తెలుగు సాహిత్యంలో విశేష కృషి చేసి తెలంగాణలో మరుగునపడిన కవులెందరో ఉన్నారు. అలాంటివారిలో కవిరాజ, సిద్ధాంతి ఏలె యల్లయ్య కవి ఒకరు.తెలుగు సాహిత్యకారులు, చరిత్రకారులు ఆయనను విస్మరించడం అత్యంత బాధాకరం. ఆయనను సాహిత్య అకాడమీలు, తెలుగు విశ్వవిద్యాలయాలు పట్టించుకోకపోవడంతో ఆయన ఒక అజ్ఞాన కవిగానే ఉండిపోయారు.
ఆశుకవిగా, బహుగ్రంథకర్తగా పేరొందిన యల్లయకవి శతాధిక పద్యాలను అలవోకగా చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచేవారు. 1906 అక్టోబర్ 13న యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఎల్లంకి గ్రామంలో ఏలె ముత్తమ్మ నరసయ్య దంపతులకు జన్మించిన ఈ కవి బాల్యం నుంచే కవిత్వం చెప్పడం ప్రారంభించి నల్లగొండ జిల్లా లో బాగా గుర్తింపు పొందిన మరుగున పడిన ఒక మాణిక్యం. ఈ కవి ఎల్లంకిగ్రామంలో జన్మించినప్పటికీ దగ్గరలోనే ఉన్న సిరిపురం గ్రామంలోనే స్థిరపడి తన రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు. అంతగా చదువులేని వీరు సిరిపురం లోని రావీటి పరమేశ్వర సిద్ధాంతి వద్ద సంస్కృతం, జ్యోతిష్యం, వ్యాకరణం, ఛందస్సువంటి పలు విషయాలను అభ్యసించి స్వయంకృషితో ఆయా విద్యల్లో రాణించారు. సుమారు 50 ఏండ్లుగా పంచాంగ డైరీలు సిద్ధం చేసే సంప్రదాయం కలిగిన వీరు దాదాపు 50 చిన్న, పెద్ద గ్రంథాలను రచించి రాష్ట్రస్థాయి కవి, పండితుల సరసన నిలబడ్డారు. ఈ కవి గురించి ‘గోలకొండ కవుల సంచిక’లో పేర్కొన్నారు.
యల్లయకవి రచనలు
మార్కండేయ, భార్గవీ, మానస, ఈశ్వర, కమలా, పరాత్పర శతకాలను, రామదేవ, ఆంజనేయ, రామలింగేశ, రామచంద్ర నక్ష త్ర మాలికలను, మార్కండేయ దండకం, సీతారామ చంద్ర భజన కీర్తనలు, ఆంజనేయ దండకం, ఆంజనేయ, భాస్కరమాల, స్వామి ప్రార్ధన, భృగువంశం, వెంకటేశ శశికళ, వెల్లంకి, శంభు లింగ శశికళ, గాంధీరాగసంఖ్య కావ్యాలను, మార్కండేయ, బీదరైతు, సీతాకళ్యాణం, సాంఘిక నాటకాలను, కురుపాండవ యుద్ధం, పద్మవ్యూహం, కర్ణార్జున యుద్ధం, సురాబాండేశ్వరం, భళ్ళాణచరిత్ర, సీతచెర విమోచన యక్షగానాలను, ఆంధ్ర శబ్ధ మంజరి, హిందూ వివాహవిధి, ఏలెవాసు,్త ఏలె ఎల్లయ్య సిద్ధాంత గణిత శాస్ర్తాలను, గణపత్యష్టోత్తర శతనామావళి, మార్కండేయ సుప్రభాతం వంటి సంస్కృత రచనలను రచించి అచ్చువేశారు. ఇవి కాకుండా జానకీ బంధ విమోచనం, భావనార్షీయం, తెలుగుక్రియలు, కర్ణవధ, వ్యాక్యాలంకారం, కులం, వేదాంతి మొదలైన 20 వరకు రచనలు అముద్రితంగానే ఉండిపోయాయి. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, కుటుంబ సభ్యుల అజాగ్రత్తల వలన విలువైన సాహిత్య సంపదను కాపాడుకోలేక పోయారు. ఈ కవి తన కష్ట నిష్టూరాలను ‘భార్గవీశతకం’లో ఇలా చెప్పుకున్నారు.
