అరుణ్ జైట్లీ ప్రోత్సాహంతో 2019 ఏప్రిల్ 4న నేను బీజేపీలో చేరాను. ఆ సమయంలో ఒక ప్రకటన చేశాను. దానిని సంక్షిప్తంగా కింద పొందుపరుస్తున్నా: ‘ఆధునిక యాంత్రిక సమాజం కుట్రలు, కుతంత్రాలతో నిండి ఉన్నది. ఇటువంటప్పుడు భారతీయుల్లో దేశభక్తి, జాతీయవాదం ఎంతో ముఖ్యం. రాష్ర్టాల్లోని స్థానిక ప్రజల గౌరవాన్ని కాపాడితేనే దేశానికి గుర్తింపు. భారతీయ ఆత్మ, జాతీయతా భావన ఎల్లప్పుడూ చైతన్యవంతంగా ఉండాలి. అప్పుడే దేశ సమగ్రత, ప్రాదేశిక భద్రత పరిపుష్ఠమౌతుంది’. పార్టీ నియమాలను నేను శ్రద్ధగా చదివాను. బీజేపీకి సానుకూల లౌకికవాదం శిరోధార్యం అని వాటిలో పేర్కొన్నారు. వసుధైక కుటుంబ భావనకు పార్టీ పెద్దపీట వేస్తుందనుకొన్నా. కానీ, బీజేపీ అసలు దీనికి కట్టుబడి ఉన్నదా? (బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను ఉద్దేశించి…)
గ్రేట్ బ్రిటన్ జనాభాలో భారత సంతతికి చెందిన వారు మూడు శాతమే. అయినప్పటికీ, రిషి సునాక్ ఆ దేశ ప్రధానిగా నియమితులయ్యారు. అమెరికాలో భారత సంతతికి చెందిన మహిళ కమలా హ్యారిస్ ఉపాధ్యక్ష పదవిని చేపట్టారు. ప్రపంచ దేశాల్లో పరిస్థితులు ఇలా ఉండగా.. మన దేశంలో విచ్ఛిన్నకర రాజకీయాలు ప్రోత్సహించబడుతున్నాయి. సమగ్ర మానవతావాదం, అంత్యోదయ భావనలను బీజేపీ వ్యవస్థాపకులు, స్వర్గీయ దీన్ దయాల్ ఉపాధ్యాయ్ సూచించారు. ఈ విశిష్ట లక్ష్యాలను చేరడానికి పార్టీలో ఏ కొంచెమైనా నిబద్ధత కనిపిస్తున్నదా? రాజధర్మాన్ని పాటించాలని వాజ్పేయి పిలుపునిచ్చారు. ఆయన పిలుపును ఎప్పుడైనా అనుసరించారా? రాజకీయ లబ్ధే లక్ష్యంగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం, సమాజంలో చీలికలు తీసుకురావడమే పార్టీకి నిత్యకృత్యమైంది.
కరోనా వల్ల కూలీలు, అసంఘటిత రంగ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇవేమీ పట్టించుకోని కేంద్రప్రభుత్వం.. కరోనా కట్టడిలో విజయం సాధించినట్టు సంబురాలు చేసుకొన్నది. ప్రభుత్వ చర్యలను చూసి ప్రజలు పెద్దయెత్తున నవ్వుకుంటున్నారు. పార్టీని వీడే సమయంలో ఇలా తప్పులు ఎత్తిచూపడం నా లక్షణం కాదు. ఇది హుందాతనం అనిపించుకోదని తెలుసు. అయితే, నిజాయితీగా ఆత్మపరిశీలన చేసుకొంటారనే ఇదంతా చెబుతున్నా. సామాజిక భద్రత, సామాజిక న్యాయం వంటి కీలకాంశాలను పార్టీ పట్టించుకోవట్లేదు. జనాభాలో కులగణనకు పార్టీ, కేంద్రప్రభుత్వం పూర్తి వ్యతిరేకంగా ఉన్నది. అప్పటి నుంచి నాలో భయం మొదలైంది.
