గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతున్న అంశాలు దేశవ్యాప్తంగా ఉన్న నిశ్శబ్దాన్ని చేధిస్తూ కొత్త ఆలోచనలకు దారులు వేస్తున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య, అత్యధిక వనరులున్న దేశంలో అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వాటిని ఎత్తిచూపుతూ అనేక ప్రశ్నల్ని సంధిస్తున్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం జవాబులు చెప్పాల్సిన అవసరాన్ని దేశ ప్రజానీకానికి గుర్తు చేస్తున్నారు.
దేశంలో సమృద్ధిగా వనరులున్నప్పటికీ సంకుచిత ఆలోచనలు కలిగిన ప్రభుత్వాల పరిపాలనలో దేశం ఏ విధంగా తిరోగమన స్థితికి దిగజారుతున్నదో కేసీఆర్ సోదాహరణంగా వివరించారు. దేశంలో నిరుద్యోగం, ఆకలి పెరిగిపోతున్నా మోదీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టడాన్ని ధైర్యంగా బట్టబయలు చేస్తూ బీజేపీ అరాచకాలను ఎండగడుతున్నారు. తెలంగాణ ఉద్యమంతో పోరాటాలను ప్రారంభించిన నా లాంటి యువకులకు నేడు కేసీఆర్ దేశంలో లేవనెత్తుతున్న ప్రశ్నలు 2001 నాటి ఉద్యమ రోజులను గుర్తుచేస్తున్నాయి. తెలంగాణ ఎలా నష్టపోతున్నదో, ఎందుకు కావాలో, వస్తే ఏం మార్పులు జరిగి తెలంగాణ అభివృద్ధి చెందుతుందో నాడు చెప్పిన ఒక రాజకీయ సిద్ధాంత అవగాహన ఇవ్వాళ దేశానికి అన్వయిస్తూ కేసీఆర్ మాట్లాడుతున్నట్లు అర్థమవుతున్నది.
తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడి తెలంగాణ సాధించిన ఘన చరిత్ర కేసీఆర్‌ది. ఉద్యమ సమయంలో ఏ లక్ష్యం కోసం పోరాటం చేశారో ఆ దిశగా నేడు అనతికాలంలోనే తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలో అగ్రగామిగా నిలబెట్టారు. కేంద్రం చేస్తున్న అర్థరహిత పనులను, మతం, జాతీయత పేరుతో ప్రజలను మభ్యపెడుతున్న మోదీ డ్రామాను కేసీఆర్ బట్టబయలు చేస్తున్నారు. తమకు వ్యతిరేకంగా మాట్లాడితే సీబీఐ, ఈడీ దాడులతో వేధిస్తూ, దేశ ద్రోహులుగా చిత్రిస్తూ ఫాసిస్టు పాలన సాగిస్తున్న మోదీ సర్కారుపై తెలంగాణ రేశాన్ని ప్రకటిస్తున్న కేసీఆర్ ఎక్కుపెట్టిన అనేక ప్రశ్నలకు జవాబులు చెప్పలేని స్థితిలో మోదీ ప్రభుత్వం ఉన్నది.
బీజేపీ మతం, జాతీయత పేరుతో దేశ ప్రజలను ఏమార్చుతున్నది. తన పంచ రంగుల ప్రచారంతో ఏ ప్రాంతంలో ఆ వేషం ధరిస్తూ విద్వేషాలు రెచ్చగొడుతున్నది. ఈ అరాచకాలపై కేసీఆర్ అత్యంత పరిణతితో దేశం ఏ విధంగా వెనక్కి నెట్టివేయబడుతున్నదో సుస్పష్టంగా దేశ ప్రజల ముందుంచే ప్రయత్నం చేస్తున్నారు. ఒక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన అనతికాలంలో ఏ విధంగా అభివృద్ధి చెందిందో దేశంలో కూడా ఇలాంటి ‘తెలంగాణ మోడల్’ అభివృద్ధి జరగాలనేదే కేసీఆర్ ఆకాంక్ష. ఆయన ఆలోచనలను చూస్తుంటే తెలంగాణ బిడ్డగా గర్వపడుతున్నా. దేశంలో తలపండిన రాజకీయ నాయకులు, పార్టీలు చాలానే ఉన్నప్పటికీ దేశం సంక్షోభ స్థితికి చేరుకుంటున్న ఈ సందర్భంలో కేసీఆర్ దేశాభివృద్ధి బాధ్యతను తలకెత్తుకోవడం అభినందనీయం. కేసీఆర్‌కు దేశం, అభివృద్ధి పట్ల విశేషమైన అవగాహన, ప్రోగ్రెసివ్ ఆలోచనలు, వాటిని ప్రజలకు అర్థం చేయించే అద్భుతమైన భాషా పరిజ్ఞానం ఉన్నాయి. ఇలాంటి నాయకుడు ఇప్పుడు దేశానికి అవసరం.
అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన దేశంలో బీజేపీ అప్రజాస్వామికంగా రాష్ర్టాల హక్కులను కాలరాస్తున్నది. ప్రభుత్వాలను అస్థిరపరుస్తూ తమ రాజకీయ స్వార్థం కోసం మోదీ నియంతలా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంలో దేశానికి ఒక దిశ, దశను చూపే అవకాశాన్ని కేసీఆర్ తీసుకుంటున్నపుడు తెలంగాణ ప్రజలుగా, దేశ పురోగతిని ఆలోచించే ప్రగతిశీలవాదులుగా మనం ఆయనను బలపరచాల్సిన అవసరం, అనివార్యత రెండూ ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థకు జీవం పోసి ప్రపంచంలో బలమైన శక్తిగా భారతదేశాన్ని నిలిపిన పీవీ నరసింహా రావు వారసత్వాన్ని కేసీఆర్ అందుకోవాలి. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశంగా భారతదేశ గతిని మార్చాలి. అందుకే మనమంతా కేసీఆర్ నినాదాన్ని బలపరుస్తూ ఆయనకు బలాన్నిస్తూ ఆయన అడుగులో అడుగు వేద్దాం.
‘ఇంక్విలాబ్ కా పైగంబర్ హై తెలంగాణ’ అన్న మగ్దూం కవితను నిజం చేస్తూ మతోన్మాద మత్తులో, కార్పొరేట్ల బందీలో ఉన్న భారతదేశ విముక్తి కోసం కదులుదాం. ‘కేసీఆర్ తుమ్ ఆగే బడో… హమ్ తుమ్హారే సాత్ హై’ అంటూ తెలంగాణ రేశాన్ని ప్రకటించిన కేసీఆర్‌కు అండగా నిలు ద్దాం. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారత్‌ను లౌకిక, ప్రజాస్వామిక, ప్రగతిశీల శక్తివంతమైన నయా భారత్‌గా మారుద్దాం.
-మాదాసు శ్రీనివాస్
99891 78900