నిలువను నీడలేక పరనిందల పాలయితిన్ మనోవ్యధన్
బలువగు దేహముంగఱగి పాకముదప్పిన యిన్మువోలె సం
చలనమునొందె చిత్తము విచారము మిక్కుటమయ్యేగాననో
జలజ దళాక్షి దాసుడను చయ్యన బ్రోవు ముదంబున భార్గవీ!
101 పద్యాలున్న ఈ శతకం 1943లో కొండాశంకరయ్య సికింద్రాబాద్ ప్రెస్లో ముద్రించబడింది. ఈ కవి తనకు పూట గడుపుటకై తగిన ధనం చేకూర్చమని భార్గవిని ప్రార్థించినాడు. తిరుపతి వేంకటకవుల కామేశ్వరీ, ఆరోగ్య కామేశ్వరీ శతకాలను ఆదర్శంగా తీసుకొని కవి ఈ శతకాన్ని రచించినట్లు తెలుస్తున్నది. వీరు రచించిన మరో శతకం శంభులింగ శశికళ, ఇది 1979లో అచ్చయింది. సీస పద్యాలతో కూడిన ఈ శతకంలో కవి సర్వలోక విస్తారుడైన ఆదివేల్పును ఆశలేనట్టి దేవునిగా ఈ క్రింది పద్యంలో వర్ణించాడు.
నిష్కపటబుద్ధి యన్నది నీకె గలిగె
కాని యెవరికి భువిలోన కానరాదు
కరధృతకురంగ భక్త హృత్కమల భంగ
శమన మరభంగ యల్లంకి శంభులింగ
ఈ శతక పద్యాల వలన ఈ కవి ఆంధ్ర కవితా విచక్షణుడని తెలుస్తున్నది. పద్యం, గద్యం, వ్యాకరణం, గేయం, నాటకం, యక్షగానం, సంస్కృతం, వివిధ సాహిత్య ప్రక్రియలకు చెందిన సాహిత్యాన్ని సృష్టించిన ఘనత యల్లయకవికే దక్కింది.
ఈ కవి గోపురబంధకవితలో కూడా సిద్ధహస్తులు. చండూరు సీతారామ భజన కీర్తనలు, ‘మానండయా! సారమానండయా వంటి రచనలు చేయడమే కాకుండా చండూరు సాహితీ మేఖల సభల్లో పాల్గొని ప్రముఖుల ప్రశంసలందుకున్నారు. 1988లో శతావధాని సి.వి సుబ్బన్న వీరిని ప్రశంసించి సన్మానించారు. వీరు తమ చరమదశలో కూడా సాహితీ వ్యాసంగాన్ని వదలలేదు. ‘చేనేతవృత్తి’ వారి దుస్థితిని గురించి వీరు రాసిన పద్యాలు 1989 ఆగస్టు 15న ‘చేనేత’ పత్రికలో అచ్చయినవి. అందులోని ఒక పద్యం.
నేడు చేనేత పనివారు కూడు గుడ్డ
పూర్ణముగ లేక మిడుకుచు బొందిలోన
సగము ప్రాణాలతోడ సంసార జలధి
నీదు చుండిరి హరిహరీ యెంతవింత
ఈ కవి 1990 ఏప్రిల్ 16న కన్నుమూశారు. మరుగున పడిన ఈకవి జీవితం సాహిత్యాన్ని గురించి సమగ్రపరిశోధన చేయవలసిన అవసరం ఎంతో ఉంది.
– పున్న అంజయ్య, 93966 10639