‘గంగా జమునీ తహ్జీబ్’ సంస్కృతికి నిలయమైన తెలంగాణలో లౌకికత్వమే విరాజిల్లుతుంది. విద్వేషం కాదు, వికాసమే రాజ్యమేలుతుంది. సహజంగానే ఎన్నో అస్తిత్వ ఉద్యమాలకు, సామాజిక పోరాటాలకు, చైతన్యానికి నెలవైన తెలంగాణ కులమత జాడ్యాల పట్ల పెద్దగా ఆసక్తి చూపదు. తెలంగాణ సంస్కృతిలోనే మత సామరస్యం ఉన్నది. బీజేపీ నాయకులు చెప్పే మాటల్లో మతం ఉండవచ్చు కానీ, తెలంగాణలో లేదు. దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో రాజకీయ అస్తిత్వం కోసం యత్నిస్తున్న మతోన్మాద, ఫాసిస్టు శక్తులకు ఏనాడూ ఆదరణ లభించలేదు.ఎన్ని ఎత్తుగడలు వేసినా వారు ప్రజల విశ్వాసాన్ని చూరగొనలేకపోయారు.
ప్రజల మనసులో చెడు భావజాలాన్ని నింపే వ్యక్తులైనా, వ్యవస్థలైనా కాలం చేతిలో భంగపడక తప్పదు. రాష్ట్రంలో రెండుచోట్ల జరిగిన ఉప ఎన్నికల్లో తాము గెలిచామని చెప్పుకొంటున్న బీజేపీకి ఆ గెలుపు తమ వల్ల వచ్చింది కాదని మాత్రం తెలుసుకోలేకపోతున్నది. బీజేపీ బలమైన పార్టీ అనో, ఆ పార్టీ నాయకులు కేంద్రం నుంచి రాష్ర్టాభివృద్ధికి నిధుల వరద పారించారనో ఆ విజయాలు బీజేపీకి వరించలేదు. కేవలం సానుభూతి వల్లనే రెండుచోట్లా బీజేపీ గెలిచింది. ఆ విషయాన్ని మరిచిపోయిన బీజేపీ నేతలు కల్లు తాగిన కోతి వలె వ్యవహరిస్తున్నారు. బీజేపీ నాయకులది రాజకీయ పోరాటం అని ఒక్కరూ అనుకోవడం లేదు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా అన్ని మతాలకు సముచిత స్థానం కల్పిస్తున్నది. బతుకమ్మ చీరల పంపిణీ, రంజాన్ కానుకలు, క్రిస్మస్ వేడుకలు మొదలైన కార్యక్రమాలతో అందరి విశ్వాసాలను చూరగొంటున్నది. అన్నివర్గాలను సమంగా చూస్తూ మత సామరస్యానికి పెద్దపీట వేస్తున్నది.
రాష్ట్ర బీజేపీ నాయకులు తాము అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరు మారుస్తామంటున్నారు. దేశంలో బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఎన్నో నగరాలు ముస్లింల పేర ఉన్నాయి. ముందుగా వాటి పేర్లు ఎందుకు మార్చలేదో బీజేపీ నాయకులు చెప్పాలి. అయినా నగరాల పేర్లు మారిస్తేనే దేశాభివృద్ధి జరుగుతుందనే భ్రమలో ఉండటం ఆ పార్టీ నాయకుల అవివేకానికి పరాకాష్ఠ. కేసీఆర్ హిందూ వ్యతిరేకి అనే విషప్రచారం చేస్తున్న బీజేపీ నాయకులు ఒకసారి యాదాద్రి నిర్మాణాన్ని చూసి ఆత్మవిమర్శ చేసుకోవాలి. కేటీఆర్ నాస్తికుడంటూ ప్రచారం చేయడం వారి అజ్ఞానానికి నిదర్శనం. ఆయన నాస్తికుడే అయితే అన్ని మతాలను ఎందుకు గౌరవిస్తారు. ఇలాంటి అబద్ధపు ప్రచారాల ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్న బీజేపీ నాయకులకు ఒరిగేదేం ఉండదు. సాధారణంగా మతం, దేశభక్తి వంటి సున్నిత అంశాలను ఉపయోగించి ప్రజల్లో భావోద్వేగాలను రగలించడం ద్వారా రాజకీయంగా బలపడాలని ఆశించిన మతోన్మాదులకు ప్రజల్లో మద్దతు లభించలేదు. అభ్యుదయ భావాలు కలిగిన తెలంగాణ సమాజం వారిని పట్టించుకోలేదు, పట్టించుకోదు కూడా.
రాష్ట్రంలో బీజేపీని విస్తరింపజేయడానికి ఆ పార్టీ నాయకులు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర మంత్రులకు చేతకాకపోవడంతో ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులను తెలంగాణ ప్రభుత్వం మీద ఉసిగొల్పుతున్నారు. తెలంగాణ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్న ఆ ముఖ్యమంత్రులు వారి రాష్ర్టాలు తెలంగాణ కంటే ఏ రంగంలో ముందున్నాయో చెప్పాలని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తున్నది.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాభిమానాన్ని పొందాలంటే సైద్ధాంతికంగా, ఆలోచనాత్మకంగానే సాధ్యమవుతుంది. అంతేకానీ, అప్రజాస్వామికంగా, చట్టాలను ఉల్లంఘిస్తూ భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా సాధ్యం కాదని బీజేపీ తెలుసుకోవాలి. తాము అధికారంలో ఉన్న రాష్ర్టాల్లోనూ బీజేపీ ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నది. ఇంకోవైపు కేంద్రంలో బీజేపీని ఓడించేందుకు ఇతర రాజకీయశక్తులు ఏకమయ్యేందుకు చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే బీజేపీకి వణుకు పుడుతున్నది. అందుకే కొత్త రాష్ర్టాల్లో విస్తరించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నది. అందులో భాగంగానే తెలంగాణపై దృష్టిసారించింది. కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన నిధులపై ఏనాడు నోరుమెదపని బీజేపీ నాయకులు తెలంగాణ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేయడాన్ని తెలంగాణ సమాజం వ్యతిరేకిస్తున్నది.
బీజేపీ తమ రాజకీయ స్వార్థం కోసం మత విద్వేషాలను రెచ్చగొడుతున్నది. ప్రజలను రెండుగా చీల్చే బీజేపీ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా యువతరం బీజేపీ కవ్వింపు రాజకీయాలకు లోనుకాకుండా జాగరూకతతో వ్యవహరించాలి. బీజేపీ దేశాభివృద్ధిని ఏనాడో గాలికి వదిలేసింది. రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేయడమే కాకుండా సంపన్నులకు రాయితీలిస్తూ, సామాన్యులపై పన్ను పోటు వేస్తున్నది. దేశంలో తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న బీజేపీని దేశ ప్రజలు నమ్మే స్థితిలో లేరు. దేశాన్ని అమ్మకానికి పెట్టిన బీజేపీ వైఖరి ఏంటో ఎనిమిదేండ్ల పాలన చూస్తే అవగతమవుతుంది. సెక్యులర్ భావాలకు తెలంగాణ పెట్టింది పేరు. ఇక్కడ మతతత్వానికి స్థానం లేదు. తరతమ బేధం లేకుండా సమగ్రాభివృద్ధితో కూడిన సర్వ మానవ వికాసానిదే అగ్రస్థానం.
(వ్యాసకర్త: కొనుకటి ప్రశాంత్ , 80084 92700, టీఆర్ఎస్వీ నాయకులు, కేయూ)