టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చాలని కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల రాజకీయ ప్రత్యర్థులే కాదు, అభిమానులు కూడా ఆశ్చర్యపోయి ఉంటారు. అయినా ఒక అభిప్రాయం ప్రజల్లో ఉంది. కేసీఆర్ ఏ నిర్ణయమైనా యథాలాపంగా లేదా ఏదో ఎచ్చులకు పోయి తీసుకోరు. ఆలోచించి , సాధ్యమైతేనే ముందడుగు వేస్తారు. కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారంటే అది జరిగి తీరుతుంది అని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. కేసీఆర్‌కు సైద్ధాంతిక అవగాహన ఉంటుంది.
లక్ష్యం పట్ల స్పష్టత ఉంటుంది. అన్నిటికి మించి లక్ష్యాన్ని చేరుకునే వ్యూహాన్ని కచ్చితంగా రూపొందించుకుంటారు. ఎవరేమన్నా పట్టించుకోకుండా ఆ వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేస్తూ పోతారు. తన పట్లనే కాదు, ప్రత్యర్థుల బలాబలాల పట్ల కూడా స్పష్టమైన అంచనా ఉంటుంది. ఆత్మవంచనకు అసలే పాల్పడరు. కేసీఆర్ నిర్ణయాలు అంచనాకు అందవు, పలుసార్లు ఆశ్చర్యానికి గురి చేస్తాయి. తెలంగాణ ఉద్యమ అనుభవాలను ఎవరూ మరిచిపోలేదు. అధికారానికి వచ్చిన తరువాత రాష్ర్టాన్ని నడుపుతున్న తీరూ చూస్తూనే ఉన్నాం.
అమెరికా స్వాతంత్య్ర పోరాటానికి ఫ్రాన్స్ మద్దతునిచ్చింది. ఆ తరువాత కాలంలో బ్రిటన్‌తో ఫ్రాన్స్ యుద్ధం మొదలైనప్పుడు అమెరికాకు సంకట పరిస్థితి ఎదురైంది. ఫ్రాన్స్‌కు మద్దతు ఇవ్వాలనేది అమెరికాలోని ప్రజాభిప్రాయం. ఫ్రాన్స్‌కు మద్దతు ఇవ్వడం నైతికంగా సమర్థనీయం కూడా. కానీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అమెరికా ఆ యుద్ధంలో తలదూర్చకుండా తటస్థంగా ఉండాలని అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ భావించడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. నాయకుడు పలు సందర్భాలలో ఉద్వేగంతో కాకుండా, హేతుబద్ధంగా నిర్ణయాలు తీసుకుంటాడనడానికి ఇదొక ఉదాహరణ.
లక్ష్యం ఎంత గొప్పదైనా ఎంచుకున్న పంథా ప్రధానమైనది. 1955లో అమెరికాలో రోజా పార్క్స్ ఉదంతంలో జాతి వివక్షకు వ్యతిరేకంగా నల్ల జాతీయులు ఉద్యమించారు. బస్సులను బహిష్కరించి, మైళ్ళకొద్దీ కాలినడకన వెళ్ళారు. వారికి తెల్లజాతీయుల మద్దతు కూడా లభించింది. అనేక హక్కులు సాధించుకున్నారు. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ వంటి నాయకుల సూచనలను అర్థం చేసుకొని ప్రజలు ఉద్యమాన్ని అహింసాయుతంగా నడపడం వల్లనే విజయం సాధ్యమైంది.
2009 ఎన్నికలలో చంద్రబాబుతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవడాన్ని విమర్శించినవారున్నారు. చంద్రబాబుతో సహా ఎవరికీ ఇందులోని కిటుకు అర్థం కాలేదు. టీడీపీ చేత తెలంగాణ అనుకూల తీర్మానం చేయించడం ఎంత కీలకమో అప్పుడు ఎవరికీ అర్థం కాలేదు. ఆ తరువాత కాలంలో చంద్రబాబు కుట్రలను కేసీఆర్ ఎట్లా తిప్పికొట్టారో, అతడికే గతి పట్టించారో చూశాం. అంతకు ముందు 2004లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా ‘మీరు ఎప్పుడూ ఓడిపోయే (టీడీపీ బలంగా ఉన్న) సుమారు నలభై స్థానాలు ఇవ్వమ’ని కోరడం పెద్ద రాజకీయ ఎత్తుగడ. కాంగ్రెస్‌తో తీర్మానమూ చేయించారు, టీడీపీ పునాదులనూ బద్ధలు కొట్టారు. తరువాతి కాలంలో పదే పదే ఉప ఎన్నికలు తెచ్చారు. చివరికి నిరాహారదీక్ష పట్టారు. ప్రజా క్షేత్రంలో (చిట్టచిట్టచివరి ఉప ఎన్నికల్లో) ఇతర పార్టీలకు డిపాజిట్లు కూడా రాని స్థితి కల్పించారు. ఎటుచేసీ… రెండు బలమైన రాజకీయ శక్తులను గంగవెర్రులెత్తించి గాయి పట్టించి తెలంగాణ సాధించి పెట్టారు. ఈ ఎత్తుగడలను మరిచిపోగలమా!
