రెండు దశాబ్దాల కిందట, విద్యార్థి సంఘాల్లో పనిచేస్తున్నప్పుడు ‘కులం కుల్లురా-మతం మత్తురా..’ అంటూ గోడలపై నినాదాలు రాసినవాళ్లం. ఆ చైతన్యాన్ని నింపుకొన్న హృదయంతో రాజకీయాలను కొనసాగిస్తున్న వాళ్లం. అభివృద్ధి చెందుతున్న దశ నుంచి అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచం ముందు త్రివర్ణ పతాకం రెపరెపలాడాలని పరితపించేవాళ్లం. అందుకే, ‘తెలంగాణ మోడల్’ను దేశానికి పరిచయం చేయాలని కేసీఆర్ చేస్తున్న సంక్షేమ, ప్రజాస్వామ్య, రాజ్యాంగబద్ధ పాలన యజ్ఞానికి హారతి పడుతున్నాం.
రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి వికటాట్టహాసం చేస్తున్న బీజేపీ ద్వయం ఆడుతున్న రాక్షస క్రీడలు ప్రశాంతంగా ఉన్న తెలంగాణకు చేరినయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. సహజ వనరులను ఎట్లా ఉపయోగించుకోవాలి? ప్రపంచంలోనే అత్యధికంగా అందుబాటులో ఉన్న మానవశక్తిని ఏ విధంగా అభివృద్ధికి వినియోగించుకోవాలనే విజన్ లేకుండా సంకుచిత రాజకీయాలకు పాల్పడుతున్నది. బీజేపీ పాలనలోని ఏ ఒక్క రాష్ట్రంలోనూ రైతులు, ప్రజలు సంతోషంగా లేరు. విద్య, వైద్యం సంగతి దేవుడెరుగు ప్రజలందరికీ కనీసం తాగునీరు ఇచ్చిన బీజేపీ రాష్ట్రం ఒక్కటీ లేదు. ఇవన్ని గాలికి వదిలేసి బీజేపీ మతం మంటల్లో ప్రజలను కాల్చుతూ రాజకీయాలు చేస్తున్నది.
ప్రజాస్వామ్యానికి ప్రతీక: తెలంగాణ రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో మొదటి స్థానంలో నిలిపిన ఘనత కేసీఆర్‌ది. అదే ఒరవడిని ఇప్పుడు దేశానికీ అందించాలన్నదే ఆయన లక్ష్యం. అందుకే ఒక సహేతుకమైన తెలంగాణ అభివృద్ధి నమూనాను దేశ ప్రజల ముందుంచారు. కేంద్రం సమాఖ్యస్పూర్తిని మరిచి, సహకారం అందించనప్పటికీ తన మేధస్సుతో రాష్ర్టాన్ని అభివృద్ధిలోకి తీసుకువచ్చారు. కేంద్రంలోని బీజేపీ మాత్రం ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి, మత ఘర్షణలు సృష్టిస్తూ రాజకీయ లబ్ధి పొందుతున్నది. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఆయా ప్రభుత్వాలను కూల్చి తమ పార్టీ ప్రభుత్వాలను ఏర్పాటుచేసి ప్రజాస్వామ్య హననానికి పాల్పడుతున్నది. వీటన్నింటిని ప్రశ్నించిన కేసీఆర్‌పై వ్యక్తిగత దూషణలకు దిగటం వంటి కుటిల రాజకీయాలు చేస్తున్నది.
