‘తెలంగాణ రాష్ట్ర సమితి’ అనే ప్రాంతీయ పార్టీకి అధినేతగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) ఇకమీదట ‘భారత్ రాష్ట్ర సమితి’ అనే జాతీయపార్టీకి అధినేత! 2001లో ‘టీఆర్ఎస్ అనే పార్టీని స్థాపించిన ఆయన లక్ష్యం ఏమిటో అందరికీ తెలిసిందే. 60 ఏండ్ల పాటు సమైక్య పాలనలో నలిగి అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచింది తెలంగాణ. తన ప్రాంతానికి అమేయమైన పద్నాలుగేండ్ల ఉద్యమ పోరాటంతో విముక్తి కల్పించిన ఘనకీర్తి కేసీఆర్ సొంతం. గత ఎనిమిదేండ్లలో రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నిలిపిన సంగతి దేశమంతా తెలిసిందే.
బీజేపీ, కాంగ్రెస్, ఈ రెండు పార్టీల వల్ల దేశానికి ఒరిగిన ప్రయోజనమేమీ లేదు.స్వాతంత్య్రం వచ్చిన 75 ఏండ్ల తర్వాత కూడా దేశంలో తాగునీటి కోసం ప్రజలు కొట్టుకుంటున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అని ఘనంగా చెప్పుకొంటున్న గుజరాత్లో కూడా పవర్హాలిడేస్ ప్రకటిస్తున్నారు. సాక్షాత్తూ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము స్వగ్రామంలో మొన్నటిదాకా కరెంట్ లేదంటే మనం సిగ్గుపడాలి.
దేశాన్ని గత 75 ఏండ్లుగా పాలిస్తున్న రెండు జాతీయ పార్టీలు ఉత్తరాదికి చెందినవే. దక్షిణాది పార్టీలు కూటముల్లో చేరాయి తప్ప సొంతంగా ఆధిపత్యం వహించే అవకాశం రాలేదు. దక్షిణాది రాష్ర్టాలుగా పిలువబడే తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ర్టాల్లో కర్ణాటక, కేరళలో జాతీయపార్టీలు ప్రభుత్వాలను ఏర్పాటుచేస్తుండగా, మిగిలిన మూడు రాష్ర్టాల్లో ప్రాంతీయపార్టీలు అధికారంలో ఉంటున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభావం ఉన్నప్పటికీ, రాష్ట్ర విభజన తర్వాత అది నామరూపాల్లేకుండా పోయింది. ఇకపై జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పుంజుకుంటుందన్న ఆశ కూడా కనిపించడం లేదు. బీజేపీ రెండోసారి అధికారంలోకి రాగానే తన అసలు స్వరూపాన్ని బయటపెట్టుకున్నది. దేశమంతా మతకల్లోలాలు రేపి, మనుషుల మధ్య మతచిచ్చులు రేపుతూ పబ్బం గడుపుకొంటున్నది.
బీజేపీ 17 రాష్ర్టాల్లో అధికారంలో ఉన్నప్పటికీ చాలా రాష్ర్టాల్లో సంకీర్ణ ప్రభుత్వాలను నడుపుతున్నది. మహారాష్ట్రలో ఉపముఖ్యమంత్రి పదవిని గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి అప్పగించారంటే బీజేపీ అధికార దాహానికి ఇంకా నిదర్శనమేం కావాలి? పైగా గత ఎనిమిదేండ్లలో బీజేపీ పాలన పట్ల సామాన్య, మధ్యతరగతివారు సంతృప్తిగా లేరని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