ప్రపంచ చరిత్ర చూస్తే, ఏ నాయకుడి వ్యవహార సరళి అయినా ఇదే విధంగా ఉంటుంది. నాయకుల నిర్ణయాలు అంతుపట్టడం కష్టమే.
రష్యాలో 1917 మార్చిలో జార్‌ను కూలదోసిన తరువాత బూర్జువా ఉదారవాద నాయకుల ‘తాత్కాలిక ప్రభుత్వం’ ఏర్పడింది. మరోవైపు దేశ రాజధానిలో కార్మికులు, సైనికుల ప్రతినిధులతో ‘పెట్రోగ్రాడ్ సోవియెట్’ ఏర్పాటయింది. రాజధాని నగరంలో ఉండటంతో పాటు నగర సైనిక విభాగంపై పట్టు మూలంగా దేశవ్యాప్తంగా సోవియెట్లకు ఈ ‘పెట్రోగ్రాడ్ సోవియెట్’ కేంద్ర బిందువుగా మారింది. కానీ సోవియెట్లలో మాత్రం మితవాద వామపక్షాల ప్రాబల్యం ఉందే తప్ప లెనిన్ నాయకత్వంలోని బోల్షెవిక్‌లకు పట్టు లేదు. ‘అధికారమంతా సోవియెట్లకే’ అంటూ లెనిన్ పిలుపు ఇచ్చినప్పుడు అందులోని వ్యూహం ఇతరులకు అర్థం కాలేదు. తమ ప్రత్యర్థులకు అధికారం కట్టబెట్టమంటున్నాడేమిటి అనుకున్నారు. కేంద్ర కమిటీ నాయకులు మొదట విభేదించినా, చర్చించిన అనంతరం లెనిన్ మాటకు అంగీకరించారు. ‘సోవియెట్లకే అధికారం’ అనే వ్యూహం వల్ల మొదటగా బూర్జువా ప్రభుత్వం పతనమైంది. ఇక మిగిలింది సోవియెట్లే. ఆ తరువాత – మితవాదుల బలహీనత మూలంగా, పెట్రోగ్రాడ్ సహా దేశవ్యాప్తంగా సోవియెట్లను బోల్షెవిక్‌లు చేజిక్కించుకున్నారు. అదీ ఎత్తుగడ!
ఎన్ని విభేదాలున్నా, పరస్పరం చర్చించుకొని ఏకతాటిపై నడిచినప్పుడే జాతి అస్తిత్వాన్ని కాపాడుకోగలుగుతాం. కానీ మన దగ్గర- ఒకరు ముందు నడిస్తే మిగతావారు కలిసి నడవరు. ఇదొక పెద్ద సమస్య. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన మొదట్లో ఒక ‘మేధావి’ కాళోజీ ముందు కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడాడట. ‘ముందు నడిచెటోడిని నడువనియ్యాలె.. కాళ్ళల్ల కట్టెపెట్టుడెందుకు’ అని కాళోజీ చిరాకు పడ్డాడట.