ప్రాంతీయ భాషలను, స్థానిక ప్రజల భావోద్వేగాలను ఉద్దేశపూర్వకంగా చిన్నచూపు చూడడం పార్టీకి అలవాటుగా మారిం ది. ఏకభాషా పెత్తనాన్ని ప్రోత్సహిస్తున్నారు. తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన అవకాశాలను కేంద్రప్రభుత్వం అందకుండా చేస్తున్నది. ప్రపంచస్థాయి పథకం మిషన్ భగీరథ తెలంగాణలో అమలైంది. సాగునీటి ప్రాజెక్టుల వల్ల భూగర్భజలాలు రాష్ట్రవ్యాప్తంగా పైకి ఉబికి వచ్చాయి. వ్యవసాయం లాభసాటిగా మారింది. అయినా రాష్ట్రంపై కేంద్రం వైఖరిలో మార్పు రాలేదు.
ఇప్పుడు నా సామాజిక వర్గమైన చేనేతవృత్తుల వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తా. కరోనా సంక్షోభంలో చేనేత సమస్యలపై అప్పటి మంత్రికి 2020 సెప్టెంబర్ 20న నేను రాతపూర్వకంగా విన్నవించా. దాన్ని పట్టించుకోలేదు. అందులో ఒక అంశం మచ్చుకు.. అంగన్వాడీ వర్కర్లకు ఒక్కొక్కరికి రెండు కాటన్ చీరల కోసం రూ.400 చెల్లిస్తామన్నారు. పత్తి ముడి సరుకు, నేత నేయడానికి ఖర్చు అంతా కలిపి కనీసం రూ.900 ఖర్చు అవుతుంది. వీటికి అవసరమైన నిధులను విడుదల చేస్తే, చేనేత వర్గం వారు ఎంతో లబ్ధి పొందేవారు. పోషణ్ అభియాన్ కింద 53.43 లక్షల యూనిట్ల డ్రెస్ మెటీరియల్ సేకరణతో చేనేతవర్గంతో పాటు 13.36 లక్షల మంది అంగన్వాడీ వర్కర్లకు ప్రయోజనం చేకూరేది. చేనేత కార్మికుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకురావడానికి నేను ఎల్లప్పు డూ ప్రయత్నించా.. కొన్నింటిని విన్నారు, మరికొన్నింటిని పట్టించుకోలేదు
ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా జరుపాలన్న నా అభ్యర్థనను పరిగణలోకి తీసుకొని 2015 నుంచి ఏటా జరుపుతున్నారు. దీంతో పార్టీకి ఎంతో గుర్తింపు వచ్చింది. అయినప్పటికీ, దీనికి కారణమైన నేను.. ఎలాంటి గుర్తింపు, గౌరవాన్ని ఆశించలేదు. చేనేత కార్మికులను భూమి లేని కూలీలుగా పరిగణించాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వారికి 100 రోజుల వేతనం ఇవ్వాలని, తద్వారా జీవనాధారం కల్పించాలని అభ్యర్థించా. దీనికి అప్పటి గ్రామీణాభివృద్ధి మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆయన ఆదేశాలు బుట్టదాఖలయ్యాయి. 2017లో కేంద్రప్రభుత్వం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జీఎస్టీని ప్రవేశపెడుతున్నప్పుడు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నేను సత్యాగ్రహ దీక్ష చేపట్టా. పత్తి, పట్టు, ఉన్ని, జనపనార వంటి సహజ దారాలపై, నూలుపై జీఎస్టీ వేయొద్దన్న నా అభ్యర్థనపై అప్పటి ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సానుకూలంగా స్పందించారు. కానీ, అది అమలు కాలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు ఉన్నాయి.
చివరకు ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కూడా ఉచితాల కింద లెక్కగట్టడం నా మనసును తీవ్రంగా గాయపర్చింది. గడిచిన నాలుగేండ్లలో జాతీయ స్థాయిలో నన్ను విస్మరించారు. ఎన్నోసార్లు అవమానించారు. తక్కువ చేసి చూశారు. అయినప్పటికీ, ఆ ఆవేదనను దిగమింగుతూనే వచ్చా. ఈ నేపథ్యంలోనే, బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీ చేస్తున్నా.
-ఆనంద భాస్కర్ రాపోలు