Cauliflower | మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో కాలిఫ్లవర్ కూడా ఒకటి. దీనిని గోబీ అని కూడా పిలుస్తారు. ఇది ఒక బహుముఖ కూరగాయ అని చెప్పవచ్చు. దీంతో కూర, పచ్చడి, ఫ్రై, పరాఠా, వడలు, పకోడి ఇలా అనేక రకాల వంటకాలు తయారు చేస్తూ ఉంటారు. కాలిఫ్లవర్ తో చేసే వంటకాలు ఏవైనా చాలా రుచిగా ఉంటాయి. రుచిగా ఉండడంతో పాటు కాలిఫ్లవర్ ను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. అయితే కాలిఫ్లవర్ ను వండేటప్పుడు మనకు తెలియకుండానే చాలా తప్పులు చేస్తూ ఉంటామని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కాలిఫ్లవర్ ను వండటం అంత సులభం కాదని దాని ఆకృతి, రుచి, అతిగా ఉడికించడం, పోషక విలువలను ప్రభావితం చేసే తప్పులు చేస్తూ ఉంటామని వారు తెలియజేస్తున్నారు. రుచితో పాటు పోషకాలు కూడా కావాలనుకుంటే కాలిఫ్లవర్ ను వండేటప్పుడు శ్రద్ద వహించాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. కాలిఫ్లవర్ ను వండేటప్పుడు చేయకూడని తప్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కాలిఫ్లవర్ ను కడిగిన తరువాత ఆరబెట్టాలి. చాలా మంది కాలిఫ్లవర్ ను కడిగి నేరుగా పాన్ లో వేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల కాలిఫ్లవర్ వేగడానికి బదులుగా తడి కారణంగా ఆవిరి పడుతుంది. దీంతో కాలిఫ్లవర్ ముద్దగా అవ్వడంతో పాటు దాని ఆకృతిని, రుచిని కూడా కోల్పోతుంది. అలాగే ఈ ఆవిరి పోవడానికి దీనిని చాలా మంది ఎక్కువ సమయం పాటు వేయిస్తూ ఉంటారు. దీంతో దీనిలో ఉండే పోషకాలు కూడా పోతాయి. కనుక కాలిఫ్లవర్ ను కడిగిన తరువాత తడి పోయే వరకు ఆరబెట్టడం మంచిది. అలాగే కాలిఫ్లవర్ ను ఒకే రీతిలో ముక్కలుగా కట్ చేయాలి. ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా కట్ చేయడం వల్ల అవి ఉడకడంలో తేడాలు వస్తాయి. కొన్ని ముక్కలు గట్టిగా ఉండడంతో కొన్ని ముక్కలు మెత్తగా అయిపోతాయి. ఇది కూర మొత్తం రుచిని పాడు చేస్తుంది. కనుక రుచి కోసం కాలిఫ్లవర్ ముక్కలను ఒకేరీతిలో కట్ చేయడం మంచిది.
చాలా మంది కాలిఫ్లవర్ ను తక్కువ, మధ్యస్థ మంటపై ఉడికిస్తారు. మనం చేసే సాధారణ తప్పుల్లో ఇది ఒకటి. తక్కువ మంటపై వేయించడం వల్ల వగరు రుచి వస్తుంది. రుచిగా ఉండడంతో పాటు బంగారు క్రస్ట్ రావడానికి కాలిఫ్లవర్ ను ఎల్లప్పుడూ అధిక ఉష్ణోగ్రత మీద కాల్చాలి.
అదే విధంగా కాలిఫ్లవర్ త్వరగా వేగడానికి చాలా మంది ముందుగానే ఉప్పు చల్లుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల వంట తేమగా, మెత్తగా అవుతుంది. ఇలా అస్సలు చేయకూడదు. వంటకం పొడిగా రావడానికి వంట మధ్యలో లేదా చివర్లో ఉప్పును చల్లాలి. ఇలా చేయడం వల్ల కూర క్రంచీగా ఉంటుంది. ఇక కాలిఫ్లవర్ వంట చేసిన వెంటనే వడ్డించకూడదు. వంట చేసిన కొంత సమయం తరువాత వడ్డించాలి. కూరను వండిన తరువాత కొన్నినిమిషాలు అలాగే ఉంచడం వల్ల సుగంధ ద్రవ్యాలు స్థిరపడి వంట రుచి పెరుగుతుంది.
అలాగే చాలా మంది పాన్ పూర్తిగా వేడికాక ముందే కాలిఫ్లవర్ ను పాన్ లో వేసి వేయిస్తారు. ఇది కూడా మనం చేసే చిన్న తప్పుల్లో ఒకటి. ఇది కూర ఆకృతిని , రుచిని ప్రభావితం చేస్తుంది. పాన్ తగినంత వేడిగా అయిన తరువాతే కాలిఫ్లవర్ ను పాన్ లో వేసి వేయించాలి. అలాగే వంట చేసే ముందు కాలిఫ్లవర్ ను కట్ చేసి కొన్ని నిమిషాల పాటు వేడి నీటిలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల దానిపై ఉండే దుమ్ము, మురికి, కీటకాలు తొలగిపోతాయి. ఇలా చేయడం వల్ల కాలిఫ్లవర్ తోచేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు పోషకాలు కూడా పోకుండా ఉంటాయి.