అనుకున్నదొక్కటీ… అయినది ఒక్కటీ… అంటూ మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి విషాద గీతం పాడుకుంటున్నారు. అంచనాలు తారుమారు కావడంతో కళ్లు బైర్లు కమ్మి పేక మేడలా కుప్పకూలిపోయారు. తాను ఓడిపోక తప్పదేమోననే అసహనం ఫీలవుతున్నారు. కనీసం రెండో స్థానమైనా దక్కేట్టు లేదని భయపడుతున్నారు. అనవసరంగా రాజీనామా చేశానా అని దిగాలు పడుతున్నారు. సొంత క్యాడర్, బీజేపీ క్యాడర్ వెంట రాకపోవడమూ, జనం ఈసడించుకోవడమే ఇందుకు ప్రధాన కారణం.
నిజం చెప్పు… పార్టీ మారింది 18 వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు కోసమే కదా? అని ప్రజలు సూటిగా ప్రశ్నించడం రాజగోపాల్ రెడ్డికి ఇబ్బందికరంగా మారింది. దీంతో రోజురోజుకూ ఆయనలో ఓటమి అసహనం పెరిగిపోతున్నది. తాను ప్రజలను ఓట్లు అడగటానికి వచ్చిన అభ్యర్థినన్న సోయి మరిచి…‘తొక్కుతాను నా కొడుకుల్లారా’ అంటూ పరుష పదజాలంతో జనాన్ని బెదిరిస్తూ, చీదరించుకుంటూ ప్రచార యాత్రను కొనసాగిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన తాను పార్టీ మారి బీజేపీలో చేరగానే కాంగ్రెస్ క్యాడరంతా తన వెంటే పోలోమంటూ వచ్చేస్తారని రాజగోపాల్ రెడ్డి భావించారు. తనతో వచ్చిన క్యాడర్‌కు బీజేపీ క్యాడర్ తోడు అవుతుందని లెక్కలు వేసుకున్నారు. ఈ క్రమంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ నుంచి తనకు అన్ని విధాలుగా సహకారం, అండదండలు లభిస్తాయని భావించారు. దీంతో తనకు రాజకీయంగా మంచి భవిష్యత్తు లభించడంతో పాటు మరిన్ని భారీ కాంట్రాక్టులు దక్కుతాయని ఆశ పడ్డారు. అప్పుడు తన జీవితం బీజేపీ నీడలో మూడు అవకాశాలు-ఆరు కాంట్రాక్టులుగా సాఫీగా సాగిపోతుందని కలలు కన్నారు. కానీ ఆయన అంచనాలన్నీ తలకిందులయ్యాయి.
పార్టీ మారగానే తన వెంటే వస్తారనుకున్న కాంగ్రెస్ క్యాడర్ రాలేదు. తన వెంట వస్తామని మాట ఇచ్చిన కాంగ్రెస్ కీలక నేతలు, శ్రేణులకు రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడం వెనుకనున్న మతలబు ఏమిటో కళ్లకు కట్టినట్టు అర్థం అయింది. మీ సొంత వ్యాపారాభివృద్ధి కోసం మమ్మల్ని పావులుగా వాడుకుంటారా? అని కాంగ్రెస్ నేతలు ఈసడించుకున్నారు. మరోవైపు బీజేపీలో రాజగోపాల్ రెడ్డి చేరికను స్థానిక బీజేపీ క్యాడర్ అసలు జీర్ణించుకోలేపోయింది. పార్టీ ఉనికిని ఇంతకాలంగా కాపాడుకుంటూ వచ్చిన తమపై రాజగోపాల్ పెత్తనం ఏమిటని ఎదురు తిరిగింది. సైద్ధాంతికంగా తాము కాంగ్రెస్‌లో ఇమడలేం కాబట్టి తమ ముందున్న ఏకైక ఆప్షన్ టీఆర్ఎస్ కావడంతో మూకుమ్మడిగా ఆ పార్టీలో చేరారు. మరోవైపు అధికార పార్టీ ఎంపీగా, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండి ఏమీ చేయలేకపోయిన రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి మళ్లీ ఇప్పుడు ఏం సాధిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పరిస్థితులు ఇలా ప్రతికూలంగా మారడంతో, డామిట్… కథ ఇలా అడ్డం తిరిగిందేంటీ? అని రాజగోపాల్ రెడ్డికి కళ్లు బైర్లు కమ్ముకున్నాయి. గెలవడం మాట అటుంచితే, కనీసం రెండో స్థానమైనా దక్కే అవకాశం ఆమడ దూరంలో కనిపించని పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా గౌరవప్రదంగా పదవీ కాలం ముగిసేదాకా ఉన్న అవకాశాన్ని రాజగోపాల్ చేజేతులా నాశనం చేసుకున్నారని అయిన వారు కూడా నిష్ఠూరంగా మాట్లాడటం మొదలు పెట్టారు. కాంగ్రెస్‌లో ఉండి లోపాయికారీగా గెలిచేందుకు తోడుగా ఉంటానన్న సోదరుడు, భువనగిరి ఎంపీ వెంకట్ రెడ్డి, కోవర్టు ఆపరేషన్ చేయబోయి అడ్డంగా దొరికి పోయారు. దీంతో ప్రస్తుతం రాజగోపాల్ పరిస్థితి ‘ఉన్నది కాస్త ఊడింది…సర్వ మంగళం పాడింది’ అన్నట్టుగా తయారైంది.
