మునుగోడు ఉపఎన్నికల సందర్భంగా ముదిరిన ఊసరవెల్లుల మాయోపాయాలను, విష నాలుకల నటవిన్యాసాలను చూసే భాగ్యం తెలంగాణ ప్రజలకు దక్కుతున్నది. అబద్ధాలను నెగ్గించడానికి కమలం నేతలు పడుతున్న పాట్లు దిగజారుడుతనానికి పరాకాష్ఠగా నిలుస్తున్నాయి. తమకు లేని సుగుణాలను నకిలీ ఆభరణాలుగా ధరించి సంచరిస్తే, మావాళ్ళని, మంచివాళ్ళని జనం నమ్మేస్తారా? మారువేషాలతో మోసాలను దాచిపెట్టుకోగలమని బీజేపీ నేతలు అనుకోవడమే ఈ ఉప ఎన్నికల్లో విడ్డూరం.
అణగారిన జాతులు, కులాలు, పేదవర్గాల పట్ల బీజేపీ మూలసిద్ధాంతంలో నాటుకున్న వ్యతిరేక బీజాక్షరాలను దాచుకొని, బడుగులు, ఆత్మగౌరవం లాంటి పలుకులు వల్లిస్తుంటే బుద్ధిజీవులకు ఆశ్చర్యం, అంతకుమించి అసహ్యం కలగకుండా ఉండదు కదా! అసలు బీజేపీ పుట్టుక, నడవడిక, ఈనాటికీ ఆచరణలో పెడుతున్నదంతా అణచివేత సిద్ధాంతమే కదా! కనీసం ఇచ్చిన హామీలనైనా నెరవేర్చే అలవాటు బీజేపీకి అసలే లేదు. 2018లో నాటి హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్.. 2021 జనాభా లెక్కల్లో ఓబీసీల వివరాలు సేకరిస్తామని ప్రకటించింది నిజం కాదా? ఓబీసీల సబ్ కేటగిరీ కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమిస్తామని ప్రకటించి ఆ తర్వాత ఆ అంశాన్ని పక్కకు పెట్టలేదా? బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధత కల్పించే సాకుతో బీసీ జాబితాలో కులాలను కలిపే/తొలగించే రాష్ర్టాల హక్కును లాగేసుకునే కుట్ర చేసి, ఫెడరల్ స్ఫూర్తిపై దాడికి పాల్పడింది కేంద్రం. బీసీల జనాభా వివరాలు సేకరించాలని, చట్టసభలలో రిజర్వేషన్లు కల్పించాలని, ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చెయ్యాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సహా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నా మోదీ ప్రభుత్వం స్పందించలేదు. కేంద్రంలో 15 లక్షలకు పైగా ప్రభుత్వ కొలువుల ఖాళీలను భర్తీ చేయకపోవడం వల్ల ద్రోహానికి గురవుతున్నది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతరం కాదా? దేశంలో బుల్డోజర్ రాజ్యం నడిపిస్తూ, భయం గుప్పిట్లో భారతాన్ని బంధించే కుట్రలు చేస్తున్నారు.
కేసీఆర్ ప్రభుత్వం సకల జనుల సమ్మిళిత పురోభివృద్ధి కోసం సంక్షేమ పథకాల ఉద్యమాన్ని ఆచరణలో పెట్టింది. గౌడ కులస్థుల కోసం మద్యం దుకాణాల లైసెన్సులలో 15 శాతం రిజర్వేషన్లను అమలు చేయటమేగాక పాత బకాయిలతోసహా చెట్ల పన్ను రద్దు చేసింది. రూ.11 వేల కోట్లతో 7.3 లక్షల యూనిట్ల గొర్రెల పంపిణీ పథకాన్ని గొల్లకురుమల కోసం చేపట్టింది. ఏటా రూ.305 కోట్లతో 10.17 లక్షల మంది మత్స్యకారులకు ప్రభుత్వం చేపపిల్లలను పంపిణీ చేస్తున్నది. నూలు, రసాయనాలపై 50 శాతం సబ్సిడీతోపాటు నేతన్నలకు రూ.5 లక్షల బీమా కల్పించింది. దేశ చరిత్రలో ఏ పాలకుడూ చేపట్టని దళితబంధు లాంటి పేదరిక విముక్తి పథకాన్ని కేసీఆర్ అందించారు.
సకల జనుల సంక్షేమానికి బాటలు వేసిన కేసీఆర్ ప్రభుత్వాన్ని బలపరచకుండా మునుగోడు ఓటర్లు ఉండగలరా? ఒక జీవిని మచ్చిక చేసుకొని, మందను ఎత్తుకొనిపోయే కుటిల పన్నాగాల బీజేపీని ఎవరైనా కావాలనుకుంటారా? గోముఖ వ్యాఘ్రంలా తెలంగాణపై దండయాత్రకు దిగిన కమలం పార్టీ వలలో తెలివైన మునుగోడు ఓటర్లు పడరు. కేసీఆర్ ప్రభుత్వం అమలుపరిచిన అభివృద్ధి పథకాల లబ్ధిదారులే మునుగోడులో 2 లక్షల మందికి పైగా ఉన్నారు. ప్రచారంలో తిరుగుతున్నప్పుడు జనగామకు చెందిన ముత్యాలు మాతో అన్నట్లు మునుగోడు జనం పులినోట్లో తలపెట్టే అమాయకులేం కాదు. ఇదే నిజం.. మునుగోడైనా.. తెలంగాణైనా కేసీఆర్‌కు దూరమవ్వదు.
(వ్యాసకర్త: రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యులు)
-ఆంజనేయులు గౌడ్