సుస్థిర, సమ్మిళిత అభివృద్ధి సాధించాలంటే వ్యవస్థలో నూతన ఆవిష్కరణలు అత్యంత ఆవశ్యకం. అంతర్జాతీయ పోటీని తట్టుకొని ముందుకుపోవాలంటే నవకల్పనలు దోహదపడతాయి. వీటిద్వారా దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించవచ్చు. ఈ తరహా ఆవిష్కరణలు లక్షలాది నూతన ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయి. ఎంతోమంది పేదరికం నుంచి బయటపడటానికి సహకరిస్తాయి.
భాగ్యవంత దేశాల విజయ రహస్యంలో నూతన ఆవిష్కరణలే ప్రధాన పాత్ర వహించాయి. మన దేశంలో కూడా ఈ తరహా నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ దేశంలో గల వివిధ రాష్ర్టాలు పోటీ పడి నవకల్పనల దిశగా ముందుకుపోవడానికి దేశం ఓ నూతన వ్యూహాన్ని అనుసరిస్తున్నది. అదే భారత ఆవిష్కరణల సూచిక (ఇన్నోవేషన్ ఇండెక్స్). ఈ సూచిక దేశంలో నవ కల్పనలు, నూతన ఆవిష్కరణల్లో వివిధ రాష్ర్టాల పనితీరును తెలియజేస్తుంది. ఈ సూచీని బట్టి ఆయా ప్రాంతాల్లో కొత్త ఆవిష్కరణలకు ఉన్న అనుకూలతలు, సవాళ్లను తెలుసుకోవచ్చు. ఫలితంగా జాతీయస్థాయిలో ఆవిష్కరణల సమగ్ర విధానాల రూపకల్పనకు అవకాశం ఏర్పడుతుంది.
దీనికోసం రాష్ర్టాలు, ఇతర వాటాదారుల భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌ను మెరుగుపరుస్తారు. కాలక్రమంలో ఈ ప్రక్రియ దేశంలో ఆవిష్కరణలు పెరగడానికి వీలు కల్పిస్తుంది. తద్వారా రానున్న రోజుల్లో స్వయం సమృద్ధ భారత్‌కు బాటలు పడతాయి. తాజా సూచికలో దేశంలో ఆవిష్కరణల పనితీరును కొలవడానికి, సూక్ష్మమైన, సమగ్రమైన దృక్పథాన్ని అందించడానికి ఏడు కొలమానాల్లో 66 అంశాలను ప్రమాణంగా నిర్ణయించారు.
ఈ విధానంలో ర్యాంకుల కోసం తీసుకున్న కొలమానాలను ‘ఎనేబులర్స్, ‘పర్ఫార్మర్స్’ పేరుతో రెండు గ్రూపులుగా విభజించారు. వాటిలో ‘ఎనేబులర్స్’ విభాగంలో
తెలంగాణ నాలుగో స్థానం సాధించింది. పర్ఫార్మర్స్ విభాగంలో తొలి స్థానంలో నిలిచింది. నైపుణ్యం ఉన్న కార్మికులు, సేఫ్టీ, లీగల్ ఎన్విరాన్మెంట్, నాలెడ్జ్ ఔట్పుట్ వంటి విషయాల్లో ద్వితీయ స్థానాన్ని దక్కించుకున్నది. ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో రెండోస్థానం కైవసం చేసుకుంది.
‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో అగ్రస్థానంలో ఉంటూ వస్తున్న తెలంగాణ రాష్ట్రం ఇన్నోవేషన్లలో గతంలో 4వ స్థానంలో ఉండగా ఇప్పుడు 2వ స్థానం దక్కించుకున్నది. మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ర్టాలను సైతం అధిగమించి ‘ఇన్నోవేషన్ తెలంగాణ’ అనిపించుకున్నది. ఆవిష్కరణ సూచిలో ద్వితీయ స్థానాన్ని దక్కించుకున్న తెలంగాణకు ‘పర్ఫార్మర్’ విభాగంలో మొదటి ర్యాంకు సాధించింది. బహుళ జాతి సంస్థల ఏర్పాటులో, ‘స్టార్టప్’ల్లో మెరుగైన పనితీరులో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు లభించటం గమనార్హం.
‘స్టార్టప్’లకు తెలంగాణ నిలయంగా మారిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే స్టార్టప్‌ల సంఖ్య గతేడాదితో పోలిస్తే తెలంగాణలో 4,900 నుంచి 9 వేలకు చేరింది. ‘ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ)’ ప్రయోగ శాలలను కలిగి ఉన్న పాఠశాలల విషయాన్ని తీసుకుంటే.. తెలంగాణలో వాటి సంఖ్య 17 నుంచి 35 శాతానికి పెరిగింది. ఉన్నత విద్య చదువుతున్నవారి శాతం 9.7 నుంచి 15.7 శాతానికి చేరింది. నైపుణ్యం గల మానవ వనరుల సృష్టి కోసం ఏర్పాటుచేసిన ప్రైవేటు పరిశోధన, అభివృద్ధి సంస్థలు కూడా 0.3 నుంచి 1.4 శాతానికి చేరాయి. పేటెంట్లు, ట్రేడ్‌మార్క్‌లు, ఇండస్ట్రియల్ డిజైన్ల్లో తెలంగాణ ఉత్తమ పనితీరును కనబరుస్తున్నది. తెలంగాణ బహుముఖ అభివృద్ధిని సాధించడానికి ఇన్నోవేషన్ (ఆవిష్కరణలు), ఇన్ఫ్రాస్ట్రక్చర్ (మౌలిక వసతులు), ఇంక్లూసివ్ గ్రోత్ (సమగ్రాభివృద్ధి)ని ‘3ఐ’ మంత్రంగా పాటించి అమల్లో దార్శనికత పాటించడమే కారణం. సాంకేతిక పరిజ్ఞానం సృష్టించడం, అమలు చేయడంలో తెలంగాణ ముందంజలో ఉంది. ఉత్పత్తులు, సేవల్లో ఇంకా మెరుగైన స్థితిని పొందే దిశలో ముందుకుపోతున్నది.
దేశ జీడీపీలో నగర జనాభా వాటా 63 శాతంగా నివేదిక పేర్కొన్నది. దేశంలో ఏ రాష్ట్రమైనా తమకున్న పరిమిత వనరులతో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూనే నూతన ఆవిష్కరణల దిశగా అడుగులు వేయాలి. అప్పుడే దిగుమతులపై ఆధారపడే పరిస్థితి తగ్గి స్వయం సమృద్ధి సాధించగలుగుతాం.
-రుద్రరాజు శ్రీనివాసరాజు 94412 39578