ఉద్యమం మొదలుకొని, దేశ భవిష్యత్తు వరకు అనేక అంశాలలో గాంధీకి, నెహ్రూకు భిన్నాభిప్రాయాలు ఉండేవి. వ్యక్తిత్వాలు, భావాలు పొసగకపోయేవి. గాంధీ సనాతనవాది అయితే నెహ్రూ ఆధునికుడు. ఎన్ని విభేదాలున్నా వ్యక్తిగత లబ్ధి కోసం ఉద్యమాన్ని ఎవరూ దెబ్బకొట్టలేదు. కాంగ్రెస్ నాయకులు ఎవరికి వారే ఉద్ధండులు. అతివాదులు, మితవాదులు, సోషలిస్టులు, రాజేంద్ర ప్రసాద్ వంటి స్వేచ్ఛా ఆర్థిక వాదులు ఉండేవారు. కానీ అవేవీ ఉమ్మడి ఉద్యమానికి ఆటంకాలు కాలేదు. ఇందుకు కారణం వారి నిజాయితీ. భావజాల ఘర్షణ జరిగిందే తప్ప, వ్యక్తిగత కక్షలకు తావు లేదు. నెహ్రూ కన్నా సర్దార్ పటేల్ పద్నాలుగేండ్లు పెద్ద. నెహ్రూకు జనాకర్షణ ఎక్కువ. దేశ సామాజిక ఆర్థిక పరిస్థితులు, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశ భవిష్యత్తుపై స్పష్టత, దార్శనికత ఉన్న నాయకుడు నెహ్రూ. ఎవరి అనుకూలాంశాలు వారివి. అయినా ప్రధాని నెహ్రూకు ఉపప్రధానిగా పటేల్ అందించిన సహకారం అందరికీ తెలిసిందే.
ఏ దేశంలోనైనా ఏ కాలంలోనైనా నిజమైన నాయకులు ఇదే విధంగా ప్రవర్తిస్తారు. రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ సైన్యాలు విరుచుకుపడుతున్నప్పుడు బ్రిటన్‌లో జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చర్చిల్‌కు ప్రధాని పదవి అప్పగించారు. చర్చిల్ సామ్యవాద వ్యతిరేక భావాలు లేబర్ పార్టీకి గిట్టవు. అయినా లెఫ్ట్, రైట్ తేడా లేకుండా అందరూ ఏకమయ్యారు. ఐదుగురు సభ్యులున్న వార్ క్యాబినెట్లో లేబర్ పార్టీ ప్రముఖులు క్లెమెంట్ అట్లీ, ఆర్థర్ గ్రీన్వుడ్లకు చర్చిల్ స్థానం కల్పించారు. కన్జర్వేటివ్స్ అధికారంలో ఉన్నారు కనుక ఏది చేసినా అడ్డుపుల్ల వేస్తామని లేబర్ పార్టీ భావించలేదు. అదీ ఉత్తమ రాజకీయమంటే.
‘సక్సెస్ హాజ్ మెనీ ఫాదర్స్… బట్ ఫెయిల్యూర్ ఈజ్ ఆన్ ఆర్ఫన్’ అంటారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ను వెంటాడి వేధించిన వారే, విజయం సాధించగానే మాట మార్చారు. ఒకడు తానేదో చట్టంలోని కిటుకు చెప్పడం వల్లనే తెలంగాణ తీర్మానం ఆమోదం పొందిందంటాడు. మరొకడు తాను కాళ్లు పట్టుకోవడం వల్ల తెలంగాణ వచ్చిందంటాడు. ఎవరి బడాయీలు వారివి! తెలంగాణ వచ్చిన తరువాత కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారు! శుభం పలుకరా పెండ్లికొడుకా అంటే ఏదో వాగినట్టు- ఒగడు ప్రాజెక్టులకు అడ్డుపడతడు. మరొగడు బతుకమ్మ చీరెలు కాలబెట్టిస్తడు.
హైదరాబాద్‌లో కళాకేంద్రం కట్టుకుంటామంటే కోర్టుకు వెళ్ళి అపిస్తరు. పరేడు గ్రౌండ్స్‌లో సచివాలయంతోపాటు అన్ని కార్యాలయాలు ఒకచోట కట్టుకుందామంటే దానికీ అడ్డుపడ్డారు. కేసీఆర్ ఇటువంటి నాయకులను ఏనాడూ నమ్ముకోలేదు, వీరికి భయపడనూ లేదు. కేసీఆర్ ఒక్కడే.. అతడు అసహాయ శూరుడు. గుంభనంగా తెలంగాణ అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని పట్టించుకుంటున్నారు. అందుకే ప్రజలు ఆయన వెంట ఉన్నారు. కేసీఆర్ విధానాలు నచ్చి సంబురాలు జరుపుకుంటూ ఉన్నారు. నెల్సన్ మండేలా అన్నట్టు- ‘విజయం సాధించినప్పుడు అనుచరులు సంబురాలు జరుపుకుంటుంటే, నాయకుడు వెనుక ఉండి మురిసిపోతుంటాడు. ప్రమాదం వచ్చినప్పుడు ముందుకు వచ్చి నడిపిస్తుంటాడు’. దేశం సంక్షోభంలోకి జారిపోతున్న ఈ తరుణంలో కేసీఆర్ చేస్తున్నది ఇదే. ప్రజలకు వాస్తవాలు అర్థం చేయించి నడిపేవాడే నాయకుడు.
