2001, పదో తరగతి సదువుతున్న రోజులు… ‘ఓ పోడ.. లెవ్వురా బడికి ఆల్షమైతున్నదీ…’ అని అజ్జిరవ్వ దీర్ఘాల్దీస్తున్నది. ఆమె మొత్తుకోంగ, మొత్తుకోంగ ఎనిమిదిట్టికి లేసిన. మా ఇంటిక పక్కనే ఉన్న వెంకటేశ్వరుని గుళ్లె వెట్టిన చిన్న, మట్టి వినాయకుని దగ్గర సోపతి గాళ్లతోని రాత్రి పదింటిదాన్క రెస్సాడేసరికి ఎప్పుడూ ఆల్షంగ లెవ్వని నేను ఆ రోజు ఆల్షంగ లేసిన. దబదబా తానం జేసి, నాలుగు బుక్కలు గట్టిగ మల్సి, నీళ్లు తాగకుండనే ఆగమాగం ఉర్కుతున్న బడికి. ‘ఓ పోడ.. కుత్కె వడ్తది ఇన్ని నీళ్లన్న తాగిపోరా..’ అని అజ్జిరవ్వ కీకలేస్తున్నది.. ‘ఎహె బళ్లె తాగుత తీయ్యె నీళ్లు.. అసలే పెద్దసారు ఇంగ్లీషుల పాఠం జెప్తండు కావచ్చు, మజ్జన వోతే సార్ గొడ్తడని’ బ్యాగ్ జబ్బకు తల్గేస్కొని బడికి వోయిన.
మానకొండూర్ గడి, గడి పక్కపొంటి గుడి, ఆ గుడి బాదుకు మా బడి. అప్పటికే హెచ్ఎం రవీందర్ సార్ పాఠం జెప్పవట్టి పది నిమిషాలైతున్నది. ఫస్టు పీరియడ్ సారుదే. బైటికినవడ్తున్నయి నా తోటి పోరగాండ్ల నవ్వులు. ‘ఇయ్యాళ్ల సార్ మళ్లేం జోకులు జేస్తుండోనని ఆత్రంగ వొయి ‘మే ఐ కమ్ ఇన్ సర్..’ అని ఇంగ్లీషులడిగిన. ఆ నవ్వుళ్ల రవీందర్ సార్‌కు ఇనవడనట్టున్నది. దూలానికొరిగున్నడు రవీందర్ సార్. ఆయన పెదువులు కిందికి జారి, సార్ మీసాలు గదుమకాడికొచ్చినయి. ముక్కు నడ్డిదైంది. నొసలు మీద నాలుగైదు ముడుతలు వడ్డయి. మా ఇంగ్లీష్ సార్ ఏశాలు, నాతోటి పోరగాండ్ల నవ్వులు జూసి నాగ్గూడా నవ్వాగాలె. నేన్గూడా వాళ్లతో పాటే గల్మకాడ నవ్వుకుంటనే ఉన్న.
ఒకరోజు ముందు క్లాస్‌రూంలో జరిగిన ముచ్చట..: ‘రేపు మై ఫైనాన్షియల్ కెరీర్ పాఠం జెప్పుకుందాం… ఏం జెప్పుకుందాం…?’ అని సార్ అడిగితే మేం ‘మై ఫైనాన్షియల్ కెరీర్’ అని గట్టిగ మొత్తుకున్నం. నిన్నటి కొనసాగింపే ఈ రోజు సార్ చెప్తున్న పాఠం. ఆ కథా రచయిత ‘స్టీఫెన్ లీకాక్’. అసమర్థత, అభద్రతాభావం, తెలివి తక్కువతనం, తనకు తాను ఇజ్జత్ తీసుకునే పాత్ర గురించి, మాకు ఇంటర్ల గూడ ఒక పాఠం రాబోతున్నదని, దానిగురించి రవీందర్ పదో తర్గతిలనే జెప్తుండన్న మాట. ఆ పాఠం పేరు ‘విత్ ద ఫొటోగ్రాఫర్’. ఈ కథా రచయిత గూడ స్టీఫెన్ లీకాకే.
‘సత్తీషూ… ఆల్షమెందుకైందోయ్… అయితే అయింది గని, దా.. దా.. జల్దచ్చి కూసో..’ తిట్టకుండా లోపల్కి రమ్మంటే కుయ్యిమనకుండా వొయి బెంచి మీద గూసున్న. ‘విత్ ద ఫొటోగ్రాఫర్’ కథలోని వస్తువేమంటే.. ‘స్టీఫెన్ లీకాక్’ పోట్వ దిగడానికి స్టూడియోకు వోతడు. తనను తాను ఎలా ఉంటనో పోట్వల సూస్కోవాల్ననే ఆత్రం లీకాక్ది. లీకాక్ను పోట్వ తియ్యడానికి ఆ పోట్వగ్రాఫర్ పడని పాట్లుండవు. ఓసారి మూతొంకర వెడ్తడు, ఓసారి నడ్డొంకర వెడ్తడు. లికాక్ ఏశాలను మా రవీందర్ సార్ యాక్టింగ్ చేసి మరీ సూపెడుతుంటే కడుపుబ్బా నవ్వినం. రోజంతా కట్టవడి ఆఖరికి లికాక్ పోట్వను క్లిక్కుమనిపిస్తడు పోట్వగ్రాఫర్. కొన్ని రోజులకు తన ఫొటో తాను సూస్కొని ఇది నేను కాదంటే కాదని మొండికేస్తడు. ఏ పనిలోనైనా కన్ఫ్యూజన్, ఆరాటం పనికిరాదని, అతితెలివి, అభద్రతాభావం మొదటికే మోసం జేస్తదని ‘విత్ ద ఫోటో గ్రాఫర్’ జెప్పే సారం.
ఇప్పుడు ‘స్టీఫెన్ లీకాక్’ రాసిన ‘విత్ ద ఫోటో గ్రాఫర్’ పాఠం ఎందుకు గుర్తుకువచ్చిందంటే. ఎక్కడికి పోయినా పోట్వలకు ఫోజులిచ్చే మన ప్రధాని మోదీజీ, పోట్వల కోసం ఆయన పడే తంటాలు, ఆయన పోట్వ లేదని మొన్నటికి మొన్న కామారెడ్డి పర్యటనలో లొల్లి లొల్లి జేసిన కేంద్ర మంత్రి నిర్మలమ్మ హడావుడి యాదికొచ్చింది. అయినా ఈ నిర్మలమ్మ పోట్వ కోసం ఢిల్లీకెళ్లి గల్లీకొచ్చి మరీ లొల్లిజేసుడేందో నాకైతే సమజ్ గాలె. పోట్వను ప్రజలు గుండెల్లో వెట్టుకోవాలె గని, బలవంతం గా ప్రజల మీద రుద్దాలనుకోవడం గుర్తుకొస్తేనే యాక్
అనిపిస్తున్నది.
-గడ్డం సతీష్
99590 59041