కుల వృత్తులకు తెలంగాణ సర్కారు ఎంతో గౌరవం ఇస్తున్నది. కుల వృత్తి చేసుకునేవారికి రాయితీలు అందిస్తూ ఉపాధికి ఊతమిస్తున్నది. గొల్ల కురుమలు, మత్స్యకారులు, చేనేతలు ఇలా అన్ని కుల వృత్తి దారులకు అండగా నిలుస్తున్నది. ప్రభుత్వం రాయితీ ధరకు అందిస్తున్న గొర్రెల యూనిట్లు రెండింతలు, మూడింతలు అవుతుండటంతో గొల్ల కురుమల కుటుంబాలు మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి.
సబ్సిడీ గొర్రెలతో గొల్ల కురుమలకు ఎంతో మేలు జరుగుతున్నది. కుటుంబానికంతటికీ జీవనోపాధి కలుగుతున్నది. ఆర్థికంగా సాయం అందుతున్నది. 16 నుంచి 18 నెలలకు ఒకసారి గొర్రెలు ఈనుతుండటంతో ఎప్పటికప్పుడు మంద పెరిగిపోతున్నది. అనేక కుటుంబాల దగ్గర గొర్రెల మందలు మూడింతలయ్యాయి.
గొల్ల కురుమలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని, మాంసం ఎగుమతుల్లో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 2017లో గొర్రెల రాయితీ పథకానికి శ్రీకారం చుట్ట్టింది. ఈ పథకం కింద సర్కారు 75 శాతం రాయితీ అందిస్తున్నది. ఒక్కో యూనిట్‌కు 20 గొర్రెలు, ఒక పొట్టేలు అందిస్తుండగా.. యూనిట్ ఖర్చు రూ.1.25లక్షలుగా నిర్ణయించారు. ఇందులో లబ్ధిదారుడు తన వాటా కింద రూ.31,250 చెల్లించాలి. ప్రభుత్వం రూ.93,750 సబ్సిడీ ఇస్తుంది. ఇప్పటికే మొదటి విడుత పంపిణీ పూర్తయింది. గొర్రెల యూనిట్ ఇవ్వడంతో పాటు జీవాలకు బీమా, రవాణా, దాణా సౌకర్యాలు కూడా కల్పిస్తున్నది. మునుగోడు నియోజకవర్గంలో రెండు విడుతల్లో కలిపి 12,661 యూనిట్లు అందించింది.
సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం అమల్లోకి వచ్చి ఐదేండ్లు అవుతుండగా.. ధరల్లో అప్పటికీ, ఇప్పటికీ వ్యత్యాసం ఉన్నది. గొర్రె పిల్లల ధరలు పెరిగిపోయాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం యూనిట్ ఖర్చును ఇటీవల పెంచింది. ఇప్పటి వరకు ఉన్న రూ.1.25 లక్షల ఖర్చును రూ.1.75 లక్షలకు పెంచింది. మొత్తం యూనిట్ ఖర్చులో లబ్ధిదారుడు రూ.43, 250 చెల్లించాల్సి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.1,31,750 చెల్లిస్తున్నది. గతంలో లబ్ధిదారుడు డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో డబ్బులు చెల్లించాల్సి ఉండగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారులు ‘ఈ-లాభ్’ పోర్టల్ రూపొందించి దాని ద్వారా డబ్బులు చెల్లించే సదుపాయాన్ని కల్పించింది.
రాష్ట్ర ప్రభుత్వం కేవలం గొర్లు ఇచ్చి చేతులు దులిపేసుకోలేదు. వాటి పోషణ, రక్షణ, ఆరోగ్యానికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నది. గొల్ల కురుమలు ఆర్థికంగా నిలదొక్కుకునే వరకూ అండగా ఉంటున్నది. సర్కారు ఇచ్చిన గొర్రెల్లో ఏదైనా చనిపోతే దానికి బీమా పరిహారం అందిస్తున్నది. చనిపోయిన పొట్టేలుకు రూ.7 వేలు గొర్రెకు రూ.5, 200 ఇస్తున్నది. 2014 నుంచి 2022 వరకు రాష్ట్రంలోని 72,325 గొర్రెలకు ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించింది. బీమా ద్వారా రూ.31.95 కోట్లు చెల్లించింది. చనిపోయిన 52 మంది గొర్రెల పెంపకం దారుల కుటుంబాలకు రూ.52 లక్షల ఆర్థిక సాయం అందించింది. ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చే గొర్రె పిల్లలకు రవాణా చార్జీలను కూడా ప్రభుత్వమే భరిస్తున్నది. అంతే కాకుండా గొర్రెల కోసం మందుల కిట్ అందించి, గొర్రెలకు మేత సదుపాయం కూడా ప్రభుత్వమే కల్పిస్తున్నది.