1960 దశకం నాటికి అనేక ప్రాంతీయ పార్టీలు ఏర్పడ్డాయి. కానీ జాతీయ పార్టీ అణచివేసింది. కాంగ్రెస్, బీజేపీ ఏదైనా జాతీయ పార్టీ అంటే ప్రాంతీయ పార్టీల అస్తిత్వానికి భంగకరం. కానీ ప్రాంతీయ పార్టీ జాతీయ స్థాయికి ఎదగలేదు. అందువల్ల ప్రాంతీయ అస్తిత్వాలకు భరోసా ఇచ్చి, ఆయా శక్తులను కలుపుక పోయే జాతీయ పార్టీ నేటి అవసరం. ఒకప్పుడు ద్రవిడ ఉద్యమమంటే దేశం నుంచి దక్షిణాది రాష్ర్టాలు విడిపోవడమనే వాదన ఉండేది. ద్రవిడ కజకం సంగతి సరే. డీఎంకే ఏర్పడిన తొలినాళ్ళలో కూడా తమిళ దేశ వాదన ఉండేది. కానీ 1960 దశకం నాటికి దేశ సమగ్రతను ఆమోదించినా, తమిళ అస్తిత్వం చెక్కు చెదరకుండా కాపాడుకోవడం లేదా? ప్రాంతీయ ఆకాంక్షలకు ప్రతిబంధకం కాని జాతీయ దృక్పథం ఇప్పటి అవసరం. మన దేశం జనతా ప్రయోగాన్ని చూసింది. జనతాదళ్ అనుభవమూ ఉన్నది. సంకీర్ణ ప్రభుత్వాలూ ఏర్పడ్డాయి కానీ, జాతీయ పార్టీ నీడలో ప్రాంతీయ పక్షాలు మనుగడ సాగించలేని పాఠాలూ నేర్చుకున్నాం. ఈ నేపథ్యంలోనే ప్రాంతీయ ఆకాంక్షలను సమ్మిళితం చేసే, బహుళత్వాన్ని గౌరవించే జాతీయ పక్ష అవసరం ఏర్పడింది.
దేశమంతా అప్రజాస్వామిక, నిరంకుశ రాజకీయ వ్యవస్థ ఉంటే, తెలంగాణ ఒక దీవిలా బాగుగా ఉండటం సాధ్యం కాదు. తెలంగాణ భవిష్యత్తు దేశ రాజకీయ పరిస్థితితో ముడిపడి ఉన్నదని కేసీఆర్ గ్రహించారు. తెలంగాణను చక్కదిద్దినట్టే దేశాన్ని బాగుపరచడం తన బాధ్యతగా గుర్తించారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ స్థాపన జరిగింది. ఆనాడు టీఆర్ఎస్ పెట్టినప్పుడు ఎంత మంది నమ్మారో లేదో కానీ, కేసీఆర్‌కు తన మీద తనకు నమ్మకం ఉన్నది. ప్రజల సంక్షేమం పట్ల ఆరాటం ఉన్నది. టీఆర్ఎస్ ఉద్యమ శక్తులకు కేంద్ర బిందువుగా మారింది. ఇప్పుడు అదే ప్రయోగం దేశవ్యాప్తంగా సాగుతున్నది. వివిధ రాష్ర్టాల్లోని నిజాయితీగా ఆలోచించే నాయకులు, ఉద్యమకారులు తప్పకుండా కేసీఆర్ వెంట చేరుతారు. రెండు పెద్ద లాబీల వ్యతిరేకత మధ్య తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్‌కు దేశంలో పరివర్తన తేవడం పెద్ద కష్టమేమీ కాదు. ఆనాడు కేసీఆర్ చేసింది కత్తిమీద సాము. ఇప్పుడు తెలంగాణ కోట నుంచి ప్రస్థానం ప్రారంభమైంది. అది ఎర్రకోట వైపుగా సాగుతున్నది.