జానామి ధర్మం నచమే ప్రవృత్తిః జానామ్యధర్మం నచమే నివృత్తిః
అని తన మానసిక స్థితిని వివరించాడు భారతంలో దుర్యోధనుడు. ‘నాకు ధర్మమేమిటో తెలుసు. కానీ దాన్ని ఆచరించాలని అనిపించడం లేదు. నేను చేస్తున్నది అధర్మమనీ నాకు తెలుసు. కానీ దాన్ని వదిలి పెట్టడానికి మనస్కరించడం లేదు’ అని మొత్తుకున్నాడు. రారాజు అలా కావడానికి కారణం మాయ. ఆ మాయ పేరు శకుని. ఆ మాయకు మరోపేరే అధికారం.
దేశంలో ఇప్పుడు జరుగుతున్నది ఇదే. ధర్మం పేరుతో అధర్మం, ధర్మాన్ని సాధించే నెపంతో అధర్మం, తాము చేసిన ప్రతిదాన్నీ ధర్మంగా అంగీకరించి తీరాలనే మర్మం, ఇదీ ఇప్పుడు ఈ దేశం అనుభవిస్తున్న ఖర్మం! భారతంలో దుర్యోధనుడు భీష్మ ద్రోణ కృప విదురాది ధర్మవిదులను, వారు ప్రవచించిన ధర్మ బద్ధతకే కట్టిపడేసి, తన అధర్మాన్ని అధికారంగా ప్రతిష్ఠించినట్టు, ఇప్పుడు దేశంలో ధర్మం పేరుతో అధర్మం రాజ్యమేలుతున్నది. ధర్మాన్ని సాధించే మార్గమూ ధర్మ హితమైనదే అయి ఉండాలనే ధర్మసూక్ష్మాన్ని గాలికి వదిలి, ప్రవర్తన ఏదైనా ఫలితమే ముఖ్యమనే అధర్మ సిద్ధాంతమొకదాన్ని అధికార పీఠం ప్రసవించింది.
ఈ క్రమంలో రాజ్యాంగ విలువల వలువలు ఊడిపోతున్నయి. పార్లమెంటు ప్రేక్షక పాత్రగా మారుతున్నది. మీడియా అమ్ముడు పోతున్నది. న్యాయవ్యవస్థ జీ హుజూర్ అంటున్నది. మన సంప్రదాయం చెప్పింది ఇది కాదు, మీరు తప్పుదోవ పట్టిస్తున్నారు, ఇది తప్పు అని ఎవరైనా నిప్పులా నికార్సుగా మాట్లాడితే, తెల్లారే ఈడీలో, బేడీలో ఎదురై తడుముతున్నాయి. తరుముతున్నాయి. ఇప్పుడు ధర్మం వైపు ఉండడం ధర్మం కాదు. తాను చెప్పిందే ధర్మం అంటున్నవారివైపు ఉండడమే ధర్మం. నేడు ధర్మాన్ని పాటించేవాడు ధర్మ నిరతుడు కాదు. నువ్వు చెప్పిందే ధర్మం అని అంగీకరించేవాడు ధర్మాత్ముడు. ఇప్పుడు ధర్మమొక అనివార్యత. ఎవరికి వారుగా నిరూపించుకుని తీరాల్సిన బాధ్యత. అది రాజుగారి ఆసనం చెప్పిన శాసనం. కనిపించే భయం, కనిపించని భక్తి.. ఈ రెంటిలో ఏది నిజమో తేల్చుకోలేని మీమాంసలో… సర్వేజనాః సుఖినోభవంతు- లోకాస్సమస్తా సుఖినోభవంతు అని ప్రవచించిన సనాతన హైందవానికి, ఓట్లే టార్గెట్గా కోట్ల ఫోన్లలో వెల్లువెత్తుతున్న అసాంఘిక, అతివాద హిందుత్వానికి మధ్య తేడాను తెలుసుకోలేని, భేదాన్ని చెప్పలేని బేలతనంలో చిక్కుకుని భరత జాతి, శ్లేష్మంలో ఈగలా, లోపల ఉండలేక, బయటికి రాలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నది.