బరితెగించిన రాజకీయాలకు బాటలు: దేశాన్ని ఏలుతున్న మోదీ-షా ద్వయం తమను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష పార్టీలనే కాదు, ఏకంగా తమకు అడ్డువస్తున్నారని భావించిన సొంత పార్టీ నేతలైన అద్వానీ నుంచి మొదలుకొని నేటి నితిన్ గడ్కరీ వరకు అందరినీ అణచివేస్తున్నది. రాష్ర్టాలకు ఇవ్వాల్సిన నిధులు విడుదల చేయదు. పైగా డొంకతిరుగుడు నియమ నిబంధనలు పెట్టి రాష్ర్టాలు న్యాయంగా తీసుకోవాల్సిన రుణాలకు మోకాలడ్డుతున్నది. అందుకే బీజేపి దురాగతాలను ఎలుగెత్తి చాటుతున్నరు కేసీఆర్. ఆ ప్రశ్నలకు జవాబుల్లేక మతం అనే భూతాన్ని భుజాలమీద వేసుకొని, దానికి తోడుగా సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను తమ గుప్పెట్లో పెట్టుకుంటున్నరు బీజేపీ పాలకులు. ఈ దుర్మార్గ రాజకీయ విశృంఖల సంప్రదాయం నుంచి ఊడిపడ్డదే ఈ మునుగోడు ఉప ఎన్నిక. ఒకసారి మునుగోడు ఉప ఎన్నిక వచ్చిన నేపథ్యాన్ని గుర్తుచేసుకుంటే విచ్ఛిన్న, స్వార్థ రాజకీయాల కోసమేనని సుస్పష్టమవుతున్నది. తమ అధికార కాంక్ష కోసం గతంలో వలె గుజరాత్, ముజఫరాబాద్, ఢిల్లీ, ఫరీదాబాద్‌లలో అల్లర్లు సృష్టించిన తన దుస్సంప్రదాయానికి ఇక్కడ కూడా బీజేపీ తెరదీసింది.
అభివృద్ధికి మారుపేరు, ఎనిమిదేండ్లు ఎలాంటి అల్లర్లు లేకుండా, ప్రశాంతంగా ఉంటున్న హైదరాబాద్‌లో అల్లర్లకు వ్యూహం పన్నింది. అమాయకులను రెచ్చగొట్టి, మతాల మధ్య చిచ్చుపెట్టి మారణహోమం సృష్టించి ఆ మంటల్లో రాజకీయ పబ్బం గడుపుకోవడమే బీజేపీ సిద్ధాంతం. నిజంగా బీజేపీ నేతలు చెప్తున్నట్టు ధర్మం కోసం, దేశం కోసమే వారు పనిచేస్తే.. ఏడాదిలో సాధారణ ఎన్నికలు జరగాల్సిన తరుణంలో మునుగోడులో ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది? ఈ ప్రశ్న అడుగుతున్న మునుగోడు ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత మోదీ-షా లదే. సాక్షాత్తు మునుగోడు బహిరంగసభలో రాజగోపాల్‌రెడ్డి అమిత్ షా సాక్షిగా.. ‘నన్ను రాజీనామా చేయమన్నది అమిత్ షానే, గెలిపించుకునే బాధ్యత కూడా ఆయనదే’ అని సిగ్గు విడిచి మాట్లాడిండు.
అప్పటిదాక అభివృద్ధి కోసమే తన రాజీనామా అన్న రాజగోపాల్ ఊకదంపుడు ఉపన్యాసాలు ఉత్తయే అన్న విషయం ఈ ప్రకటనతో తెలిపోయింది. కానీ మునుగోడు ప్రజలు విజ్ఞులు, తమను కష్టాల్లో ఆదుకున్నదెవరో.. ఆపదలో కాడి వదిలేసిందెవరో ఎరిగినవారు. దశాబ్దాలుగా వెనుకబడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నవారు. తెలంగాణ పోరాట చైతన్య వారసత్వం నిండినవారు, వామపక్ష భావజాలాన్ని మోస్తున్నవారు. తెలంగాణను అభివృద్ధి దిశగా ముందుకు నడిపిస్తున్న కేసీఆర్‌ను నమ్మినవారు. ఏడు దశాబ్దాలుగా ఎండిపోయిన బీళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పచ్చని పంటలను, ప్రాజెక్టుల్లో నీళ్లను చూస్తున్నవారు. భయంకర ఫ్లోరోసిస్ వైకల్యాన్ని ఇప్పుడిప్పుడే మరిచిపోతున్నవారు. అనైతిక, స్వార్థ రాజకీయాలను, వ్యాపార కాంక్షతో తెచ్చిన ఎన్నికల కుట్రలను చీల్చి చెండాడేవారు. అభివృద్ధికి జై కొట్టేందుకు సిద్ధమై ఉన్నారు. ఇది నిజం. ఇదే నిజం.
(వ్యాసకర్త: శాసనమండలి మాజీ సభ్యులు)
-కర్నె ప్రభాకర్