మునుగోడులో భారీగా పంపిణీ
మునుగోడు నియోజకవర్గంలో ఇప్పటి వరకు రూ.166 కోట్ల బడ్జెట్‌తో 12,661 యూనిట్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. మొదటి విడతలో రూ.73 కోట్లు ఖర్చు చేసి 5,061 మందికి గొర్రెలు అందించారు. రెండో విడుత కింద ఇటీవల 7600 యూనిట్లకు నిధులు మంజూరు చేశారు. ఇందుకు సంబంధించిన రూ.93 కోట్ల ధనాన్ని నగదు రూపంలో పంపి ణీ చేశారు. ఇక నల్లగొండ జిల్లాలో మొదటి విడతలో 28,236 యూనిట్లు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 16 వేల యూనిట్లు పంపిణీ చేశారు. రెండో విడుతలో యాదాద్రి జిల్లాలో 31,877 యూనిట్లు, నల్లగొండ జిల్లాలో 65,314 యూనిట్లు పంపిణీ చేపట్టారు.
మూడింతలైన మందలు
సబ్సిడీ గొర్రెలతో గొల్ల కురుమలకు ఎంతో మేలు జరుగుతున్నది. కుటుంబానికంతటికీ జీవనోపాధి కలుగుతున్నది. ఆర్థికంగా సాయం అందుతున్నది. 16 నుంచి 18 నెలలకు ఒకసారి గొర్రెలు ఈనుతుండటంతో ఎప్పటికప్పుడు మంద పెరిగిపోతున్నది. అనేక కుటుంబాల దగ్గర గొర్రెల మందలు మూడింతలయ్యాయి. కొన్ని కుటుంబాల దగ్గర 80 నుంచి 100 దాకా జీవాలు కనిపిస్తున్నాయి. గొల్ల కురుమలు పొట్టేళ్లను, గొర్రెలను అమ్ముకుని ఆర్థికంగా లాభాలు గడిస్తున్నారు. మరోవైపు గొర్రెల ఉన్నితోనూ ఆదాయాన్ని పొందుతున్నారు. జీవాల సంరక్షణకూ తెలంగాణ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటున్నది. ఉమ్మడి రాష్ట్రంలో నట్టల నివారణ మందు ఏడాదికి ఒకటి, రెండు సార్లు మాత్రమే వేసేవారు. కానీ ఇప్పుడు ఏడాదిలో మూడు సార్లు పంపిణీ చేస్తున్నారు. గొర్రెలకు ఆరు రకాల టీకాలను వేస్తున్నారు. మూగజీవాల వైద్యం కోసం నియోజకవర్గానికి ఒక అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారు.
ఇందుకోసం 1962 అనే హెల్ప్ లైన్ నంబర్‌ను అందుబాటులో తీసుకొచ్చారు. మండలానికో పశు వైద్య దవాఖాన ఏర్పాటు చేసి, పశు వైద్యులను నియమించారు. మూగ జీవాలకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా వైద్య సదుపాయాలు కల్పించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ రాష్ర్టాన్ని పరిపాలించిన ఏ ప్రభుత్వం కూడా గొల్ల కురుమల వంటి బలహీన వర్గాలకు ఆర్థిక భరోసా ఇవ్వలేదు. కానీ కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం మాత్రం అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం అనేక పథకాలు తీసుకు వచ్చింది. ఈ కోవలోనే గొల్ల కురుమలకు రాయితీ గొర్రెల పంపిణీ పథకం తీసుకొచ్చిం ది. మేలు జాతి గొర్రెలు, మేకలను పంపిణీ చేస్తున్నది. గొల్ల కురుమల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్‌కు మా సామాజిక వర్గమంతా రుణ పడి ఉంటుంది. గొల్ల కురుమల నోటి కాడ ముద్దను తన్నుకు పోయే విధంగా గొర్రెల యూనిట్ల పంపిణీ గురించి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన బీజేపీని గొల్ల కురుమలు సమాధి చేస్తారు. తమను ఆదుకున్న టీఆర్ఎస్ పార్టీకే తమ మద్దతు ప్రకటించారు.
(వ్యాసకర్త: చైర్మన్, రాష్ట్ర గొర్రెలు,మేకల అభివృద్ధి కార్పొరేషన్)
-బాలరాజు యాదవ్