ఈ అధర్మమంతా జరుగుతున్నది ధర్మం కోసమే కదా అని తెలిసినవారు, కాదూ కూడదంటే ధర్మ ద్రోహిగా ముద్ర వేస్తారనే వెరపుతో తెలియనివారు మౌనంగా తలలూపుతూ తలుపుల చాటున దాక్కుంటున్నారు. ఈ అ-ధర్మ యుద్ధం అంతిమ లక్ష్యం అధికారమన్న అవగాహనకు రాలేని అమాయకులు కాల హరణంతో పాటు, బుద్ధి హరణమూ చేసుకుంటున్నారు! హక్కుల గురించి ప్రశ్నించాల్సిన ప్రజాస్వామిక యుగంలో, రుద్దబడిన కర్తవ్య పథంపై బాధ్యతల బరువు మోస్తూ భారతీయుడు బతుకు జీవుడా అని భారంగా సాగుతున్నడు. కష్టపడి సంపాదించాలి. కోరినంత కప్పం కట్టాలి. పెరిగిన ధరలను, పెంచిన పన్నులను నోర్మూసుకుని చెల్లించి తీరాలి. కాదూ కూడదంటే దేశానికి ద్రోహం చేసినట్టు… ఇంకా మాట్లాడితే ‘కనిపించే దేవుడి’కి ద్రోహం చేసినట్టు! ‘పెట్టని అమ్మ ఎలాగూ పెట్టలేదు.. పెట్టిన లం… కడుపునిండా పెట్టొద్దా…’ ఇదీ నేటి ధర్మం. ‘నేను కట్టే పన్నులు సరే, మరి నువ్వు నెరవేర్చే బాధ్యత సంగతేమిటి?’ అంటే అది ధర్మ ద్రోహం!
కురు సభలో ధర్మ గ్లాని జరుగుతున్నప్పుడు, ధర్మం తెలిసీ భీష్మ ద్రోణాదులు మౌనంగా ఉన్నారు. ఇది కురుక్షేత్రానికి, కురు వంశ వినాశనానికీ దారి తీసింది. అప్పుడు దుర్యోధనుడిని శకుని అనే మాయ కమ్మినట్టు, ఇప్పుడు మనల్ని అబద్ధమనే మాయ కమ్ముకుంటున్నది. దానిలో మునిగితే వినాశనం. తెగిడితే విజయం.
మరి ఈ ధార్మిక సంక్షోభానికి పరిష్కారం ఏమిటి? నిజంగా ఏది ధర్మమో, ఏది అధర్మమో తెలుసుకోవడం. ధర్మం పేరుతో చెప్తున్నదంతా, చేస్తున్నదంతా ధర్మం కాదని గుర్తించడం. బ్రహ్మాన్ని అన్వేషించడం మొదలుకుని, అనంత విశ్వాన్ని ఆశ్వాసించేదాకా భారతీయ ధర్మమంతా ప్రశ్నలోనే దాగి ఉంది. కానీ మనమిప్పుడు ఆ ప్రశ్నను మరిచి పోతున్నం. ప్రశ్నించడాన్నీ మరిచిపోతున్నం. విద్వత్తు, విద్యుత్తు, విజ్ఞానం, ప్రజ్ఞానం అన్నీ ప్రశ్నే. ప్రశ్నోపనిషత్తే మన అసలు వేదం. మన ధర్మమెప్పుడూ మన మెదడును మొద్దబార్చలేదు. అబద్ధంలో దాచలేదు. అర్థవంతంగా ప్రశ్నిస్తే, అద్దంలో నిజాన్ని చూపించింది. మన ధర్మం చూపిన అసలు మార్గం… సత్యం కోసం అన్వేషణ! వేల ఏండ్ల చరిత్ర ఉన్న ఈ దేశంలో ఎన్నడైనా ఒకే ఒక్క ధర్మం ఉన్నదా? ఉంటే గౌతమ బుద్ధుడు, మహావీరుడు ఎందుకు పుట్టినట్టు? ఏ కారణంతో ఆది శంకరులు మళ్లీ సాలగ్రామ పెట్టెలో షణ్మత స్థాపన చేసినట్టు? ఆ తర్వాత కూడా ఎందుకు రామానుజుడు, మధ్వాచార్యులు వచ్చినట్టు? ఒకే ధర్మం ఉంటే, ఉండాలంటే… వైదికులు, చార్వాకులు, సాంఖ్యులు, జైనులు, బౌద్ధులు, నైయాయికులు, మీమాంసకులు, వైశేషికులు, వేదాంతులు, యోగులు, వీరశైవులు, అద్వైతులు, విశిష్టాద్వైతులు, ద్వైతులు… వీళ్లంతా ఎవరు? ఒకే ధర్మాన్ని స్థాపించడం సాధ్య మా? స్థాపించినా రేపది అట్లే ఉంటుందా?