బీజేపీ మీద గత కొద్దికాలంగా పోరాటాన్ని కొనసాగిస్తున్న ఒకే ఒక ముఖ్యమంత్రి కేసీఆర్. బీజేపీ ప్రభుత్వాన్ని ఎందుకు గద్దె దించాలో ఆయన ఇప్పటికే అనేకసార్లు స్పష్టంగా వివరించారు. రాష్ట్ర ప్రభుత్వాలను అప్రజాస్వామికంగా పడగొడుతుండటం, రాష్ర్టాలకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన నిధులను తొక్కిపెట్టడం, పాడి ఆవుల్లాంటి ప్రభుత్వరంగసంస్థలను కూడా ప్రైవేట్ శక్తులకు తెగనమ్మేస్తుండటం, ఉద్యోగ కల్పన అనేది అభూత కల్పనగా మిగిలిపోవడం, రైతులకు వ్యతిరేకంగా చట్టాలు చేయడం, విద్యుత్ సంస్కరణల పేరుతో దోపిడీకి తెర తీయడం లాంటి అనేక ప్రజా వ్యతిరేక చర్యలకు బీజేపీ తెగబడుతున్నదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తమను వ్యతిరేకిస్తున్న విపక్షపార్టీల నేతలపై సీబీఐ, ఈడీ, ఐటీ లాంటి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పడం, అక్రమంగా అరెస్టులు చేయించడం, ఇళ్లు, ఆఫీసుల మీద పడి సోదాలు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తుండటం విపక్షాలను కుదిపేస్తున్నది. యూపీఏ ప్రభుత్వాన్ని తలదన్నేలా దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తున్నదని దేశంలోని అన్నివిపక్షాలు అభిప్రాయపడుతున్నాయి. కాంగ్రెస్ తన సొంత రాష్ట్రం యూపీలో రెండు సీట్లకే పరిమితమైందంటే దాన్ని ఇంకా ఒక శక్తిగా అంగీకరించాలా అనేది ప్రశ్న. దేశమంతా కాంగ్రెస్కు కార్యకర్తలు, ఓటర్లు ఉండవచ్చు. కానీ అసమర్థ నాయకత్వంతో కాంగ్రెస్ పార్టీ శిథిలమైపోయింది.
పై పరిస్థితులను పరిశీలిస్తే.. దేశంలో రాజకీయ శూన్యత స్పష్టంగా గోచరిస్తున్నది. బలమైన ప్రతిపక్షం లేకపోవడంతో బీజేపీకి వరప్రసాదంగా మారింది. ఎనిమిదేండ్ల బీజేపీ నియంతృత్వ పాలన చూసిన తర్వాత కూడా పోరాటానికి కాంగ్రెస్ సిద్ధం కావడం లేదంటే ఏమనుకోవాలి? ఆ రాజకీయ శూన్యతను అలాగే కొనసాగించి మూడోసారి కూడా బీజేపీకి అధికారాన్ని అప్పగించాలా? ఆలోచించండి. ఈ నేపథ్యం అంతా తెలిసినవాడు కాబట్టే జాతీయస్థాయిలో రాజకీయ శూన్యతను పూరించాలని కేసీఆర్ ఆశిస్తున్నారు. కొంతమంది రాజకీయ అవివేకులు ప్రధాని పదవి కోసమే కేసీఆర్ జాతీయపార్టీ అంటున్నారని మూర్ఖంగా మాట్లాడుతున్నారు. తనకు ప్రధాని కావాలని ఉన్నదని కేసీఆర్ ఎవరితో చెప్పారు?
బీజేపీ నియంతృత్వ పాలన పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారు. సరైన ప్రత్యామ్నాయం లేక నిస్సహాయులుగా ఉన్నారని కేసీఆర్ చాలాకాలం కిందటే అంచనా వేశారు. ఆయన దేశమంతా ‘సమన్యాయం’ జరగాలనే జాతీయభావాలున్న అజెండాతో ‘భారత్ రాష్ట్ర సమితి’ని ప్రారంభించారు. జాతీయపార్టీగా తమ పార్టీని విస్తరించడానికి పూర్వమే కేసీఆర్ అనేకమంది మేధావులతో, రాజకీయపార్టీలతో సమాలోచనలు జరిపారు. అన్ని విషయాలను కూలంకషంగా అధ్యయనం చేశారు. అందుకే ఆయన ‘బీజేపీ ముక్త్ భారత్’ అనే నినాదాన్నిచ్చారు. బీజేపీని గద్దె దించితేనే దేశంలో మళ్లీ ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. ప్రజాస్వామ్యం కోసమే కేసీఆర్ పాటుపడుతున్నారని దేశంలోని రాజకీయపార్టీలు గ్రహించాయి కానీ కొందరు విద్వేషులకు మాత్రమే వాస్తవాలు బోధపడటం లేదు. దేశ రాజకీయాల్లో ‘భారత్ రాష్ట్ర సమితి’ హిమాలయ శిఖరంలా శిరసెత్తి నిలబడాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు.
(వ్యాసకర్త: సీనియర్ రాజకీయ విశ్లేషకులు)
ఇలపావులూరి మురళీమోహనరావు
81433 18849