తెలంగాణ ప్రాంతంలో ‘కొలనుపాక’ శైవ, వైష్ణవ క్షేత్రాలకు, జైన మందిరాలకు చాలా ప్రసిద్ధి. పశ్చిమ చాళుక్యుల కాలంలో కొలనుపాకలోని ఆలయాల్లో విరివిగా దానాదులు చేసినట్లు శాసనాల్లో మనం గమనించవచ్చు. అలాంటిదే కొలనుపాక వీరనారాయణ స్వామి ఆలయంలో పారమార వంశానికి చెందిన శాసనం ఉన్నది. శాసనకాలం చాళుక్య విక్రమశకం 29=శ.సం. 1026 = క్రీ.శ. 1104, తారణ సంవత్సరం, చైత్రశుద్ధ పౌర్ణమి, ఆదివారం సోమగ్రహణ సమయం.
పారమార రాజైన జగద్దేవుడు
చాళుక్య త్రిభువనమల్ల దేవుని వద్ద అధికారిగా ఉన్నాడు. ఇతడి మహాసంధి విగ్ర హి, ప్రచండ దండనాయకుడు, పారియాత్రదేశంలో మహిషపురం పాలకుడైన సోమల దండనాథుడు కొలనుపాకలో తన ప్రభువైన జగద్దేవుని పేర జగద్దేవ నారాయణదేవునికి ఆలయం నిర్మించాడు. దానికి జగద్దేవుడు చాళుక్యరాజు ఆదేశం మేరకు 12 గ్రామాల మధ్యలో ఉన్న పిరియ పెంబర్తి గ్రామాన్ని చంద్రగ్రహణ సమయంలో సమర్పించాడు. పురధ్రమ్మం(ధర్మ) కింద అప్పేశ్వరునికి, విచ్చిభట్టభాగం మినహాయించి సర్వభోగాభ్యంతరం, దేవభోగీకృత్య సర్వ సమన్యంగా సమర్పించాడు. ఇంకా స్వామి ఆలయ ఖండస్ఫుటిత నవ సుధాకర్మ నిర్మాణార్థం, దేవుని అంగభోగ, రంగభోగర్థాం, మునిజనుల స్వాధ్యాయ ఆనందార్థం వీటిని సమర్పించినట్లు తెలుస్తున్నది.
ఈ పిరియ పెంబర్తి గ్రామానికి సరిహద్దులు చెప్పబడినవి పూర్వ త: చిదుకు చెరువు, ఉత్తరం వైపు వ్రయ్యదొన, పశ్చిమం వైపు దుత్తె చెరువు, దక్షిణం వైపు ఎఱ్ఱగుంట. ఇంకా కొల్లిపాక 7000 మధ్య ఉన్న ప్రతి గ్రామం నుంచి
5 ఉత్తమ గండ చిన్నలు,
4 మధ్యమ గండచిన్నలు,
3 అధమ గండచిన్నలు దేవభోగంగా నిర్ణయించి సమర్పించారు. స్వామివారికి పూలమాలల కోసం లతల పెంపకానికి నిడింగలూరు గ్రామంలో వాటికా క్షేత్రం (తోటను) సమర్పించాడు. స్వామికి సమర్పించిన ఈ దానం ఆచంద్రస్థాయిగా నిలవాలని దాన ఫలం కూడా చెప్పింది.
శాసనం ప్రారంభంలో అర్బుద పర్వతం, దానిమీద సాధు సంతులు చేసే తపస్సులు, వశిష్ట మహర్షి తపస్సు, అక్కడ ఉద్భవించిన యోధుడు పారమారుడు. అతని వంశంలో హర్షదేవుడు, హర్షదేవుని కొడుకు ముంజ, ఇతడే వాక్పతి, లేదా ఉత్పల. ఇతని సోదరుడు సోధల. సోధల కుమారుడు భోజుడు. ఇతడు బోధకుడు సాహిత్య విద్యాగురువు చేత కవీశ్వర మనోరథ కల్పభుజుడుగా కీర్తించబడినాడు. ఇతని పితృవ్యుడు గోండలుడు, అత ని కుమారుడు ఉదయాదిత్యుడు. ఇతనికి జన్మించినవాడే జగద్దేవుడు. పారమార వంశీయుల శాసనాలల్లో ఇది ముఖ్యమైనది.
– భిన్నూరి మనోహరి