెల్యేల కొనుగోలు యత్నమని ఇప్పుడు సామాన్యూలకూ తెలిసిపోయింది!
ఈ కుట్రకు తమకు ఎలాంటి సంబంధం లేదని, బేరసారాలాడిన స్వాములెవరో తమకు తెలియదని తెలంగాణ బీజేపీ నేతలు బుకాయిస్తున్నారు. కానీ కిషన్రెడ్డి, అమిత్ షా వంటి కేంద్ర మంత్రులు, బండి సంజయ్ లాంటి నేతలతో రామచంద్ర భారతి (ఢిల్లీ), సింహయాజులు (తిరుపతి), నందకుమార్ (హైదరాబాద్)లకు సన్నిహిత, ఆంతరంగిక సంబంధాలున్నట్లు స్టింగ్ఆపరేషన్ ఆడియో, వీడియో క్లిప్పింగులు నిరూపిస్తున్నాయి. ఇవి చూశాక కూడా యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి వద్ద ప్రమాణాలు చేద్దామంటున్న బీజేపీ నేతలను ప్రజలు చీదరించుకుంటున్నారు. ‘చెడు పోకడలకు సంకేతాలు కుక్కు మూతి పిందెలు’. అలాగే బీజేపీ పతనానికి సంకేతాలు వాళ్ల వికృత క్రీడలు అని ప్రజలంటున్నారు. ‘మునిగి పోతున్న నావ బీజేపీ’ అని ఆ పార్టీ నేతలే గ్రహించి, ఒక్కొక్కరూ ఆ నావ నుండి దూకేస్తున్నారు. చూస్తూ చూస్తూ మునిగే నావలో ఇతర పార్టీల నేతలు ఎందుకెక్కుతారు?
అంతేగాదు ఎనిమిదేండ్లుగా రాష్ట్రంలో టీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ పాలన, వాటి ఫలితాల గురించి నేడు గ్రామీణులు కూడా చర్చించుకుంటున్నారు. తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతున్నది. తత్ఫలితంగానే మోదీ బీజేపీది పతన మార్గమని, కేసీఆర్ టీఆర్ఎస్ది ప్రగతి మార్గమన్న నిర్ధారణకొచ్చారు భారతీయులు. ఎందుకంటే, ‘దేశమంటే కార్పొరేట్లు, కుబేరులోయ్’ అంటూ సదా వాళ్ల సేవలో మునిగి తేలుతున్నారు మోదీ. వాళ్లను ప్రపంచ కుబేరులుగా అందలమెక్కించటానికి వీలైన మార్గాల కోసం పరిశోధించారు. 1930వ దశకంలో జర్మనీ, ఇటలీ దేశాల్లో ప్రైవేటీకరణ తప్ప జాతీయీకరణకు తావు లేకుండా చేసిన హిట్లర్, ముస్సోలినీని.. 1980వ దశకంలో ఇంగ్లండ్, అమెరికాలలో వస్తూత్పత్తి, ప్రజాపంపిణీ, సేవల కల్పన, ప్రజా వాణిజ్యం ప్రభుత్వ బాధ్యత కానేకాదన్న మార్గరెట్ థాచర్, రొనాల్డ్ రీగన్లను ఆదర్శంగా ఎంచుకున్నారు మోదీ. ఆయా నాయకుల నాజీయిజం, ఫాసిజం, థాచరిజం, రీగనిజాలను కలగలిపి వాటన్నింటినీ తలదన్నేలా వ్యవసాయం, రక్షణ, అడవులు సహా అన్ని రంగాలను కార్పొరేటీకరణ చేయడం తప్ప, ప్రభుత్వానికంటూ దేన్నీ మిగల్చరాదన్న లక్ష్యంతో ‘మోదీయిజాన్ని’ రూపొందించారు నరేంద్రమోదీ! మోదీ బీజేపీకి ఓటేస్తే తమ పతనానికి తామే బాట వేసుకున్నట్లేనన్న నిర్ధారణకొచ్చారు భారతీయులు.