రామ రాజ్యం నుంచి, మౌర్య సామ్రాజ్యం దాకా, వశిష్టుడి నుంచి చాణక్యుడి దాకా, ప్రజలను నొప్పించవద్దన్నారే తప్ప ముక్కుపిండి పన్నుల వసూలు చేయాలని చెప్పలేదు. విలువల్ని నిలబెట్టమన్నారే తప్ప పడగొట్టమని చెప్పలేదు. నువ్వెటు అని విడగొట్టే ప్రయత్నం జరుగుతున్నప్పుడు, ‘మన’మెటు అని ఆలోచించడమే అసలు పరిష్కారం.
పన్ను బాధ్యతై, సేవ రుసుమై, సేవకుడు నియంతై, మౌనం కర్తవ్యమై, ప్రభువులుగా పేర్గాంచిన యావద్భారత కష్టజీవులు శ్రామికులై, ఉద్యోగులై దేశాన్ని, రాజును, రాజశ్యాలకులను పోషించే ధర్మ బాధ్యతను తలకెత్తుకుని, దేశాన్ని పోషించక తప్పని పరిస్థితిలో చిక్కుకున్న వింతైన సందర్భమిది! హతవిధీ!!
క్షీరసాగర మథనం జరుగుతున్నది. హాలాహలం అంతటా వ్యాపించింది. మింగేసే గరళ కంఠుడు కావాలి. అమృతమథనం సాగాలి. ఈ సాగర మథనానికి కావాల్సిన మంధర పర్వతం ప్రశ్నే! దేశంలో ప్రశ్నల మథనం సాగించడానికి ఒక బక్కోడు బయల్దేరుతున్నడు. ప్రణాళికల వాసుకి అతని వశంలోనే ఉంది. అతని దేహమే దేశం, మనసే ధర్మం. అతని ఆలోచన సాహసం. అతని గుండె నిండుగా దైవ భక్తి. దేశభక్తి అతని ఆచారం. అతని పథం హైందవం. అతని మతం ప్రజా సంక్షేమం. పులిపై స్వారీ అతనికి అలవాటైన సాహస క్రీడ. అతను ఎంచుకునేది సంక్షోభాల ఓడ. నిరంతర ఆలోచనా సేద్యం.. నిర్విరామ ఫలసాయం.. అతనికే తెలిసిన వ్యవసాయం. తాము బాగుంటే అంతా బాగున్నట్టే కాదు, అందరూ బాగుంటే తాను బాగున్నట్టే అనుకునేవాడు. అతను 69 ఏండ్ల శక్తి కేంద్రం. సృజన సంద్రం. సిద్ధిపేట నుంచి తెలంగాణ సాధించినట్టు, తెలంగాణ నుంచి భారత భాగ్యాన్ని కాంక్షిస్తున్నడు. ‘ఈ దేశం ఇట్లా ఎట్లా ఉంటుం ది? ఇట్లా ఎందుకుండాలి?’ అనే రెండు ప్రశ్న లను పైకెత్తిపట్టి, ముదిమిని అదిమిబెట్టి, అభివృద్ధిని దివిటీగా కట్టి బయల్దేరుతున్నాడతడు. మనమూ అతని వెంట బయల్దేరుదమా? ఒక్కొక్కరం ఒక్కొక్క ప్రశ్నై… ప్రశ్నల సమూహమై… ప్రశ్నల సమాజమై!
తిగుళ్ల కృష్ణమూర్తి