ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయం, అవమానాలను అర్థం చేసుకున్న ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణ అస్తిత్వ అవసరాన్ని గ్రహించారు. భౌగోళిక, నైసర్గిక, చారిత్రక, ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక తెలంగాణ మీద అధ్యయనం చేశారు. తాను తెలుసుకోవడమే కాకుండా, ఇటు ప్రజలకూ తమ ప్రాంత ముఖచిత్రం పట్ల అవగాహన కల్పించారు. అందుకే, తెలంగాణ ఏర్పాటుకు ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా లెక్క చేయకుండా ముందుకుసాగి రాష్ర్టాన్ని సాధించగలిగారు. తాను మాటిచ్చినట్టుగానే రాష్ర్టాన్ని బంగారు తెలంగాణ దిశగా పయనింపజేస్తున్నారు.
కేసీఆర్ తెలంగాణలో తిరుగులేని నాయకుడు. ఆయనను పల్లెత్తు మాటన్నా తెలంగాణ సమాజం ఊరుకోదనీ ప్రతిపక్షాలకూ తెలుసు. కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకొని తెలంగాణలో ఉనికిలోకి రాలేమనీ వాళ్లకు అనుభవమే. అందుకే ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నాయి. కొందరనుకుంటున్నట్లుగా కేటీఆర్, కవితలు తండ్రి పేరు చెప్పుకొని ప్రజల్లోకి రాలేదు. తెలంగాణ ఉద్యమంలో భాగమయ్యారు. తెలంగాణ సాధన మలిదశ పోరులో పాల్గొనడానికి విదేశాల్లో ఉన్న చాలామంది ఎన్నారైలు తెలంగాణకు వచ్చినట్లుగానే అప్పుడు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉన్న కేటీఆర్ కూడా వచ్చారు. తెలంగాణ నేపథ్యాన్ని తెలుసుకొని, తెలంగాణ సాధన పోరులో తన వంతు బాధ్యతను నిర్వర్తించారు. తెలంగాణ బిడ్డగా, తెలంగాణ సాధనలో పోరాడిన పౌరుడిగానే ఎన్నికల పోటీలోకి దిగారు తప్ప కేసీఆర్ కొడుకుగా కాదు. తెలంగాణ ప్రజలూ ఆయనను పోరాట వీరుడిగానే గుర్తించారు. అందుకే గెలిపించుకొని గౌరవించుకుంటున్నారు. తెలంగాణలో కేటీఆర్‌కు గానీ, కవితకు గానీ సొంత గుర్తింపు ఉన్నది. ఆ గుర్తింపుతోనే వాళ్లు రాజకీయ ప్రయాణం చేస్తున్నారు. రాజకీయాల్లో రాణిస్తున్నారు.
తన రాజకీయ ప్రయాణంలో కల్వకుంట్ల కవితది చెప్పుకోదగిన పాత్ర. ఇంకా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమంలో మరువలేని పాత్ర. నిజానికి తెలంగాణ ఉద్యమంలో ఆమె దారి వేరు. సాంస్కృతికంగా తెలంగాణ గుర్తింపుతో రాజకీయ పోరుకు మద్దతు తెలిపారు.తన తండ్రితో సంబంధం లేకుండా ‘జాగృతి’ అనే సంస్థను స్థాపించి, తన పోరాట పంథాను చాటారు. తెలంగాణ సాంస్కృతిక చిహ్నంగా ఉన్న బతుకమ్మను నెత్తికెత్తుకున్నారు. తెలంగాణ పోరులో బతుకమ్మ తెలంగాణ సంస్కృతి అని, శ్రామిక వర్గ స్త్రీల సంబురమని, తెలంగాణ ఆత్మను గుర్తించ నిరాకరించిన అప్పటి పాలకుల దృష్టిని బతుకమ్మ మీదకు మరల్చారు. తెలంగాణ పల్లెలు బతుకమ్మ పాటలతో హోరెత్తాయి. విదేశాల్లోనూ బతుకమ్మ తెలంగాణ ఖ్యాతిని చాటింది. లబ్ధి గురించి ఆలోచించి, ఆశించి కవిత ఈ పోరులో పాలుపంచుకోలేదు. నిజానికి భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరూ ఊహించని స్థితి ఉద్యమం నాటిది. కేటీఆర్ కానీ, కవిత కానీ తెలంగాణ ఏర్పాటు అవసరాన్ని గ్రహించే ఉద్యమంలో భాగస్వాములయ్యారు. ఈ రోజు టీఆర్ఎస్ది కుటుంబ పాలన అంటూ మాటలు పారేసుకుంటున్న రాజకీయవర్గాలు ఒక్క సత్యాన్ని గ్రహించాలి. భారత స్వాతంత్య్ర పోరాటంలో నెహ్రూ కుటుంబానికి ఉన్న పాత్ర ఎలాంటిదో.. తెలంగాణ సాధనలో కేసీఆర్ కుటుంబానికి ఉన్న పాత్ర కూడా అలాంటిదే. ఇందిరాగాంధీ నెహ్రూ కూతురిగా ప్రధాని కాలేదు. ఆమెకున్న నాయకత్వ లక్షణాలు, స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న అనుభవం, దాంతో సంపాదించిన రాజనీతిజ్ఞత, దేశ ఆర్థిక, వాణిజ్య, సామాజిక, సాంస్కతిక, రాజకీయాలపై పట్టు, వ్యూహం వగైరా అన్నీ ఆమెను ప్రధానిగా విజయవంతం కావడానికి దోహదం చేశాయి.
అలాగే ఇక్కడ కేసీఆర్ వారసత్వమూ అంతే! కేటీఆర్ అయినా, కవిత అయినా తమ పరిజ్ఞానం, చరిత్ర, సమకాలీన పరిస్థితుల పట్ల అవగాహన, భవిష్యత్ కార్యాచరణ పట్ల స్పష్టత, విజన్, రాజనీతిజ్ఞత, నాయకత్వ లక్షణాలు.. వీటన్నిటి వల్లే ఈ రోజు నాయకులయ్యారు. తండ్రి నుంచి వారసత్వంగా వారికి ఈ లక్షణాలు వచ్చాయి. కానీ పదవులు, అధికారం రాలేదు. ఇప్పుడు ఈ కుటుంబం మీద అవినీతి నిందలు, కుటుంబపాలన అంటూ కామెంట్లు చేస్తూ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్న కొందరి లక్ష్యం ఒక్కటే.. ఎలాగైనా కేసీఆర్‌ను దెబ్బతీయడం, రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవడం. తెలంగాణ సాధన కోసం నిరాహార దీక్షతో తన ప్రాణాలను సైతం పణంగా పెట్టిన కేసీఆర్‌పై రాష్ట్ర ప్రజలకున్న అభిమానం అపారమైనది. విశ్వాసం అంతులేనిది. అందుకే ఆయనను నేరుగా తాకితే తెలంగాణ ఊరుకోదు. కాబట్టి, కవిత, కేటీఆర్‌లను లక్ష్యంగా చేసుకున్నారు.
దక్షిణాదిన పావులు కలిపేందుకు సిద్ధమవుతున్న కొందరికి కేసీఆర్ ప్రభావం మింగుడు పడటం లేదు. ఆయన చరిష్మా తమ పార్టీ ఉనికికే ప్రమాదం తెచ్చిపెట్టనుందన్న భయంతోనే కేసీఆర్‌ను ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు! అయితే తెలంగాణ బలం, బలహీనతలు తెలిసిన ఏకైక నాయకుడు కేసీఆర్. తెలంగాణ బలాన్ని ఉపయోగించుకుంటూ బలహీనతలను అధిగమించే అద్భుతమైన ఆర్థిక, వాణిజ్య, వ్యవసాయ, పారిశ్రామికాభివృద్ధి ప్రణాళికలు ఆయనలో మెండుగా ఉన్నాయి. అందరికీ కూడు, గూడు, విద్య, ఆరోగ్యం, ఉపాధి అనే కార్యాచరణతో రాష్ర్టాన్ని బంగారు తెలంగాణ లక్ష్యంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. ఆయనను కాదని మతతత్వ రాజకీయాలకు తావివ్వదు తెలంగాణ. ఇన్నేండ్లలో పొందిన చైతన్యం, తెలుసుకున్న ఎరుక అది! జాగృత తెలంగాణ ఇది!
(వ్యాసకర్త: డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు , 92465 26899, మాజీ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్)