పెరిగిపోతున్న ఓటమి అసహనం
గెలుస్తాననుకున్న చోట ఘోరమైన ఓటమి భయం. కనీసం రెండో స్థానంలో ఉంటే చాలు అదే పదివేలు అనుకుంటే…ఆ అవకాశం కూడా మృగ్యమైపోయింది. బీజేపీ సొంతంగా నిర్వహించుకున్న సర్వేల్లోనూ ముచ్చటగా మూడో స్థానమేనని తేటతెల్లం అయింది. అలాంటి చోటుకు వెళ్లి పరువు తీసుకునే కంటే వెళ్లకపోవడమే మంచిదని బీజేపీ జాతీయ నాయకులు ఎవరు కూడా మునుగోడు వైపు కన్నెత్తి చూడటం లేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం చేయడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వారం రోజుల కిందట మునుగోడుకు వచ్చారు. అయితే అక్కడ పట్టుమని రెండు వందల మంది కూడా లేకపోవడంతో, కిషన్ రెడ్డి ముఖం మాడిపోయింది. కేంద్ర మంత్రి హోదాలో వస్తే… వచ్చేది రెండు వందల మందా? అని కిషన్ రెడ్డి మొహమాటం లేకుండా అడిగేశారు. దీంతో రాజగోపాల్ రెడ్డికి మంత్రి ముందు తల తీసినట్టు అయింది. ఆ మరుసటి రోజు ఎన్నికల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న గుడారం వద్ద తన ముఖ్య అనుచరులతో ఆయన భేటీ అయ్యారు. ‘
మునుగోడులో నేను 2 వేల మందికి బీజేపీ కండువాలు కప్పితే, వచ్చేది 2 వందల మందా? మిగతా వాళ్లంతా ఏమయ్యారు? డబ్బులు బాగానే తీసుకున్నారు కదా? అవి వారికి ముట్టినయా? లేక మధ్యలో మీరే మింగేశారా?’ అని తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. ఎన్నో అవమానాలను దిగమింగుకొని ఆయన వెంట ఉన్నందుకు తమకు తగిన శాస్తి జరిగిందనుకున్నారేమో వారిలో ఎవరూ నోరు మెదపలేదు. ఇది రాజగోపాల్ రెడ్డిని మరింత ఆగ్రహానికి గురి చేయడంతో ముందున్న కుర్చీలను వారిపై విసిరి కొడుతూ, ఇక ముందు తనకు కనిపించొద్దని హెచ్చరించారు. ఈ కారణం వల్లే రాజగోపాల్ రెడ్డికి కుడి భుజంగా ఉన్న గోవర్ధన్ రెడ్డి, ఆ మరుసటి రోజే రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారని ఆయన అనుచర వర్గం చెబుతున్నది. ఇదిలా ఉండగా ఆ రోజు రాజగోపాల్ రెడ్డితో తిట్లు తిన్న నాయకులలో ఎవరు కూడా తిరిగి ఆయన ముఖం చూడ లేదు. పైగా తమకు గౌరవమిచ్చే అభ్యర్థి తరఫున రాజగోపాల్ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా మరింత పట్టుదలతో ప్రచారం చేస్తున్నారు. ఏదో ఒకటి చేసి గెలవాలనుకుంటున్న రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు మద్యాన్ని నమ్ముకున్నారు.
‘ఈ బద్మాష్ గాళ్లు ఎందుకు రాజీనామా చేసిండ్రు… ఈళ్లు మస్తుగ పైసలిస్తరు. ఆళ్లు… తాగి తందనాలాడ్తరు. ఇంట్లోని ఆడోళ్లని నిద్రపోనీయరు. ఆళ్లు ఆడ కూర్చొని గ్యాస్ 12 వందలు చేస్తరు. ఈళ్లు మా సంసారాల్ని కూల్చడానికే ఉన్నరు.’
– రాజగోపాల్ రెడ్డి రాజీనామా, ప్రచార తీరుపై ఒక గ్రామీణ మహిళ ఆవేదన, ఆక్రోశం ఇది…
చెరపకురా చెడేవని ఒక సామెత ఉంది. కేసీఆర్‌ను దెబ్బ కొట్టడానికి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరి ఉప ఎన్నిక తీసుకొచ్చారు. కానీ ఇపుడు ఆయన పరిస్థితి తాను తీసిన గొయ్యిలో తానే పడ్డట్లు అయ్యింది.
-వెల్జాల చంద్రశేఖర్
98499 98092