సజ్జన సాంగత్యం అందరికీ మంచిది. అయితే, సద్గుణాలు లేనివారు మంచివాళ్ల పక్కన నిలబడగలరా? వారి దగ్గరికైనా రాగలరా? అసలు సజ్జన సాంగత్యానికి ఉండాల్సిన అర్హత ఏమిటి? ‘పసువా సౌ పాలా పరౌ రహూ రియా య ఖీజి’ అనే దోహాలో ‘దున్నపోతు మీద చల్లని వానజల్లు కురిసినా దానిలో చలనం రాదు, భయమూ కలుగదు. చవిటి నేలలో ఎన్ని విత్తనాలు చల్లినా ఏమి ప్రయోజనం? ఒక్కటీ మొలవదు. అంటే మూర్ఖత్వం వదలిపెట్టనివానికి జ్ఞాన దానం చేయడం కుదరదు’ అంటాడు కబీరుదాసు.
సజ్జన సాంగత్యం పొందాలంటే, అంతకు ముందుగా మూర్ఖత్వాన్ని వదిలిపెట్టాలి. అప్పుడే సజ్జనులు ఎవరన్న విషయం బోధపడుతుంది. వారిని కలుసుకోవాలని మనసులో బలంగా కోరుకోవాలి. కోరుకున్నంత మాత్రాన సజ్జనులు మన దగ్గరికి రారు. వారున్న చోటికి మనమే చేరుకోవాలి. వాళ్లు చేస్తున్నది సర్వ సామాన్యంగా, నిత్యానిత్య చర్చ అయి ఉంటుంది. అంతేకానీ, లౌకిక విషయాల గురించి మాట్లాడుకోరు. ఆ సమావేశంలో జరిగే చర్చను ఓపికగా వినాలి. ఆ సంభాషణలో అనుభవం కొంచెం తక్కువగా ఉన్నవాళ్లు గానీ, ఆరంభంలో ఉన్నవాళ్లు గానీ ఏవో ప్రశ్నలు వేస్తుంటారు. అనుభవం ఉన్నవాళ్లు ఇంకేవో సమాధానాలు చెబుతుంటారు. వారి చర్చల్లో ఏయే సందేహాలు వ్యక్తమవుతున్నాయి, ఏ పరిష్కారాలు వెలువడుతున్నాయో జాగ్రత్తగా గమనించాలి. ఈ క్రమంలో తాను ఏ స్థాయిలో ఉన్నానన్న సంగతి సాధకుడికి బోధపడుతుంది.
ధరణి సజ్జనసంగంబు దలప నుభయ
సమ్మతంబగు వారలు సలుపునట్టి
సరస సంభాషణ ప్రశ్నసరణి నిఖిల
జనములకు సుఖకరమగు జనవరేణ్య
(భాగవతం- చతుర్థ స్కంధం)
‘ఉభయ సమ్మతంగా జరిగే సజ్జనుల సంభాషణ, వారి చర్చలు, సంధించే ప్రశ్నలు, వాటికి వెలువడే సమాధానాలు అందరికీ మేలు చేస్తాయి’ అని పై పద్య భావం. సజ్జనుల సాంగత్యాన్ని కాలక్షేపంగా భావిస్తే ఏ ప్రయోజనమూ ఉండదు. వారి చర్చల్లోని ఆంతర్యాన్ని అర్థం చేసుకోవాలి. అందులోని సారాంశాన్ని సంగ్రహించాలి. ఆ అనుభవంతో మన వ్యక్తిత్వాన్ని మార్చుకోగలగాలి. జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి. ‘సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం’ అన్న శంకరాచార్యుల భజగోవింద సూత్రంలో జీవన్ముక్తికి తొలి అడుగు సజ్జన సాంగత్యమే!
– డా॥ వెలుదండ సత్యనారాయణ, 94411 62863