న్యూఢిల్లీ: సాధారణ పంచదార రుచితో, తక్కువ క్యాలరీలు గల సహజసిద్ధ చక్కెరను టఫ్ట్స్ విశ్వవిద్యాలయం పరిశోధకులు అభివృద్ధి చేశారు. దీనిని వాడిన వారికి ఇన్సులిన్ స్ఠాయులు తీవ్రంగా పెరగవు. దీని వల్ల టేబుల్ షుగర్, కృత్రిమ స్వీట్నర్స్కు ఆరోగ్యకర ప్రత్యామ్నాయంగా ఈ సరికొత్త పంచదార టగటోజ్ నిలుస్తుంది. సుక్రోజ్ తియ్యదనంలో 92 శాతం వరకు టగటోజ్లో ఉంటుంది. సంప్రదాయ షుగర్, చాలా ఆర్టిఫిషియల్ ప్రత్యామ్నాయాల మాదిరిగా కాకుండా, టగటోజ్ ప్రభావం బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ మీద నామమాత్రంగా ఉంటుంది.
డయాబెటిస్ లేదా ఇన్సులిన్ సెన్సిటివిటీ గల వారికి ఇది చక్కని ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. మనుస్ బయో (యూఎస్), కేక్యాట్ ఎంజైమటిక్ (ఇండియా) బయోటెక్నాలజీ సంస్థలతో కలిసి టఫ్ట్స్ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఈ వివరాలను వెల్లడించారు. పండ్లు, పాడి ఉత్పత్తుల్లో టగటోజ్ సహజంగానే కొద్ది మొత్తంలో ఉంటుంది. ఇది పరిమితంగా అందుబాటులో ఉన్నందు వల్ల వాణిజ్య వినియోగం పరిమితంగా ఉంది. దీనిని విస్తృత స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు నూతన విధానాన్ని ఈ పరిశోధకులు ప్రదర్శించి చూపించారు.