రాజన్నా.. ఎనిమిదేండ్ల కింద ఎట్లుండెనే బతుకులు
బీడు వారిన భూములు.. నోళ్లు తెరిసిన నేలలు
రాష్ట్రమొచ్చినాక కాళేశ్వరం జలధారలు
పాలపొంగులై.. రైతన్న సేనులో సెలకలో పారుతూ
తెల్లని పత్తి పువ్వులై పూస్తున్నయి!
ఏండ్లసంది కడుపులో పూడికను నింపుకొన్న
చెరువులన్నీ నేడు నీటితో నిండి జలకళతో
తామర పువ్వులతో సింగారించుకుంటున్నయి
కాలువల్లో కొలనుల్లో పిల్లల ఈతల సరదాలు
ఇప్పుడు తెలంగాణ పల్లెపల్లెన కనువిందులు…
నర్సన్నా.. ఎవడు పట్టించుకున్నడే రైతన్నని
నాడు సాగుకు సాయం లేక కన్నీటి పాటయ్యిండు
నేడు రైతుబంధుతో హాలికుడు
హరివిల్లుల పంటలు పండిస్తున్నడు
చిల్లులు పడ్డ జీవితానికి చిల్లిగవ్వ లేనిది నాడు
ధాన్యరాసులతో ధనరాసులయ్యేను నేడు…
నింగిలోని సుక్కలన్నీ వెండి తారలై మెరిసినట్లు
సేద్యకాడి మోములో చిరునవ్వుల సవ్వడి
తెలంగాణ నేలంతా పచ్చని పంటల పందిరి…
గంగన్నా… కులవృత్తుల కన్నీరును తుడిచిందెవ్వరే
చేతివృత్తులన్ని చెదలు పట్టెను నాడు
ఆత్మగౌరవంతో అభివృద్ధి చెందుతున్నయి నేడు…
లస్మక్కా… నాడు పల్లెలన్నీ ఎట్లుండెనే
పచ్చని చెట్లతో ప్రకృతి పల్లె వనాలతో
ఆకుపచ్చ చీర కట్టినట్లు దర్శనమిస్తున్నయి నేడు…
స్వచ్ఛతకు మారు పేరై మెరిసిపోతున్నయి నేడు…
-అశోక్ గోనె, 94413 17361