అనేక ఆకాంక్షలతో బీజేపీలో చేరినప్పటికీ, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించడటంలోను, గౌరవించడంలోను మీరు (బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్) అనుసరిస్తున్న తీరు నా మనస్సును చాలా గాయపరిచింది. పార్టీలో ఉన్న ధనవంతులకు, బడా కాంట్రాక్టర్లకు ప్రాతినిధ్యం పెంచుతూ, నిబద్ధతతో, నిజాయితీగా ప్రజా సమస్యల పట్ల నిరంతరం శ్రమిస్తున్న బలహీనవర్గాల కార్యకర్తల పట్ల, నాయకుల పట్ల మీరు అనుసరిస్తున్న తీరు ఆక్షేపణీయం.బడుగు, బలహీనవర్గాల ప్రతినిధిగా ఎదిగిన మీరు బలహీన వర్గాల ఉన్నతికి ఎలాంటి ప్రయత్నం చేయకుండా, ఇతరులు చెప్పినట్లు నడుచుకుంటు న్నారు. నాలాంటి ఎందరో నాయకులు అనేక అవమానాలకు గురవుతున్నారు. అందుకే ఆ అవమానాలు భరిస్తూ పార్టీలో కొనసాగలేకపోతున్నాను.కలత చెందిన మనస్సుతో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. ఇంతకాలం మీరందించిన సహకారానికి ధన్యవాదాలు.
-కె. స్వామిగౌడ్ మాజీ టీఎస్ఎల్సీ చైర్మన్
తెలంగాణ భారతీయ జనతా పార్టీ శాఖలో ప్రస్తుతం అనిశ్చితమైన దశ దిశా లేని రాజకీయ పరిణామాలు కొనసాగుతున్నాయి. ప్రత్యామ్నాయ రాజకీయాలు చేస్తామని చెప్పిన మీరు (బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్) మునుగోడు ఉప ఎన్నికల్లో అనుసరిస్తున్న రాజకీయ తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉంది. సామాజిక బాధ్యత లేకుండా, ఎన్నికలు అనగానే డబ్బు సంచులు గుప్పించాలన్నట్లుగా, బడా కాంట్రాక్టర్లే రాజ్యాలేలాలె, పెట్టుబడి రాజకీయాలు చేయాలన్నట్లుగా కొనసాగుతున్న మీ వైఖరితో నాలాంటి బలహీన వర్గాలకు చెందిన నాయకులకు స్థానం ఉండదని తేటతెల్లమైంది. అనేక ఆశలతో, ఆశయాలతో నేను బీజేపీలో చేరినప్పటికీ దశాదిశాలేని నాయకత్వ ధోరణులు… నిర్మాణాత్మక రాజకీయాలకు కానీ, తెలంగాణ సమాజానికీ కానీ ఏమాత్రం ఉపయోగకరంగా లేవని అనతికాలంలో అర్థమైంది.
ప్రజాహితమైన పథకాలతో, నిబద్ధత కలిగిన రాజకీయ సిద్ధాంతాలతో ప్రజలను మెప్పించడం కంటే మందు, మాంసం, విచ్చలవిడిగా నోట్ల కట్టలు పంచడం ద్వారా మునుగోడు ఎన్నికలలో గెలుపు సాధించాలనుకుంటున్న మీ తీరు పట్ల నిరసన తెలియజేస్తున్నా. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను.
-డాక్టర్ దాసోజు శ్రవణ్