అందుకే కేసీఆర్ బీఆర్ఎస్ వైపు దృష్టి సారించారు భారతీయులు. ఎందుకంటే, ‘దేశమంటే కర్షకులు, కార్మికులోయ్’ అంటూ సదా వాళ్ల కోసమే పరిశ్రమిస్తున్న ప్రజా నేత కేసీఆర్. తాను శ్రమించడమే కాదు, తెలంగాణ మాజీ గవర్నర్ నరసింహన్ అన్నట్లు తన మంత్రులు, ఎమ్మెల్యేల చేత ప్రణాళికాబద్ధంగా టీమ్ వర్క్ చేయిస్తున్న మంచి కెప్టెన్ కేసీఆర్. గుడ్డిగా శ్రమించడం కాదు, డెంగ్ గ్జియావో పింగ్ నాయకత్వాన మొదట వ్యవసాయంలో తర్వాత పారిశ్రామికాభివృద్ధిలో అమెరికాకు దీటుగా ఎదిగిన చైనాను ఆదర్శంగా తీసుకుని పరిశ్రమిస్తున్న అధ్యయన శీలి కేసీఆర్. తత్ఫలితంగానే వ్యవసాయ, పారిశ్రామిక, సంక్షేమ రంగాల్లో దూసుకుపోతూ స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామిగా నిలిచింది తెలంగాణ.
దటీజ్ కేసీఆర్. అందుకే కేసీఆర్ టీఆర్ఎస్ (బీఆర్ఎస్)కు ఓటేస్తే తమ ప్రగతికి తాము బాట వేసుకున్నట్లేనని మునుగోడు ఓటర్లు, తెలంగాణ ప్రజలే కాదు, భారతీయులంతా దృఢంగా విశ్వసిస్తున్నారు. తథాస్తు! భరతమాతకు శుభమస్తు!
ప్రియతమ హైందవ సహోదరులారా.. ‘జై శ్రీరామ్’ అంటున్న బీజేపీని గుడ్డిగా నమ్మి సీతమ్మ తల్లిలా మోసపోకండి. రాముని ముసుగులో బీజేపీ చేసేవి రావణ చేష్టలే అన్న సత్యాన్ని తెలంగాణ ప్రజలకే కాదు, భారతీయులందరికీ బట్టబయలు చేశారు. అందుకే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, వాళ్ల నాయకుడు కేసీఆర్ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు. శభాష్ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులారా! శభాష్!
‘దేశమంటే కర్షకులు, కార్మికులోయ్’ అంటూ సదా వాళ్ల కోసమే పరిశ్రమిస్తున్న ప్రజా నేత కేసీఆర్. తాను శ్రమించడమే కాదు, తెలంగాణ మాజీ గవర్నర్ నరసింహన్ అన్నట్లు తన మంత్రులు, ఎమ్మెల్యేల చేత ప్రణాళికాబద్ధంగా టీమ్ వర్క్ చేయిస్తున్న మంచి కెప్టెన్ కేసీఆర్. గుడ్డిగా శ్రమించడం కాదు, డెంగ్ గ్జియావో పింగ్ నాయకత్వాన మొదట వ్యవసాయంలో తర్వాత పారిశ్రామికాభివృద్ధిలో అమెరికాకు దీటుగా ఎదిగిన చైనాను ఆదర్శంగా తీసుకుని పరిశ్రమిస్తున్న అధ్యయనశీలి కేసీఆర్.
బీఆర్ఎస్ మబ్బు దేశవ్యాప్తంగా విస్తరించి వర్షిస్తే తాము పుట్టించిన విద్వేష జ్వాలలు ఆరిపోవటం ఖాయం అన్న భయం పట్టుకుంది బీజేపీకి. అందుకే కృత్రిమంగా ఉప ఎన్నికలు సృష్టించి, కేసీఆర్ను తెలంగాణ దాటకుండా చేయాలన్న కుట్రకు బీజేపీ తెరతీసిందనీ, మునుగోడు ఉపఎన్నిక అందులో భాగమేనని రాజకీయ నిపుణులంటున్నారు. ఇది పూర్తయ్యేలోపే మరో ఉపఎన్నికను సృష్టించాలన్న బీజేపీ కుట్రలో భాగమే స్వాముల ముసుగులో ఎమ్మెల్యేల కొనుగోలు యత్నమని ఇప్పుడు సామాన్యూలకూ తెలిసిపోయింది!
-పాతూరి వెంకటేశ్వర రావు
98490 81889