న్యూఢిల్లీ: గాయంపై నేరుగా చల్లిన ఒక సెకండ్లోనే రక్తస్రావాన్ని ఆపగలిగే హెమొస్టేటిక్ ఏజెంట్ పొడిని దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. కొరియా అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (కేఏఐఎస్టీ) శాస్త్రవేత్తలు ఈ విజయం సాధించారు. ఈ బృందంలో ఆర్మీ మేజర్ కూడా ఉన్నారు. స్ప్రే రూపంలో ఉండే ఈ పొడిని గాయంపై చల్లిన వెంటనే పటిష్టమైన హైడ్రోజెల్ బ్యారియర్గా మారుతుంది. వెంటనే గాయాన్ని మూసివేస్తుంది. యుద్ధంలో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ పరిశోధన జరిగింది.
యుద్ధాలు జరిగే ప్రదేశాలు, విపత్తులు సంభవించే ప్రాంతాలు వంటి అత్యంత తీవ్రమైన పరిస్థితుల్లో సైతం ఈ పొడి తక్షణమే పని చేస్తుంది. ఎమర్జెన్సీ కేర్లో వేగంగా దీనిని వాడవచ్చు. గదుల్లో భద్రపరచినపుడు ఉష్ణం, తేమ అతిగా లేకుండా జాగ్రత్త వహించాలి. ఈ పరిశోధనలో పాల్గొన్న ఆర్మీ మేజర్, పీహెచ్డీ క్యాండిటేట్ క్యూసూన్ పార్క్ మాట్లాడుతూ, కనీసం ఒక సైనికుడిని అయినా అదనంగా కాపాడాలనే లక్ష్యంతో తాను ఈ పరిశోధనను ప్రారంభించానని చెప్పారు. దేశ రక్షణ, ప్రైవేట్ వైద్య రంగాల్లో ఈ ప్రాణ రక్షక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పొడిని సహజసిద్ధ పదార్థాలతోనే తయారు చేశారు.